కందుకూరు ఐటీఐ కాలేజీ
కందుకూరు: విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ అధికారులు ఆటలాడుతున్నారు. కాలేజీల్లో చేరి కోర్సు పూర్తి చేసి మూడున్నరేళ్లు అవుతున్నా నేటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.
పరిస్థితి ఇలా..
కందుకూరులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 2014–15 విద్యా సంవత్సరంలో వివి«ధ విభాగాల్లో వందల మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఒక సంవత్సరం కోర్సులైన డీజిల్ మెకానిక్, కోఫా కోర్సులతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి రెండు సంవత్సరాల కోర్సులకు చెందిన విద్యార్థులు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక బయటకు వెళ్లారు. అయితే కోర్సు పూర్తి అయినట్లు కేవలం మార్కుల మెమోలు మాత్రమే ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఉండే ఎన్‌టీసీ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) ఇవ్వలేదు. ఇది వస్తేనే ఐటీఐ కోర్సు పూర్తి చేసినట్లు లెక్క. ఎన్‌టీసీ సర్టిఫికెట్స్ ఢిల్లీలోని డైరెక్టర్‌రేట్ ఆఫ్ సాంకేతిక విద్యాశాఖ అయిన ఢిల్లీ నుంచి ఈ సర్టిఫికెట్లు రావాల్సి ఉంది. దీనిపై విద్యార్థులు కాలేజీ అధికారులను ఎప్పుడు అడిగినా ఢిల్లీ నుంచి రావాలి ఇంకా రాలేదు.
మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటున్నారు. అయితే ఒంగోలు ఐటీఐ కాలేజీలో అదే ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రం సర్టిఫికెట్స్ రావడం గమనార్హం. కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం దీనికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందని చెప్తున్నారు. ఇదే విషయంపై ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్తున్నారు. కందుకూరు కాలేజీకి సంబంధించి పెండింగ్ సర్టిఫికెట్లు ఉన్నట్లు జాబితానే రాలేదని చెప్తున్నారు.
అప్రంటిస్ ఎలా?
సాధారణంగా ఐటీఐ కోర్సులైన డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో అప్రంటిస్‌గా ఎక్కడో ఒకచోట పనిచేయాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలు కచ్చితంగా అప్రంటిస్ శిక్షణను కూడా పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి అయితేనే ఐటీఐ కోర్సుకు విలువ ఉంటుంది. అప్పుడే ఏ ప్రైవేట్ కంపెనీల్లో అయినా ఉద్యోగాల్లో చేరేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తి చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐదు సంవత్సరాల్లోపు అప్రంటిస్‌గా పనిచేయాలి.
ఉద్యోగాలకు అనర్హులే..
ప్రస్తుతం ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలు ఐటీఐ విద్యార్థులకు వరం. కానీ స్థానిక ఐటీఐ కాలేజీ అధికారులు నిర్లక్ష్యం పుణ్యమా అంటూ ఆ విద్యార్థులు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఎన్‌టీసీ సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో చేరాలన్నా అనర్హులే. దీంతో ఆ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
మూడున్నరేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం,
2014–15లో ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. మూడున్నర సంవత్సరాలుగా సర్టిఫికెట్‌ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నాం. అడిగినప్పుడల్లా రెండు నెలల్లో వస్తాయని చెప్తున్నారు. ఒంగోలు వెళ్లి ఐటీఐ కన్వీనర్‌ను కలిస్తే మీ కాలేజీ వాళ్లు వివరాలు పంపలేదు. అందుకే రాలేదని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, 1100కి కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు కూడా సంబంధిత అధికారులకు చెప్తామన్నారు. కానీ ఏ న్యాయం జరగలేదు.- కె. ఫణిదర్, డీజిల్ మెకానిక్ విద్యార్థి
ఏ ఉద్యోగాలకూ తీసుకోవడం లేదు: ఐటీఐ కోర్సు పూర్తి చేశామన్నా ఏ ఉద్యోగానికి ఎవరూ తీసుకోవడం లేదు. కచ్చితంగా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కనీసం ఆర్టీసీలో అప్రంటీస్‌గా చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అలాగే మూడేళ్లుగా అనేక ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీ దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికేట్‌లు లేక అనర్హులం అవుతున్నాం. మా భవిష్యత్ పూర్తిగా నాశనం అయింది. సర్టిఫికెట్స్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఎం. పవన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment