విదేశాల్లో మేనేజ్‌మెంట్ విద్యకు.. జీమ్యాట్ | Management education abroad .. GMAT | Sakshi
Sakshi News home page

విదేశాల్లో మేనేజ్‌మెంట్ విద్యకు.. జీమ్యాట్

Published Sun, Apr 20 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

విదేశాల్లో మేనేజ్‌మెంట్ విద్యకు.. జీమ్యాట్

విదేశాల్లో మేనేజ్‌మెంట్ విద్యకు.. జీమ్యాట్

విదేశీ విద్య
 
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
 
 మనదేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్‌బీ-హైదరాబాద్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జంషెడ్‌పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
 
 నిబంధనలు:
 జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది.
 
 పరీక్ష:
 మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి.
 ఎనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్: ఇందులో ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విధానంలో ప్రశ్న ఉంటుంది. ఇందులో రాణించాలంటే నిర్దేశిత అంశాలకు చెందిన కాన్సెప్ట్స్‌పై అవగాహన పొందే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఇచ్చిన నిర్దేశిత అంశం ఉద్దేశం ఏమిటి? అందులో కీలక ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? వాటి వల్ల కలిగే పర్యవసానాలు, ఫలితాలు ఏంటి? తదితర అంశాలను గుర్తించాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానాలు రాయాలి. ఈ విభాగానికి కేటాయించిన సమయం 30 నిమిషాలు.
 
 ఇంటిగ్రేటెడ్ రీజనింగ్: ఇందులో 12 ప్రశ్నలు ఇస్తారు. టేబుల్ ఎనాలిసిస్, మల్టీసోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్‌ప్రిటేషన్‌లపై ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.
 
 క్వాంటిటేటివ్: ఈ విభాగంలో అడిగే ప్రశ్నల సంఖ్య 37. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లం సాల్వింగ్‌లపై ప్రశ్నలు ఉంటాయి. 75 నిమిషాల్లో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో రాణించాలంటే ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మినహారుుంపులు, ముగింపు, వాదనలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అర్థమెటిక్, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీల్లో పట్టు ఉంటే మంచి స్కోరు సాధించొచ్చు.
 
 వెర్బల్: ఇందులో భాగంగా రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్‌లపై మొత్తం 41 ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్లో... ఇచ్చిన ప్యాసేజ్ ను అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ ఎబిలిటీని పెంచుకుంటే ఇందులో రాణించొచ్చు. కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్, ఎఫెక్టివ్ ఎక్స్‌ప్రెషన్, ప్రాపర్ డిక్షన్ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే సెంటెన్స్ కరెక్షన్‌లో మంచి స్కోరు సాధిస్తారు. క్రిటికల్ రీజనింగ్ ద్వారా అభ్యర్థిలోని లాజికల్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఇందులో ఇచ్చిన ఆర్గ్యుమెంట్‌ను సరిగ్గా విశ్లేషించి సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి నిర్దేశించిన కాలపరిమితి 75 నిమిషాలు.


 జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రశ్నల తీరు తెలుసుకోవడానికి మాదిరి ప్రశ్నలను వెబ్‌సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా జీమ్యాట్ ప్రిపరేషన్ టిప్స్, జీమ్యాట్ అలుమ్ని సూచనలు, సలహాలు, వీడియోలు వంటివి జీమ్యాట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
 
 స్కోరు:
 పరీక్ష రాసిన మూడు వారాల తర్వాత స్కోర్ కార్డ్‌ను మెయిల్ చేస్తారు. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. జీమ్యాట్ అభ్యర్థుల స్కోర్ రిపోర్ట్‌లో వెర్బల్, క్వాంటిటేటివ్, ఎనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, టోటల్ స్కోర్లు ఉంటాయి. టోటల్ స్కోర్ వెర్బల్, క్వాంటిటేటివ్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. మిగిలిన ఎనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ స్కోర్‌లను పరిగణనలోకి తీసుకోరు. సాధారణంగా ఈ టోటల్ స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. చాలామంది విద్యార్థులు 400-600 మధ్య స్కోర్ సాధిస్తారు. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా 250 యూఎస్ డాలర్లు పరీక్ష ఫీజుగా చెల్లించాలి.


 మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.


 వెబ్‌సైట్: www.mba.com/india
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement