మే నాటికి.. అన్ని శాఖల్లోనూ బయోమెట్రిక్
►పూర్తి కావచ్చిన ఉద్యోగుల రిజిస్ట్రేషన్
►జిల్లాలోని 25 శాఖల్లో అనుసంధానం పూర్తి
► ఐదుశాఖల్లో పూర్తిస్థాయిలో అమలు
నగరంపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ఇకపై బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం (బీఏఎస్) ద్వారా హాజరు వేయనున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జౌఠి.జీలో అటెండెన్స్ అనే పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి అన్ని రాష్ట్రాల వారు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనిలో జిల్లాల వారీగా అన్ని రాష్ట్రప్రభుత్వ శాఖల ఉద్యోగుల వివరాలు నమోదు చేసే బాధ్యతను నేషనల్ ఇన్‌ఫర్‌మేటిక్స్‌సెంటర్‌కు అప్పగించారు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయిలోని అన్ని శాఖల అధికారులు కూడా బీఏఎస్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఎన్‌ఐసీ అధికారులను సంప్రదించాలని నెలరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
కార్యాలయంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు వెబ్‌సైట్‌లో సిబ్బంది వివరాలు అప్‌లోడ్ చేసే విధానాన్ని ఎన్‌ఐిసీ అధికారులు అవగాహన కల్పించారు. కార్యాలయం హెచ్‌వోడిని నోడల్ అధికారిగా రిజిష్టర్ చేసి నమోదులు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు యూజర్‌నేమ్, పాస్‌వర్డు కేటాయించారు. ఉద్యోగుల అధార్ కార్డుల నెంబరు అందించిన వెంటనే అతని వివరాలు, ఫొటో, ఫింగర్‌ప్రింట్స్ వెబ్‌సైట్ అప్లికేషన్‌లోకి చేరుతాయి. కార్యాలయంలో ఆ ఉద్యోగి హోదా తదితర వివరాలను నోడల్ అధికారి అమోదించడంతో ఉద్యోగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. జిల్లాలోని ఆయా శాఖల పరిధిలోని ఉపకార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని నోడల్ అధికారే రిజిష్టర్ చేయవచ్చు.
ఇప్పటికే జిల్లాకేంద్రంలోని 25 శాఖల ఉద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. డీఆర్‌డీఏ, డీఎంహెచ్‌వో, డీపీవో, జెడ్పీల్లో ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగుల హాజరు నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేసిన వెంటనే మిగతా శాఖల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మే నాటికి జిల్లాలోని అన్ని శాఖలలో బీఏఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
అన్ని స్థాయి అధికారుల పర్యవేక్షణ
బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం అమలు అవుతున్న ప్రభుత్వశాఖలలో ఉద్యోగులు కార్యాలయానికి వచ్చే పనివేళలు హెచ్‌వోడీ నుంచి అన్ని స్థాయిల అధికారులు అన్‌లైన్‌లో చూసే వీలుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులు కూడా జిల్లాలోని తమ కార్యాలయాల్లో హాజరుశాతాన్ని, ఒక ఉద్యోగి సమయపాలనను తెలుసుకొనవచ్చు.
సాధరణ ప్రజలు సైతంandrapradesh. atendence. gov.in హోమ్ పేజీలో బీఏఎస్ అమలవుతున్న కార్యాలయాల్లో ఆ రోజుకు సంబంధించి ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్న, వెళుతున్న సమయం, పనిగంటలు తెలుసుకోవచ్చు. ఉద్యోగులు కూడా ఇంటి నుంచే ముందస్తు సెలవులు, అత్యవసర సెలవులను వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి నోడల్ అధికారికి ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసం ట్రెజరరీలకు అనుసంధానం చేసేలా అప్‌డేట్ చేయనున్నారు.