Minority investors
-
మైనారిటీ ఇన్వెస్టర్లకు బాసట
న్యూఢిల్లీ: మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంపై కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీల చట్టం కింద క్లాస్ యాక్షన్ దావాలు వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రత్యేక స్కీమును సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా సంస్థ యాజమాన్యం తీరు, నిర్వహణ తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని భావించిన పక్షంలో మదుపుదారులు ఒక గ్రూప్‌గా ఏర్పడి కంపెనీపై దావా వేయడాన్ని క్లాస్ యాక్షన్ దావాగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ తరహా దావా వేసేందుకు దేశీయంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 245 కింద వెసులుబాటు ఉంది. ‘క్లాస్ యాక్షన్ దావాలను పరిశీలిస్తున్నాం. మదుపుదారుల అవగాహన, రక్షణ నిధి ఐఈపీఎఫ్ కింద క్లాస్ యాక్షన్ దావా వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు త్వరలో ఒక స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నాం. క్లాస్ యాక్షన్‌కి సంబంధించి న్యాయ సేవలకు అయిన వ్యయాలను రీయింబర్స్ చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. క్లాస్ యాక్షన్ వేసేందుకు అవసరమైన కనీస మదుపుదారుల సంఖ్య, కనీస షేర్ హోల్డింగ్ లేదా డిపాజిట్లు మొదలైన అంశాలను నిర్వచించడం జరుగుతుంది. వీటిని కూడా త్వరలోనే నోటిఫై చేస్తాం‘ అని శ్రీనివాస్ వివరించారు. ఈ పరిమితులను సోమవారం నోటిఫై చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనైతే కనీస వాటా 5 శాతంగాను, లిస్టెడ్ సంస్థల్లోనైతే 2 శాతంగా ఉండేట్లుగా పరిమితి నిర్దేశించే అవకాశం ఉంది. ఆడిటర్లు, రేటింగ్ ఏజెన్సీలకు కూడా వర్తింపు ఇటీవల అక్రమ నిధుల సమీకరణ స్కీములు, కొన్ని కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మోసపూరిత విధానాలతో ఇన్వెస్టర్లు మోసపోతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో క్లాస్ యాక్షన్ దావాలు మరింతగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సాధారణంగా మైనారిటీ ఇన్వెస్టర్లకు క్లాస్ యాక్షన్ దావాల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పెద్దగా అవగాహన ఉండదు. తీవ్రంగా నష్టపోయిన వారికి ఇది గొప్ప ఆయుధం లాంటిది. ఆడిటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు... ఇలా ఎవరిపైనైనా సరే క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు. నష్టాలతో సతమతమవుతున్న మైనారిటీ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా దీన్ని ఎంచుకోవచ్చు. ఈ దిశగా ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది‘ అని శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భారత్‌లో వ్యాపార పవనాలు
బిజినెస్ అనుకూల దేశాల జాబితాలో 12 స్థానాలు జంప్, 130వ ర్యాంకు * మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణలో 8వ స్థానం * ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. భారత్ వంటి భారీ దేశం ఒక్కసారిగా 12 స్థానాలు దూసుకెళ్లడం చెప్పుకోతగ్గ విజయమేనని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు ఇది సానుకూల సంకేతమన్నారు. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. కనీస పెట్టుబడి పరిమితి నిబంధనలను తొలగించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించడాన్ని భారత్ మరింత సులభతరం చేయడం సానుకూలాంశమని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. విద్యుత్ కనెక్షను అనుమతులు (70వ స్థానం), నిర్మాణ అనుమతులు (183వ స్థానం), ప్రాపర్టీ నమోదు (138వ ర్యాంకు) తదితర అంశాలు భారత ర్యాంకింగ్‌కు ప్రాతిపదికగా నిల్చాయి. ఇక వ్యాపారాల ప్రారంభానికి పట్టే సమయం విషయంలో భారత్ 164వ స్థానం నుంచి 155వ ర్యాంకుకు చేరడం చెప్పుకోతగ్గ మరో పరిణామం. భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే 12 పైగా ప్రక్రియలు పాటించాల్సి వస్తోంది. ఇందుకు 29 రోజులు పడుతోంది. నిర్మాణ అనుమతులు విషయంలో భారత ర్యాంకింగ్ స్వల్పంగా 184వ స్థానం నుంచి 183వ స్థానానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో మాత్రం 99వ ర్యాంకు నుంచి 70వ స్థానానికి ఎగబాకింది. అయితే, రుణ సదుపాయం లభ్యత, పన్నుల చెల్లింపుల విషయంలో మాత్రం దేశ ర్యాంకింగ్ తగ్గింది. మరోవైపు, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరిరక్షించడంలో భారత్ అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో అమెరికా (35), జర్మనీ (49), జపాన్ (36) వంటి పలు సంపన్న దేశాల కన్నా కూడా ముందు నిల్చింది. బ్రిక్స్ కూటమిలో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) భారత్ మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. జీఎస్టీ అమలు కీలకం.. భారత ర్యాంకింగ్ పెరగడానికి విద్యుత్ లభ్యత, కొత్త కంపెనీల చట్టం తదితర అంశాలు దోహదపడ్డాయని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా ప్రపంచ బ్యాంకు భారత విభాగం డెరైక్టరు ఒనో రుహల్ చెప్పారు. భారత్‌ను ఒకే పెద్ద మార్కెట్‌గా మార్చడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధాన సంస్కరణ అమలు కీలకమని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తెస్తే.. 2018 నాటికి ఆ ప్రభావాలు కనిపించడం మొదలు కాగలదని ఒనో రుహల్ పేర్కొన్నారు. అయితే, వ్యాపారాల విషయంలో భారత్ స్కోరు మెరుగుపడటానికి ఇదొక్కటే సరిపోదని, మరిన్ని సంస్కరణలు అవసరమవుతాయని వివరించారు. టాప్ 100లో చేరే సత్తా ఉంది.. నిర్దేశించుకున్న ఆర్థిక సంస్కరణలను భారత్ అమల్లోకి తెస్తే వచ్చే ఏడాది టాప్ 100 దేశాల జాబితాలో చేరడం కష్టమేమీ కాదని కౌశిక్ బసు చెప్పారు. ఇందుకోసం జీఎస్టీని అమలు చేయడం, బ్యూరోక్రసీపరమైన అడ్డంకులు తొలగించడం కీలకమన్నారు. సాధారణంగా ఇతర దేశాలు సంస్కరణలు చేపట్టిన తొలి ఏడాది స్వల్పంగా, ఆ తర్వాత రెండు.. మూడు సంవత్సరాల్లో గణనీయంగా ర్యాంకులు మెరుగుపర్చుకుంటాయని బసు చెప్పారు. కానీ, భారత్ తొలి ఏడాదిలోనే చెప్పుకోతగ్గ స్థాయిలో ర్యాంకు మెరుగుపర్చుకుందన్నారు. ర్యాంకు మరింత పెంచుకుంటాం: జైట్లీ ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఇచ్చిన తాజా ర్యాంకింగ్.. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం పూర్తిగా ప్రతిబింబించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ స్థానం వచ్చే ఏడాది మరింతగా మెరుగుపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 దాకా గణాంకాల ఆధారంగానే ప్రస్తుత ర్యాంకింగ్ ఉందని, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యల ప్రభావం వచ్చే ఏడాది కనిపించగలదని జైట్లీ చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలాగే కంపెనీల చట్టంలోని సంక్లిష్టతలను తొలగించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
ఇన్వెస్టర్ పరిరక్షణలో భారత్ భేష్
* ప్రపంచబ్యాంక్ నివేదికలో 7వ స్థానం * 21 నుంచి ముందుకు జంప్ న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణలో భారత్ 7వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ది ఈ విషయంలో మొదటి స్థానం. వ్యాపార నిర్వహణకు సంబంధించి తన వార్షిక నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ విషయాన్ని తెలిపింది. న్యూజిలాండ్ తరువాతి వరుసలో హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్, మలేషియా, ఐర్లాండ్ ఉన్నాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ మైనారిటీ ఇన్వెస్టర్ (ప్రమోటర్లు మినహా పబ్లిక్ ఇన్వెస్టర్లు) రక్షణలో ముందుండడం విశేషం. మైనారిటీ ఇన్వెస్టర్లకు సంబంధించి భారత్‌లో క్యాపిటల్ మార్కెట్ అలాగే కంపెనీల చట్టాలు, నిబంధనల పటిష్టత-సంస్కరణలకు ఈ నివేదిక ఊతం ఇచ్చినట్లయ్యింది. ఈ విషయంలో భారత్‌తో పాటు కెనడా, అల్‌బేనియాలకు కూడా ఏడవ ర్యాంక్‌నే ప్రపంచబ్యాంక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది భారత్‌ది ఈ విషయంలో 21వ ర్యాంక్. వ్యాపారాలకు అనువైన దేశాల్లో భారత్ ర్యాంక్ 142..! కాగా మొత్తం 10 అంశాల్లో ర్యాంకింగ్స్ ప్రాతిపదికన 189 దేశాలకు ‘వ్యాపారాలకు అనువైన దేశాల’ ర్యాకిం గ్స్‌ను ప్రపంచబ్యాంక్ ఇస్తుంది. ఈ అంశాల్లో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఒకటి. మొత్తంగా 10 అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ‘వ్యాపారాలకు అనువైన దేశాల’ ర్యాకిం గ్స్‌ను చూస్తే భారత్‌కు వచ్చిన ర్యాంక్ 142. గత ఏడాదితో పోల్చితే భారత్ ర్యాంక్ మరో రెండు స్థానాలకు తగ్గింది. కాగా, ఈ ర్యాకింగ్స్లో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది.