మైనారిటీ ఇన్వెస్టర్లకు బాసట  | Govt set to provide financial assistance to minority investors for class action lawsuits | Sakshi
Sakshi News home page

మైనారిటీ ఇన్వెస్టర్లకు బాసట 

Published Tue, May 7 2019 1:16 AM | Last Updated on Tue, May 7 2019 1:16 AM

Govt set to provide financial assistance to minority investors for class action lawsuits - Sakshi

న్యూఢిల్లీ: మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంపై కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీల చట్టం కింద క్లాస్‌ యాక్షన్‌ దావాలు వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రత్యేక స్కీమును సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఏదైనా సంస్థ యాజమాన్యం తీరు, నిర్వహణ తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని భావించిన పక్షంలో మదుపుదారులు ఒక గ్రూప్‌గా ఏర్పడి కంపెనీపై దావా వేయడాన్ని క్లాస్‌ యాక్షన్‌ దావాగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ తరహా దావా వేసేందుకు దేశీయంగా కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 245 కింద వెసులుబాటు ఉంది. ‘క్లాస్‌ యాక్షన్‌ దావాలను పరిశీలిస్తున్నాం. మదుపుదారుల అవగాహన, రక్షణ నిధి ఐఈపీఎఫ్‌ కింద క్లాస్‌ యాక్షన్‌ దావా వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు త్వరలో ఒక స్కీమ్‌ ప్రవేశపెట్టబోతున్నాం. క్లాస్‌ యాక్షన్‌కి సంబంధించి న్యాయ సేవలకు అయిన వ్యయాలను రీయింబర్స్‌ చేసేందుకు ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. క్లాస్‌ యాక్షన్‌ వేసేందుకు అవసరమైన కనీస మదుపుదారుల సంఖ్య, కనీస షేర్‌ హోల్డింగ్‌ లేదా డిపాజిట్లు మొదలైన అంశాలను నిర్వచించడం జరుగుతుంది. వీటిని కూడా త్వరలోనే నోటిఫై చేస్తాం‘ అని శ్రీనివాస్‌ వివరించారు. ఈ పరిమితులను సోమవారం నోటిఫై చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్లాస్‌ యాక్షన్‌ దావా వేసేందుకు అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లోనైతే కనీస వాటా 5 శాతంగాను, లిస్టెడ్‌ సంస్థల్లోనైతే 2 శాతంగా ఉండేట్లుగా పరిమితి నిర్దేశించే   అవకాశం ఉంది. 

ఆడిటర్లు, రేటింగ్‌ ఏజెన్సీలకు కూడా వర్తింపు
ఇటీవల అక్రమ నిధుల సమీకరణ స్కీములు, కొన్ని కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, మోసపూరిత విధానాలతో ఇన్వెస్టర్లు మోసపోతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో క్లాస్‌ యాక్షన్‌ దావాలు మరింతగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సాధారణంగా మైనారిటీ ఇన్వెస్టర్లకు క్లాస్‌ యాక్షన్‌ దావాల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పెద్దగా అవగాహన ఉండదు. తీవ్రంగా నష్టపోయిన వారికి ఇది గొప్ప ఆయుధం లాంటిది. ఆడిటర్లు, క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు... ఇలా ఎవరిపైనైనా సరే క్లాస్‌ యాక్షన్‌ దావా వేయొచ్చు. నష్టాలతో సతమతమవుతున్న మైనారిటీ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా దీన్ని ఎంచుకోవచ్చు. ఈ దిశగా ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది‘ అని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement