గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jun 13 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Last week Business

వ్యాపార నిర్వహణ... భారత్‌కు రెండో ర్యాంక్
వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందని నివేదిక పేర్కొంది.
   
ఎల్‌అండ్‌టీకి ఖతార్ ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్
ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియం నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది.
   
గ్రీన్ బాండ్లతో యాక్సిస్  నిధుల సమీకరణ
లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
   
ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్!

ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్‌లు  25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా.
   
యథాతథ రేట్లు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు (7 శాతం), రెపో రేటు (6.5 శాతం), రివర్స్ రెపో రేటు (6 శాతం), నగదు నిల్వల శాతం (సీఆర్‌ఆర్-4 శాతం)లను అంచనాలకనుగుణంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు.
 
టాప్-100 మహిళల్లో నలుగురు మనవారు..
ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. అలాగే అరుంధతీ భట్టాచార్య.. ఫోర్బ్స్ ‘ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
    
ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల రికార్డు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. మే నెలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)తో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4,721 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు యాంఫీ పేర్కొంది. ఆరు నెలల కాలంలో ఈ నెలలోనే అధిక పెట్టుబడులు వచ్చాయని, రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసింది.
   
సిండికేట్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ
ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్‌బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు  సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని వివరించింది.
   
ఆఫీసు లీజుల్లో బెంగళూరు టాప్

ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటంలో బెంగళూరు రికార్డుసృష్టించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక ఆఫీసు స్థల లీజు ఒప్పందాలు బెంగళూరులోనే చోటు చేసుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా తెలియజేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి బెంగళూరు, టోక్యో, ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచే లీజింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సంస్థ పేర్కొంది.  
   
రుణ రేటు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ బకాయిల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది.
 
హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం
వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్‌మెంట్ సెంటర్ కావటం విశేషం.
   
తిరిగి పరిశ్రమల పడక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -0.8 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది.  2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం.
 
అమ్మకానికి డెక్కన్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లు
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్‌ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరు తేదీగా పేర్కొంది.
 
డీల్స్..
* పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్‌కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
* అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్‌లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది.
* టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్‌ఎల్) సంస్థ 3 స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్‌ఎల్ వివరించింది.
* ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు.
* స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు పెరుగుతోంది. తాజాగా ఆయన ఈ-టికెటింగ్ కంపెనీ క్యజూంగలో పెట్టుబడులు పెట్టారు.
* బీఎల్‌ఏ పవర్‌లో 15.23 శాతం వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement