ఐటీఐలకు సాంకేతిక సొబగులు!
⇒ ఇకపై ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే..
⇒ బయోమెట్రిక్ పద్ధతిలో టీచర్లు, విద్యార్థుల హాజరు
⇒ 10 ఐటీఐలకు ఎన్‌సీవీటీ గుర్తింపు కోసం దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేప థ్యంలో రాష్ట్రం లోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు లో భాగంగా ఐటీఐలలో బయో మెట్రిక్ పరికరాలు అమర్చనుంది. ఇప్పటికే కొన్ని ఐటీఐ ఈ పరికరాలు వినియోగిస్తున్నప్పటికీ.. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని ఐటీఐల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తీసుకోవడంతో పాటు నిర్వహణకు సంబం ధించి పలు అంశాలకు వీటిని వినియోగించుకోనుంది.
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు..
రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటివరకు నేరుగా జరిగేది. దీంతో విద్యార్థులు సకాలంలో ప్రధాన కేంద్రాలకు హాజరు కావడంలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తోంది. పదోతరగతి పూర్తిచేసుకుని ఐటీఐ చదవాల నుకునే విద్యార్థి నేరుగా వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైతే సీటు కేటాయిస్తారు. కాగా, రాష్ట్రంలోని 65 ఐటీఐలకు గాను 55 ఇన్‌స్టిట్యూట్‌లకే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) గుర్తింపు ఉంది. మిగిలిన 10 ఐటీఐలకు ఎన్‌సీవీటీ అనుమతి కోసంఉపాధి కల్పన శాఖ దరఖాస్తు చేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వాటికి అనుమతులు వస్తాయని ఆ శాఖ కమిషనర్ కె.వై.నాయక్ పేర్కొన్నారు.