బద్వేలు: దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు రాణించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీఎస్) పథకం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. దీనికోసం ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
అర్హులు వీరే...
పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ), పాలిటెక్నిక్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఈ తరహా రుణం పొందేందుకు అర్హులు.
రిజిస్ట్రేషన్ ఇలా
ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్‌ఎస్‌డీసీఐఎన్‌డీఐఏ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత కనిపించే ముఖచిత్రంలో అవర్‌వర్క్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో పైభాగంలో లాగిన్ కాలమ్ ఓపెన్ చేసి సబ్మిట్ ప్రపొజల్, ఎన్‌ఎస్‌డీసీ ట్రైనింగ్ ప్యాట్రన్ తదితర కాలమ్స్‌తో పాటు సిటిజన్ పోర్టల్ లాగిన్ వద్ద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన విండో వద్ద న్యూయూజర్ వద్ద క్లిక్ చేస్తే సైన్‌అప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ పథకానికి సంబధించి ఏపీలో 37 ప్రాంతాలలో వివిధ రంగాలకు సంబంధించిన శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
రుణాలు, మంజూరు, చెల్లింపులు ఇలా...
♦ అభ్యర్థులకు ట్యూషన్/కోర్సు ఫీజు, పరీక్ష రుసుం, గ్రంథాలయ ఫీజు, ప్రయోగశాల ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరిస్థితులను బట్టి వసతి కోసం అయ్యే ఖర్చులు, కోర్సుకు అవసరమయ్యే ఇతర వస్తువుల ఖర్చులకు రుణాలను ఇస్తారు.
♦ రూ.ఐదు వేల నుంచి రూ.1.50లక్షల వరకు ఈ పథకం కింద రుణం ఇస్తారు.
♦ ఈ రుణాలపై ఎటువంటి మార్జిన్ మనీ కట్టాల్సిన పని లేదు.
♦ రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. ప్రస్తుతం ఈ తరహా రుణాలకు బ్యాంకు వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం ఉంది. నైపుణ్యాభివృద్ధి రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తగినంత గడువు ఇస్తారు. ఏడాదిలోపు కోర్సులకు కోర్సు పూర్తి చేసిన ఆరు నెలల వరకు, సంవత్సరం పైబడిన కోర్సులకు కోర్సు పూర్తి చేసిన తరువాత 12 నెలల మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో సాధారణ వడ్డీని వసూలు చేస్తారు.
♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తీసుకున్న నగదు పరిమాణాన్ని బట్టి గడువు ఇస్తారు.
♦ రూ.50 వేలకు మూడేళ్లు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఐదేళ్లు, రూ.లక్ష పైబడిన రుణానికి ఏడేళ్లు గడువు ఉంటుంది.
♦ రుణగ్రహీత ఎటువంటి ముందస్తు రుసుంలు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ప్ర మాదం/మరణం/వైకల్యం కారణంగా అభ్యర్థులు కోర్సు పూర్తి చేయలేకపోతే శిక్షణ సంస్థ నుంచి మిగిలిని శిక్షణ కాలానికి సంబంధించిన సొమ్మును ప్రొనేటా రీఎంబర్స్‌మెంట్ పద్ధతిలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. బ్యాంకులు అర్హత కలిగిన అభ్యర్థులకు పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీని ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఉపాధిని పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment