ఐటీఐలకు స్టార్ రేటింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లకు గ్రేడింగ్‌లు కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 13,000 ఐటీఐల్లో ఇప్పటికే 3,500 ఐటీఐలకు గ్రేడింగ్ ఇవ్వడం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐటీఐల్లో అత్యుత్తమంగా రాణించిన సంస్థలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యుత్తమ ఐటీఐలవైపు విద్యార్థులను, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించారు.
ఐటీఐల్లో మౌలిక వసతులు, పరిశ్రమలతో అనుసంధానం, యంత్ర పరికరాల లభ్యత, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది తదితర 43 అంశాలపై గ్రేడింగ్‌లు కేటాయించనున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) రెండు దశల్లో అన్ని ఐటీఐలను సమీక్షించి గ్రేడింగ్ ఇవ్వనుంది. గ్రేడింగ్‌తో పాటు 3 స్టార్ల కంటే అధికంగా రేటింగ్ సాధించే ఐటీఐలకు వివిధ పథకాల కింద ప్రపంచ బ్యాంకు నిధుల్ని అందించనున్నారు. సదరు విద్యాసంస్థల ప్రిన్సిపల్స్‌కు దేశ, విదేశాల్లోని అత్యున్నత సంస్థల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.