దేశంలో ఐటీఐలు చాలా పూర్‌ | NITI Aayog study report revealed On ITIs in country | Sakshi
Sakshi News home page

దేశంలో ఐటీఐలు చాలా పూర్‌

Published Sun, Feb 5 2023 4:30 AM | Last Updated on Sun, Feb 5 2023 7:40 AM

NITI Aayog study report revealed On ITIs in country - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధలు)ల పనితీరు చాలా పేలవంగా ఉందని, వాటిని తక్షణం సంస్కరించి, అధునాతనంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్‌ సూచించింది. నీతి ఆయోగ్‌ అధ్యయన బృందం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటుఐటీఐలను స్వయంగా సందర్శించింది.

అక్కడి విద్యార్థులు, బోధకులతో మాట్లాడటంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశ్రమల అనుసంధానం తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఐటీఐల్లో శిక్షణ పొందిన వారిలో ప్లేస్‌మెంట్‌ కేవలం 0.90 శాతమే ఉందని ఆ నివేదిక పేర్కొంది.

దేశం మొత్తం మీద 2021 సంవత్సరంలో 4,14,247 మంది ఐటీఐల్లో శిక్షణ పొందితే 405 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్‌ పొందినట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 7,676 మంది విద్యార్థుల్లో 248 మందికి అంటే 3.2 శాతం ప్లేస్‌మెంట్స్‌ పొందారని, ఆ తరువాత గుజరాత్‌లో 0.25 శాతం ప్లేస్‌మెంట్స్‌ ఉండగా మిగతా రాష్ట్రాల్లో  చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక వివరించింది.

దేశంలో ప్రత్యేకంగా మహిళా ఐటీఐలు 2021 నాటికి 16.83 శాతం ఉంటే అందులో చేరికలు కేవలం 6.6 శాతమే. బోధకుల్లోనూ మహిళలు 15.83 శాతమే ఉన్నారు. ఇక్కడ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రధానాంశాలివీ.. 

ప్రభుత్వ ఐటీఐలకే విద్యార్థుల ప్రాధాన్యత 
దేశవ్యాప్తంగా 14,789  ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొత్తం 25,38,487 సీట్లు ఉండగా, వీటిలో 48.20 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. మొత్తం ఐటీఐల్లో 78.40 శాతం ప్రైవేటు రంగంలో, మిగతావి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయితే, సీట్ల భర్తీలో ప్రైవేట్‌కన్నా ప్రభుత్వ ఐటీఐలే మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 43.07 శాతం సీట్లు భర్తీ అవుతుండగా ప్రభుత్వ ఐటీఐల్లో సీట్ల భర్తీ 56.74 శాతం ఉందని నివేదిక పేర్కొంది.

అత్యంత ఆదరణ పొందిన ట్రేడ్‌లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటారు వెహికల్‌ మెకానిక్, డ్రాప్ట్స్‌మెన్‌ మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఉన్న సీట్లలో 64.81 శాతం,  ఫిట్టర్‌ ట్రేడ్‌లో 71.57 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో 35.19 శాతం, ఫిట్టర్‌లో 28.43 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. 

అప్రెంటిస్‌లుగానే ఉపాధి 
ఐటీఐల్లో విద్యార్ధుల అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఐటీఐల్లో ప్లేస్‌మెంట్స్‌ 80 శాతం ఉంటున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులు కెరీర్‌ పట్ల భరోసాతో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వెంచర్‌ ప్రారంభించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. మరికొందరు బోధకులుగా మారాలనుకుంటున్నారు.

మధ్యస్థాయి, తక్కువ స్థాయి ఐటీఐల్లో అతి కొద్ది సంస్థల్లో మాత్రమే 20 శాతానికి పైగా ప్లేస్‌మెంట్స్‌ పొందుతున్నారు. ఐటీఐ విద్యార్థులను సంస్థలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్‌లుగానే పరిగణిస్తున్నాయి. సాధారణంగా ఐటీఐ అభ్యర్థుల కనీస వేతనం నెలకు రూ.20 వేలుగా ఉంది.

చాలా కంపెనీలు ఐటీఐ అభ్యర్ధులను ఉద్యోగులుగా కాకుండా రిపేర్ల కోసం అప్రెంటిస్‌లగానే తీసుకుంటున్నాయి. వీరికి నెలకు రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 18 సంవత్సరాల వయస్సుగల వారు కావడం, సౌకర్యాల కోసం డిమాండ్‌ చేయడం. 

ఇవీ అసౌకర్యాలు 
ఐటీఐల్లో సరైన బోధకులు లేరు. మంజూరైన బోధకుల పోస్టుల్లో 36 శాతమే ఉన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ బోధకుల్లో సమర్ధత లేదు. ఐటీఐల్లో శిక్షణకు అవసరమైన లేబోరేటరీలు, సాధనాల కొరత తీవ్రంగా ఉంది. ఐటీఐలకు కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement