Last week Business
-
గతవారం బిజినెస్
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగులు పనిచేసేందుకు, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది. దేశీ స్టార్టప్స్‌లో షావోమి పెట్టుబడులు! స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ’షావోమి’... భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతోంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 100 స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాల్లో బలోపేతమవ్వడమే ఈ ఇన్వెస్ట్మెంట్ల ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. 5 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ దేశీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2025 నాటికి రెట్టింపై.. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరగలదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత ద్రవ్యోల్బణ లక్ష్యాలు దెబ్బతినకుండానే దీన్ని సాధించగలమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో భారత్ .. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎకానమీగా ఉంది. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్.. మనం వెనకే! మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో మన దేశం టాప్–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఫోన్లో సగటు డౌన్లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్. ఇక్కడ స్పీడ్ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్లోడ్ స్పీడ్ 62.07 ఎంబీపీఎస్. టెక్సాస్‌లో విప్రో టెక్ సెంటర్ దేశీ మూడో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ ’విప్రో’ తాజాగా టెక్సాస్‌లోని ప్లానో ప్రాంతంలో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రానున్న కొన్నేళ్లలో టెక్సాస్‌లో ఉద్యోగుల సంఖ్యను 2,000కు పెంచుకుంటామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,400గా ఉంది. విప్రో క్లయింట్లకు నూతన, కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీలకు సంబంధించిన సేవలను అందించడంపై ఈ కొత్త సెంటర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని కంపెనీ తెలిపింది. జూన్ నాటికి 5జీ రోడ్‌మ్యాప్ సిద్ధం!! భారత్ 5జీ టెక్నాలజీ వినియోగంలో ముందుండాలని భావిస్తోంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి జూన్ నాటికి ఒక పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తామని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. హైస్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, మిషన్ క్రిటికల్ సర్వీసులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి వాటికి అవసరమవ్వనున్న 5జీ టెక్నాలజీ వినియోగంలో ఇండియా ముందు వరుసలో ఉండేందుకు పరిశ్రమ సహా విద్యా సంస్థలు, స్టార్టప్స్ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. 5జీకి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులతో, పరిశ్రమ వ్యక్తులతో, ఐఐటీలతో ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేశామని, ఇది ఇప్పటికే పనిని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఎస్బీఐ డిపాజిట్ రేట్లు పెంపు రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం– రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్లపై రేట్లు 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. రెండేళ్ల నుంచి పదేళ్ల కాలానికి మధ్య కోటిలోపు డిపాజిట్లపై ఇకపై 6.6 శాతం నుంచి 6.75 శాతం శ్రేణిలో వడ్డీ రాబడి ఉంటుంది. వృద్ధులకు 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీరేటు అమలవుతుంది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి డిపాజిట్ రేటు ప్రస్తుతం 6.4 శాతం (వృద్ధులకు 6.90 శాతం) అమలవుతోంది. ఈ రేటులో ఎటువంటి మార్పూ లేదు. ఎయిరిండియాకు కొత్త రెక్కలు భారీగా రుణాలు పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా... ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ ఏఐఏటీఎస్ఎల్లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్ కట్టుదిట్టం! కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్స్) మరింత కట్టుదిట్టం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సంస్కరణలకు తెరతీసింది. దీనికి సంబంధించి ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది. అదే విధంగా లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు, స్టార్టప్‌లకు మరిన్ని నిధులు వచ్చేలా చూడటం వంటి పలు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ఐసీఐసీఐలో కొచర్ దుమారం? కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్.. క్విడ్ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కార్పొరేట్ గవర్నెన్స్ సందేహాస్పదమయిందని అనిపించకమానదు. జియో ప్రైమ్.. మరో ఏడాది ఉచితం జియో యూజర్లకు తీపికబురు. రిలయన్స్ జియో తాజాగా జియో ప్రైమ్ సభ్యత్వాన్ని పొడిగించింది. మరో ఏడాదిపాటు ప్రైమ్ సర్వీసులను ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. దీని కోసం యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్షిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. మామూలుగా అయితే జియో ప్రైమ్ సభ్యత్వం గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఇక కొత్త యూజర్లు రూ.99ల వార్షిక సభ్యత్వ ఫీజుతో ప్రైమ్ బెనిఫిట్స్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. ప్రైమ్ మెంబర్షిప్ కలిగినవారు లైవ్ టీవీ చానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్ సంబంధిత కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఆటోమొబైల్స్ ♦ దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టాటా మోటార్స్’ తన కాంపాక్ట్ ఎస్యూవీ ’నెక్సాన్’లో కొత్త వేరియంట్ ’నెక్సాన్ ఎక్స్జెడ్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ’యాపిల్’.. కొత్త ఐపాడ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో 9.7 అంగుళాల స్క్రీన్, అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏ10 ఫ్యూజన్ చిప్, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 ఎంపీ కెమెరా, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, హెచ్డీ వీడియో రికార్డింగ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఐపాడ్ భారత్‌లో ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. 32 జీబీ వై–ఫై మోడల్ ధర రూ.28,000గా, 32 జీబీ వై–ఫై + సెల్యులర్ మోడల్ ధర రూ.38,600గా ఉంది. ♦ చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’హువావే’ మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. హువావే పీ20, హువావే పీ20 ప్రో అనేవి వీటి పేర్లు. పీ20 ధర దాదాపు రూ.52,200గా, పీ20 ప్రో ధర దాదాపు రూ.72,300గా ఉంది. ♦ దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టాటా మోటార్స్’ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా.. రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్ట్టబుల్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.69.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఇండియా). -
గతవారం బిజినెస్
అత్యంత సంపన్నుడు.. అమెజాన్ ’బెజోస్’ ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే తొలిసారి. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఏడాది కాలంలో అమెజాన్ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్ బెజోస్ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నిలిచారు. టీడీఎస్ పేరిట రూ.3,200 కోట్ల స్వాహా! నీరవ్ మోదీ 12,700 కోట్ల స్కామ్ దేశ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తే... మరోవైపు టీడీఎస్ రూపంలో కంపెనీలు రూ.3,200 కోట్ల మేర భారీ అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీఎస్ అంటే... ఉద్యోగుల జీతం నుంచి ఆదాయపు పన్ను నిమిత్తం నెల నెలా కోత వేసే మొత్తం. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు తమ ఉద్యోగుల వార్షికాదాయం గనక పన్ను చెల్లించేటంత ఉంటే ఆ మేరకు టీడీఎస్‌ను మినహాయించి వారి పేరిట ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 447 కంపెనీలు టీడీఎస్ సొమ్మును జమ చేయకుండా పక్కదారి పట్టించినట్టు ఆ శాఖ గుర్తించింది. గతేడాది రూ.81,683 కోట్ల రైటాఫ్! మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకు లు (పీఎస్బీ) భారీ మొత్తంలోనే రుణాలను మాఫీ చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్స్ షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని.. సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టంచేశారు. వారి పాస్‌పోర్టులపై లుక్కేయండి! విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తరహాలో భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయే వారిని కట్టడి చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.50 కోట్లు, అంతకు మించి భారీగా రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలందరి పాస్‌పోర్టు వివరాలను సేకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. ఇందుకు 45 రోజుల గడువు విధించింది. ఒకవేళ రుణ గ్రహీతకు పాస్‌పోర్ట్ లేని పక్ష ంలో ఆ విషయాన్ని ధృవీకరిస్తూ వారి దగ్గరి నుంచి డిక్లరేషన్ తీ సుకోవాలని సూచించింది. అలాగే, పాస్‌పోర్ట్ వివరాలు పొందు పర్చేలా రుణ దరఖాస్తుల్లో మార్పులు చేయాలని పేర్కొంది. టెలికం కంపెనీలకు భారీ ఊరట రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే స్పెక్ట్రమ్ హోల్డింగ్ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దిగుమతి సుంకాలతో ట్రంప్ షాక్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్ పెడుతున్న ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్వీటర్ సీటీవోగా పరాగ్ అగర్వాల్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ’ట్వీటర్’.. పరాగ్ అగర్వాల్‌ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా (సీటీవో) నియమించుకుంది. ఈయన ఆడమ్ మెస్జింగర్ స్థానాన్ని భర్తీ చేశారు. ఆడమ్ మెస్జింగర్ 2016 చివరిలో కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఇకపోతే అగర్వాల్ ఐఐటీ–బాంబే పూర్వ విద్యార్థి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తిచేశారు. భారత్‌కి రావడం అసాధ్యం: చోక్సీ పీఎన్బీ కుంభకోణం కేసులో నిందితుడైన గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ.. సీబీఐకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విచారణలో సహకరించడానికి తాను భారత్ తిరిగి రావడం ‘అసాధ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ఇప్పటికే తన పాస్‌పోర్టు రద్దు కావడం ఒక కారణం కాగా.. అనారోగ్య సమస్యల వ ల్ల ప్రయాణం చేయలేకపోవడం మరో కారణమని వివరించారు. డీల్స్.. ♦ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. జేఎస్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోకి అడుగు పెట్టేందుకు వీలుగా, డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను సొంతం చేసుకున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బీఎస్ఈకి తెలిపింది. ♦ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్బీసీసీకి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నుంచి రూ.192 కోట్ల ఆర్డర్ లభించింది. గురుగ్రామ్‌లో ఆర్ఈసీకి టౌన్‌షిప్‌ని నిర్మించి డెవలప్‌చేసే ఆర్డర్ లభించిందని ఎన్బీసీసీ తెలిపింది. ♦ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ హెల్త్‌కేర్ రంగ కంపెనీ అపోలో హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల్లో ఆధునాతన టెక్నాలజీ వినియోగానికి చేతులు కలిపాయి. గుండె వ్యాధులకు సంబంధించి రోగికున్న ప్రమాదాన్ని అంచనా వేయడానికి, డాక్టర్లకు వ్యాధి ట్రీట్మెంట్కు అవసరమైన సాయమందించేందుకు కొత్త మెషీన్ లెర్నింగ్ విధానాలను ఇవి అభివృద్ధి చేస్తాయి. ♦ గృహ రుణాలు అందించే కెన్‌ఫిన్ హోమ్స్‌తో కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ చేతులు కలిపింది. మూడేళ్ల కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందం చేసుకుంది. దీనికింద కెన్‌ఫిన్ హోమ్స్ నుంచి గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు బీమా పాలసీలను ఆఫర్ చేస్తుంది. ♦ విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు (భెల్) భారీ ఆర్డర్ లభించింది. జార్ఖండ్‌లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఆర్డర్‌ను సాధించామని, ఈ ఆర్డర్ విలువ రూ.11,700 కోట్లని భెల్ తెలిపింది. ఆటోమొబైల్స్.. ♦ దేశీ రెండో అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తన చెన్నై ప్లాంటులో తొలిసారిగా తయారు చేసిన 6 సిరీస్ గ్రాన్ టురిస్మో కారు ‘బీఎండబ్ల్యూ 630ఐ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.58.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ♦ మహీంద్రా టూవీలర్స్ తన ప్రీమియం స్పోర్ట్స్ టూరర్ బైక్ ‘మోజో’లో కొత్త వేరియంట్ ‘మోజో యూటీ (యూనివర్సల్ టూరర్) 300’ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦ ‘టాటా మోటార్స్’ తన కాంపాక్ట్ సెడాన్ ‘జెస్ట్’లో స్పెషల్ ఎడిషన్ ‘జెస్ట్ ప్రీమియో’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦ టూవీలర్ కంపెనీ ‘సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా’ తాజాగా 2018 ఎడిషన్ జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్ బైక్స్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.80,928, రూ.90,037గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. ♦ వాహన తయారీ కం పెనీ ‘టీవీఎస్ మో టార్’ తన ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’ లో కొత్త ఎడిషన్‌ను తీసుకువచ్చింది. అపాచీ ఆర్టీఆర్ 200 4వీ రేస్ ఎడిషన్ 2.0 పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బైక్ గరిష్ట ధర రూ.1,08,985 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦ ‘ఫోక్స్‌వ్యాగన్’ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ‘పోలో’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5,41,800 (ఎక్స్‌షోరూమ్). ఇందులో 1.0 లీటర్ ఎంపీఐ ఇంజిన్ అమర్చినట్లు కంపెనీ తెలిపింది. -
గతవారం బిజినెస్
డిసెంబర్లో నెమ్మదించిన మౌలిక రంగం ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు డిసెంబర్లో నెమ్మదించింది. వృద్ధి 4 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఏడాది ఇదే నెల్లో గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. ఆస్ట్రేలియా మార్కెట్లోకి ఓలా ట్యాక్సీ సర్వీసుల దేశీ దిగ్గజం ఓలా... విదేశీ మార్కెట్లకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాలోనూ సర్వీసులు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్ నగరాల్లో ప్రైవేట్ వాహనదారులను తమ ప్లాట్‌ఫాంపై నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఓలా తెలిపింది. రైతులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఎస్బీఐ రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటిం చింది. తమ అనుబంధ సంస్థ ’ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ’గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుంది’ అని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూషణ్ స్టీల్‌పై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆసక్తి మొండిబాకీలతో ఎన్సీఎల్టీ ముం దుకు చేరిన భూషణ్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, మోనెట్ ఇస్పాత్ సంస్థల కొనుగోలుపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దృష్టి సారించింది. భూషణ్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కి సంబంధించి ఫిబ్రవరి 3లోగా బిడ్లు దాఖలు చేస్తామని సంస్థ జేఎండీ శేషగిరిరావు తెలిపారు. మోనె ట్ ఇస్పాత్ కోసం ప్రణాళికను సమర్పించినట్లు పేర్కొన్నారు. కాల్ డ్రాప్స్ కట్టడికి టెల్కోల 74 వేల కోట్లు! టెలికం కంపెనీలు కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లతో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. తద్వారా కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించడానికి టెల్కోలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. 27 నుంచి 28కి ఐఎస్బీ ర్యాంకు! ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్‌కతాల గ్లోబల్ ర్యాంక్ ఈ ఏడాది మెరుగుపడింది. అయితే ఐఐఎం– అహ్మదాబాద్, ఐఎస్బీ హైదరాబాద్ ర్యాంక్ మాత్రం తగ్గింది. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ ’గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్–2018’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకోగా... దీని తర్వాతి స్థానంలో ఫ్రెంచ్ స్కూల్ ఇన్సీడ్ ఉంది. 2017లో 27వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఐఎస్బీ... ఈసారి 28కి పరిమితమయింది. కోటక్ ఎంఎఫ్ కొత్త స్కీమ్ కోటక్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ’కోటక్ ఇండియా గ్రోత్ ఫండ్ సిరీస్–4’ అనే కొత్త స్కీమ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ఫిబ్రవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ ప్రధానంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం రూ.24.42 లక్షల కోట్లు. ఆటోమొబైల్స్ ♦ దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా ‘ఎక్స్ట్రీమ్ 200ఆర్’ పేరిట కొత్త బైక్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.90,000– రూ. 1,00,000 శ్రేణిలో ఉండొచ్చు. ♦ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మాసెరటి’ తన ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ ‘లెవాంటె’లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్‌షోరూమ్). మాసెరటి నుంచి మన దేశంలోకి వస్తోన్న తొలి ఎస్యూవీ ఇదే. ♦ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా కొత్త కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్ ‘ఫ్రీస్టైల్’ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఇది ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. డీల్స్.. ♦ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన మీడియా గ్రూప్ ‘టీవీ18 బ్రాడ్కాస్ట్’ తన జాయింట్ వెంచర్ కంపెనీ ‘వయాకామ్ 18’లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకుంది. ఇందుకోసం 20 మిలియన్ డాలర్లు చెల్లించి అమెరికాకు చెందిన భాగస్వామ్య సంస్థ వయాకామ్ నుంచి 1 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో వయాకామ్18లో టీవీ18 వాటా 51 శాతానికి చేరింది. ♦ వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో 15 నుంచి 20 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికోసం సుమారు 1 బిలియన్ డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోంది. ♦ బిగ్‌బాస్కెట్.. ఆలీబాబా, అబ్రాజ్ క్యాపిటల్, శాండ్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సీ తదితర సంస్థల నుంచి రూ.1,920 కోట్లు పెట్టుబడులు సమీకరించింది. మరోవైపు జొమాటొలో ఆలీబాబా అనుబంధ సంస్థ ఆంట్ స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ♦ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (జీహెచ్ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) 11 శాతం వాటా పెంచుకుంటోంది. మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్, ఎంఏహెచ్‌బీ (మారిషస్) నుంచి ఈ వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.484 కోట్లు. -
గతవారం బిజినెస్
సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్ సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. అందుబాటులోకి ’అమెజాన్ గో’ స్టోర్ అమెజాన్ ఎట్టకేలకు తన తొలి ’అమెజాన్ గో’ స్టోర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ.. మెషీన్ లెర్నింగ్, సెన్సార్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలతో అమెరికాలోని సీటెల్‌లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఎలాంటి చెక్ పాయింట్స్ ఉండవు. అంటే కస్టమర్ స్టోర్ లోనికి వెళ్లి తనకు నచ్చిన వస్తువులు/సరుకులు తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు. కస్టమర్ అమెజాన్ అకౌంట్ నుంచి బిల్లు ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతుంది. గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్జీసీ ఔట్! ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఓఎన్జీసీ సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఓఎన్జీసీ ఉపయోగించుకోనుంది. ఓఎన్జీసీకి ఐవోసీలో 13.77 శాతం వాటా, గెయిల్‌లో 4.86 శాతం వాటా ఉంది. పోర్టుల రంగంలో భారీ పెట్టుబడులు పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో మూడు బిలియన్ డాలర్ల (రూ.19,200 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఓ వేదిక ఏర్పాటుకు చేయటానికి జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధితో (ఎన్ఐఐఎఫ్) ఈ రంగంలో పేరొందిన డీపీ వరల్డ్ సంస్థ చేతులు కలిపింది. ’’పోర్టులు, టెర్మినళ్లు, రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులకు గాను ఎన్ఐఐఎఫ్, డీపీ వరల్డ్ కలసి పెట్టుబడుల వేదిక ఏర్పాటు చేస్తాయి. ఈ రంగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, ఆస్తుల కొనుగోలు కోసం 3 బిలియన్ డాలర్ల నిధులను ఈ వేదిక ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం’’ అని డీపీ వరల్డ్ పేర్కొంది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయ్ ఆర్థిక వృద్ధి గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ దేశీయంగా ఆర్థిక అసమానతలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతేడాది జరిగిన మొత్తం çసంపద సృష్టిలో 73 శాతం సొమ్మంతా ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది. అదే సమయంలో దేశ జనాభాలో దాదాపు సగభాగమైన 67 కోట్ల మంది పైగా పేదల సంపద కేవలం ఒకే ఒక్క శాతం పెరిగింది. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వృద్ధిలో మహిళలనూ కలపండి: ఐఎంఎఫ్ అధిక వృద్ధి సాధించేందుకు ఆర్థిక వ్యవస్థలో మహిళలను మరింత భాగస్వాముల్ని చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ సూచించారు. ఆర్థిక సేవలు తదితర కీలక రంగాల్లో సంస్కరణలను కొనసాగించాలని పేర్కొన్నారు. పురుష ఉద్యోగులకు దీటుగా ఉద్యోగినుల సంఖ్య పెరిగిన పక్షంలో భారత ఎకానమీ 27 శాతం మేర వృద్ధి చెందేందుకు తోడ్పడగలదని ఐఎంఎఫ్ అధ్యయనంలో తేలినట్లు ఆమె వెల్లడించారు. డీల్స్.. ♦ మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎమ్ఆర్పీఎల్)ను నగదు, షేర్ల మార్పిడి రూపంలో కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా చెప్పారు. కాగా హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. ♦ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ సంస్థ ఎస్సెల్ హోల్డింగ్స్ 1.44 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 825 కోట్లు. ♦ గ్రామీణ గృహ నిర్మాణానికి సంబంధించి వడ్డీ సబ్సిడీ పథకం (ఆర్హెచ్ఐఎస్ఎస్) అమలు విషయంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌తో (ఎన్‌హెచ్‌బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. ♦ అమెరికాకు చెందిన హర్టే హంక్స్లో ఐటీ సంస్థ విప్రో తన అనుబంధ కంపెనీ అయిన విప్రో ఎల్ఎల్సీ ద్వారా 9.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ♦ కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్.. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.35 కోట్లు. ♦ బంగాళాఖాతంలోని ’ఎన్ఈసీ (నార్త్ ఈస్ట్ కోస్ట్)– 25’ చమురు క్షేత్రంలో నికో రిసోర్సెస్ సంస్థకున్న వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం పీఎల్సీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెట్టుబడులకు బెస్ట్.. భారత్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ’పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. దీని ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్ను అధిగమించి భారత్ ఐదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆటో షోలో మారుతీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ! దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ ఇండియా’ తన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ ’ఇ–సర్వైవర్’ను ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనుంది. ఇది టూ సీట్స్ కలిగిన ఓపెన్ టాప్ ఎస్యూవీ. అలాగే కంపెనీ.. కాన్సెప్ట్ ’ఫ్యూచర్ ఎస్’ (ఎస్యూవీ ప్రత్యేకతలు కలిగిన కాంపాక్ట్ కారు)ను, సరికొత్త మూడో జనరేషన్ స్విఫ్ట్ కారును, నెక్స్ట్ జనరేషన్ సుజుకీ హైబ్రిడ్ సిస్టమ్ (హెచ్ఈవీ) వర్కింగ్ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనుంది. -
గతవారం బిజినెస్
ఎగుమతులు రయ్.. రయ్.. ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్లో ఎగుమతులు 12.36% మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్ బిల్లు సైతం 21.12% ఎగసి 41.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. విమానాల్లోనూ మొబైల్, ఇంటర్నెట్! దేశీ విమాన ప్రయాణికులకిది శుభవార్తే. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్... ఇన్–ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో శాటిలైట్, టెరిస్ట్రియల్ నెట్వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది. 846 టన్నుల బంగారం దిగుమతి బంగారం దిగుమతులు గతేడాది భారీ ఎత్తున పెరిగాయి. ఏకంగా 846 టన్నుల పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువ స్థాయిలో ఉండడంతో పాటు దేశీయంగా డిమాండ్ పెరగడమే దిగుమతులు అధికం కావడానికి కారణాలుగా ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా పేర్కొంది. 2016లో దిగుమతి అయిన బంగారం 550 టన్నులతో పోలిస్తే గతేడాది దిగుమతులు 53 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. భారత మార్కెట్లోకి థాయ్ రిటైల్ సంస్థ థాయ్‌లాండ్‌కి చెందిన రిటైలింగ్ సంస్థ సియామ్ మాక్రో పీసీఎల్... భారత హోల్‌సేల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే ఐదేళ్లలో భారత క్యాష్ అండ్ క్యారీ విభాగంలో రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సిరిపోర్ణ్ డెక్‌సింఘా తెలిపారు. లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ పేరిట ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారామె. పది రూపాయల నాణేలన్నీ చెల్లుతాయి పది రూపాయల నాణేలకు సంబంధించి చెలామణిలో ఉన్న మొత్తం 14 డిజైన్లూ చెల్లుబాటవుతాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇవన్నీ చట్టబద్ధమైనవేనని పేర్కొంది. వ్యాపార వర్గాలు పది రూపాయల నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలు మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిదిన్నర నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి జనవరి 15 వరకు) పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగి ఏకంగా రూ. 6.89 లక్షల కోట్లకు చేరాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.8 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లను ఆదాయపన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమొబైల్స్ ♦ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తన రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ 2018 ఎడిషన్ ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.50.20 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ♦ టెక్ దిగ్గజం శాంసంగ్.. గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.12,990. ♦ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి తన ప్రీమియం ఎస్యూవీ క్యూ5లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57.6 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦ జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’మెర్సిడెస్ బెంజ్’ తాజాగా బీఎస్–6 నిబంధనలకు అనువుగా ఉన్న ’ఎస్ క్లాస్’ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. డీల్స్.. ♦ టెలికం రంగంలోని భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్లించ్ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్ఆర్ఎస్ పార్ట్నర్స్ (కేమాన్) ఎల్ఎల్సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు. ♦ మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్విక్లో 12.60 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. నిజానికి రూ. 225 కోట్లతో 10.83 శాతం వాటా కొనుగోలు చేసేందుకు గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా వాటా పరిమాణం కొంత పెరిగిందని, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల కన్వర్షన్ ధర మారటమే ఇందుకు కారణమని బజాజ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఇందుకోసం గతంలో అంగీకరించిన మొత్తమే తప్ప .. కొత్తగా మరింత పెట్టుబడేమీ పెట్టలేదని కంపెనీ తెలిపింది. ♦ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో భారీ డీల్‌ను చేజిక్కించుకుంది. యూకే, యూరోప్‌ల్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాన్ని నిర్వహించే ప్రుడెన్షియల్ పీఎల్‌సీకి చెందిన ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ నుంచి డీల్‌ను సాధించామని టీసీఎస్ తెలిపింది. ఈ డీల్ విలువ సుమారుగా రూ.4,400 కోట్లు. 3 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం ఆహార పదార్థాల రేట్లు తగ్గటంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. గత నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ప్రకారం ద్రవ్యోల్బణం 3.58 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్టం. గత నవంబర్‌లో ఇది 3.93 శాతం. మరో 1.20 లక్షల కంపెనీల రద్దు! నల్లధనంపై పోరులో భాగంగా మరో 1.20 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 2.26 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు వీటితో అనుబంధం కలిగిన 3.09 లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించింది. -
గతవారం బిజినెస్
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.56 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (2017 ఏప్రిల్– డిసెంబర్) రూ.6.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18% వృద్ధి నమోదయ్యింది. 2017– 18లో మొత్తం సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. కాకపోతే ఈ లక్ష్యంలో ప్రస్తుత డిసెంబర్ నాటికి 67% పూర్తయింది. 12,600 కోట్ల సమీకరణకు ఎస్బీఐ రెడీ! ఎస్బీఐ విదేశీ బాండ్ల ద్వారా రూ.12,600 కోట్లకు పైగా నిధులు సమీకరించనుంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో డాలర్లు, ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో బాండ్ల జారీతో ఈ స్థాయి లో నిధులు సమీకరిస్తామని ఎస్బీఐ తెలిపింది. వీటిని విదేశాల్లో కార్యకలాపాల విస్తరణకు వినియోగిస్తామని పేర్కొంది. ’మెర్సిడెస్’దే లగ్జరీ కార్ మార్కెట్.. దేశీ లగ్జరీ కార్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన హవా కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పలు సవాళ్లను అధిగమించి మరీ 2017లో ఏకంగా 15,330 కార్లు, ఎస్‌యూవీలను విక్రయించింది. కంపెనీ కార్ల విక్రయాలు 2016లో 13,231 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 15.86% వృద్ధి నమోదయ్యింది. గుర్గావ్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన రియ ల్టీ బ్రాండ్ ’ట్రంప్ టవర్స్’ గుర్గావ్లో ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాజె క్టు చేపడుతోంది. డొనాల్డ్ కుమారుడు ట్రంప్ జూనియర్ సారథ్యంలోని ది ట్రంప్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ పొందిన ఎం3 ఎం, ట్రైబెకా సంస్థలు ఈ ప్రాజెక్టును ప్రకటించాయి. ఇందులో రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో 250 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎఫ్‌డీఐ సంస్కరణల జోరు కేంద్ర ప్రభుత్వం సింగిల్ బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగం, విద్యుత్ ఎక్సే్చంజీల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. దీంతో సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఆటోమేటిక్ విధానంలో 100% ఎఫ్‌డీఐలకు మార్గం సుగమం అయ్యింది. అలాగే రుణ సంక్షోభంలో కూరుకున్న ఎయిరిండియాలో 49% దాకా విదేశీ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించింది. 3,500 కోట్ల బినామీ ఆస్తులు జప్తు ఫ్లాట్లు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. వీటి విలువ రూ.3,500 కోట్లు ఉంటుందని తెలిపింది. 2016 నవంబర్‌లో అమల్లోకి వచ్చిన బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పీడబ్ల్యూసీకి సెబీ షాక్! అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కేసుకు సంబంధించి పీడబ్ల్యూసీని దోషిగా తేల్చింది. ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్వర్క్ సంస్థలు రెండేళ్ల పాటు భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్ ఖాతాలు ఆడిటింగ్ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్ల పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఐదో ఏడాదీ తగ్గిన గోల్డ్ ఫండ్స్ మెరుపు! గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి నిధులు వెనక్కుమళ్లడం కొనసాగుతోంది. 2017లో గోల్డ్ ఫండ్స్ నుంచి రూ.730 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇలాంటి ధోరణి వరుసగా ఇది ఐదో ఏడాది. పగ్గాలు తెంచుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్లో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. మరోవైపు దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 17 నెలల గరిష్టానికి చేరింది. గత నవంబర్‌లో ఇది 8.4 శాతంగా నమోదైంది. ఎమ్మార్ డీమెర్జర్‌కు ఎన్సీఎల్టీ ఓకే ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ కంపెనీ డీమెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. దీంతో ఎమార్ ఎంజీఎఫ్ ల్యాండ్ జాయింట్ వెంచర్ ఇక ఎమార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ డెవలప్‌మెంట్‌లుగా విడిపోతుంది. ఆటోమొబైల్స్ ’హ్యుందాయ్’ తన మిడ్సైజ్డ్ ప్రీమియం సెడాన్ ’వెర్నా’లో ’ఇ,’ ’ఇఎక్స్’ అనే రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.7.79 లక్షలు, రూ.9.09 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ’శాంసంగ్ ఇండియా’.. ’గెలాక్సీ ఏ8 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.32,990. కంపెనీ నుంచి డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ’బజాజ్ ఆటో’.. డిస్కవర్ 110, డిస్కవర్ 125 అనే రెండు బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర రూ.50,496 (ఎక్స్‌షోరూమ్ మహరాష్ట్ర). ’లంబోర్గిని’ తన తొలి సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ’ఉరుస్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3 కోట్లు. ’హోండా కార్స్’ తన సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్–వీ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్స్‌ను తీసుకొచ్చింది. హోండా సిటీ 20వ వార్షికోత్సవం ఎడిషన్, అమేజ్ ప్రైడ్ ఎడిషన్, డబ్ల్యూఆర్–వీ ఎడ్జ్ ఎడిషన్ అనేవి వీటి పేర్లు. రాయల్ ఎన్ఫీల్డ్ తన అడ్వెంచర్ టూరింగ్ మోడల్ ’హిమాలయన్’లో కొత్త వెర్షన్ ’స్లీట్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.13 లక్షలు (ఆన్–రోడ్ చెన్నై). యమహా మోటార్ ఇండియా తన ’ఎఫ్జెడ్ఎస్–ఎఫ్ఐ’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.86,042. డీల్స్.. ఎన్ఎస్ఈలో 0.20 శాతం వాటాను మౌలిక రంగ రుణాలిచ్చే ఐఎఫ్సీఐ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.925 ధర చొప్పున పది లక్షల షేర్లను రూ.92.51 కోట్లకు విక్రయించింది. ’ఫోన్‌పే’.. మొబైల్ వాలెట్ సంస్థ ’ఫ్రీచార్జ్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఫోన్‌పే యూజర్లు వారి ఫ్రీచార్జ్ వాలెట్లను ఫోన్‌పే యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. టాటా కెమికల్స్ తన యూరియా, కస్టమైజ్డ్ ఫెర్టిలైజర్స్ వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్ ఎఎస్ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్ ఇండియాకు రూ.2,682కోట్లకు విక్రయించింది. -
గతవారం బిజినెస్
భారీ నిక్షేపాలు కనుగొన్న ఓఎన్జీసీ ఓఎన్జీసీ అరేబియా సముద్రంలో భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అరేబియా సముద్రంలోని ముంబై హై చమురు క్షేత్రాల్లో ఓఎన్జీసీ ఈ నిక్షేపాలను కనుగొన్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ ఆవిష్కరణల్లో 29.74 మిలియన్ టన్నుల ఆయిల్, ఆయిల్ సమానమైన గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఐటీలో 2 లక్షల ఉద్యోగాలు!! ప్రస్తుత ఏడాది ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలున్నాయి. ’ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ బిజినెస్‌లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్‌లలో ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి’ అని టీమ్‌లీజ్ వివరించింది. ఎస్బీఐ రుణ రేట్లు తగ్గాయ్.. ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకగా ఎస్బీఐ.. బేస్ రేటు బీపీఎల్ఆర్ను 0.3 శాతం మేర తగ్గించింది. దీంతో పాత వడ్డీ రేట్ల విధానంలో రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత కస్టమర్లకు బేస్ రేటును 8.95 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) 13.70 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గించింది. ఎస్బీఐ కనీస నిల్వ వడ్డింపులు 1,772 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో నెలవారీ కనీస మొత్తం నిల్వ నిబంధనను పాటించని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఎస్బీఐ భారీగానే సొమ్ములు రాబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఈ జరిమానాలు రూ.1,772 కోట్లకు పెరిగాయి. ఈ బ్యాంక్ సాధించిన రెండో క్వార్టర్ నికర లాభం (రూ.1,582 కోట్లు) కన్నా ఈ మొత్తం అధికం కావడం విశేషం. ఇన్ఫీ సీఈవోగా పరేఖ్ బాధ్యతల స్వీకరణ దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ’ఇన్ఫోసిస్’ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన వార్షికంగా రూ.18.6 కోట్ల మేర జీతభత్యాలు అందుకోబోతున్నారు. సంస్థ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో స్థిరమైన వార్షిక వేతనం రూ.6.5 కోట్లు కాగా, మిగతాది పనితీరు ఆధారితంగా (వేరియబుల్) ఉండనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నుంచి ఈ ప్యాకేజీ అమలవుతుంది. -
గతవారం బిజినెస్
ఆస్ట్రేలియా మైనింగ్ సంస్థకు అదానీ గుడ్‌బై ఆస్ట్రేలియాలో తలపెట్టిన కార్మైకేల్ మైనింగ్ ప్రాజెక్టుకు అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ తాజాగా అక్కడి మైనింగ్ సర్వీసుల సంస్థ డౌనర్కి ఇచ్చిన 2.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును రద్దు చేసింది. కార్మైకేల్ దాకా రైల్వే లైను నిర్మాణానికి రాయితీపై 900 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు క్వీన్స్లాండ్ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో అదానీ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. 27న బ్యాంకుల సమ్మె!! బ్యాంకులు డిసెంబర్ 27న సమ్మె బాట పట్టనున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయాలన్నది యూనియన్ల డిమాండ్. ఈ అంశం 2012 నుంచి పెండింగ్‌లో ఉంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) యూనియన్లు సమ్మె నోటీసులు అందించాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకులకు తెలియజేసింది. ‘బిట్‌కాయిన్’ సంపన్నులకు ఐటీ నోటీసులు వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్లలో ఇన్వెస్ట్ చేస్తున్న, ట్రేడింగ్ చేస్తున్న వారిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సుమారు 4–5 లక్షల మంది అత్యంత సంపన్నులకు నోటీసులు జారీచేయటం మొదలెట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఐటీ శాఖ బెంగళూరు విభాగం అధికారులు గత వారం తొమ్మిది వర్చువల్ కరెన్సీ ఎక్సే్ఛంజీల్లో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఎక్సే్ఛంజీల్లో 20 లక్షల మంది వ్యక్తులు నమోదు చేసుకోగా.. సుమారు 4–5 లక్షల మంది క్రియాశీలకంగా లావాదేవీలు చేస్తున్నారని వెల్లడయింది. ఐఫోన్ ధరలు పెరిగాయ్.. టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’.. ఐఫోన్ ధరలను పెంచింది. దీంతో పలు మోడళ్లపై ధరలు గరిష్టంగా 4.3 శాతం వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీ పలు మోడళ్లపై ధరలు పెంచింది. కోటీశ్వరులు పెరుగుతున్నారు... దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు కావడం గమనార్హం. 15 వేల కోట్ల ఆదాయం తగ్గించి చూపాయి.. టాటా టెలీ, జియో, టెలినార్, వీడియోకాన్ టెలికామ్, క్వాడ్రాంట్ (వీడియోకాన్ గ్రూప్ సంస్థ) టెలికం సంస్థలు లెక్కల్లో దాదాపు రూ. 14,814 కోట్ల మేర ఆదాయాలను తక్కువగా చేసి చూపాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. దీనివల్ల ఖజానాకు సుమారు రూ. 2,578 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. 2014–15 దాకా ఈ 5 కంపెనీలు తమ ఆదాయాలను రూ. 14,814 కోట్ల మేర తక్కువ చేసి చూపించినట్లు ఆడిటింగ్‌లో తేలిందని కాగ్ వివరించింది. ఎయిర్‌సెల్ కార్యకలాపాలు నిలిపివేత! ఎయిర్‌సెల్ కంపెనీ ఆరు టెలికం సర్కిళ్లలో తన కార్యకలాపాలను ఆపేయనుంది. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో జనవరి 30 నుంచి మొబైల్ సర్వీసులను నిలిపేస్తామని ఎయిర్‌సెల్ తెలిపింది. కాగా వేరే కంపెనీ నెట్‌వర్క్‌ను మారాలనుకుంటున్న ఎయిర్‌సెల్ వినియోగదారుల అభ్యర్థనలను వచ్చే ఏడాది మార్చి 10 వరకూ అంగీకరించాలని ఇతర టెలికం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ కొరడా మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. బీఓఐ తాజాగా రుణాలు జారీ చేయరాదని, డివిడెండ్‌ను పంపిణి చేయకూడదని ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కూడా ఆర్బీఐ అదనపు ఆంక్షలను విధించింది. టీసీఎస్ ఆర్డర్‌ను పొడిగించిన నీల్సన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)... భారీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ నీల్సన్ నుంచి 225 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ రెన్యువల్‌ను టీసీఎస్ సాధించింది. ఈ డీల్‌పై ఇరు కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్‌లోనే సంతకాలు చేశాయి. 2007లో కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందానికి ఇది రెన్యువల్ అని, ఆ డీల్‌ను మరో ఐదేళ్ల పాటు నీల్సన్ పొడిగించిందని టీసీఎస్ తెలియజేసింది. ఒక భారత ఐటీ కంపెనీ సాధించిన అతి పెద్ద అవుట్సోర్సింగ్ ఆర్డర్ ఇదేనని నిపుణులంటున్నారు. ఎయిర్టెల్ ఈకేవైసీ లైసెన్స్ దుర్వినియోగం! మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం కస్టమర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరించిన ఎయిర్టెల్.. కస్టమర్ల అను మతి తీసుకోకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతాలు తెరిచిందని ఆరోపణలు ఉన్నా యి. ఆ యూజర్లకు రావాల్సిన గ్యాస్ సబ్సిడీ మొత్తాలు కూడా ఈ ఖాతాల్లోకి చేరడం వివాదానికి దారి తీసింది. దీంతో యూఐడీఏఐ.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ సంస్థల ఈకేవైసీ లైసెన్స్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అయితే యూఐడీఏఐ తర్వాత ఎయిర్‌టెల్‌కు మాత్రమే జనవరి 10 వరకు ఈకేవైసీ వెరిఫికేషన్ నిర్వహించుకోవచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తన పదవికి రాజీనామా చేశారు. 7 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ! భారత ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5–7 ట్రిలియన్ డాలర్ల (6.5–7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ గురువారం పేర్కొన్నారు. 2035–40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.25 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఆరవది. 2047 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే!! ‘సియామ్’ తాజాగా 2047 నాటికి దేశంలో విక్రయమయ్యే వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే అయ్యుండాలని పేర్కొంది. నగరాల్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఈ గడువును 2030గా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. డీల్స్.. ♦ ఆటోమొబైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రూమ్’.. మహీంద్రా, హీరో ఎలక్ట్రిక్ కంపెనీలతో భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా డ్రూమ్ తన ప్లాట్ఫామ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అందుబాటులో ఉంచనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ.20,000– రూ.42,400 శ్రేణిలో, ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.8 లక్షలు –రూ.13 లక్షల శ్రేణిలో ఉంటాయని సంస్థ తెలిపింది. మరోవైపు ఒకినావా స్కూటర్స్, యోబైక్స్తోనూ డ్రూమ్ ఒప్పందం చేసుకుంది. ♦ ఆన్లైన్ ఆహార పదార్థాల సరఫరా కంపెనీ ఫుడ్ పాండా భారత కార్యకలాపాలను క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా కొనుగోలు చేసింది. ఈ డీల్ మొత్తం షేర్ల రూపంలోనే జరిగింది. ♦ భారతీ ఎయిర్టెల్.. రువాండాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెలికం కంపెనీలో పూర్తి వాటాను కొనుగోలు చేయనుంది. టిగో రువాండా బ్రాండ్ కింద టెలికం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులర్ ఎస్ఏలో వంద శాతం వాటా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఎయిర్టెల్ తెలిపింది. ♦ ఈఐడీ ప్యారీ ఇండియాకి చెందిన బయో పెస్టిసైడ్స్ వ్యాపారాన్ని కోరమాండల్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేయనుంది. అలాగే మరో అనుబంధ కంపెనీ యూఎస్‌లో ఉన్న ప్యారీ అమెరికాను సైతం దక్కించుకోనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని కోరమాండల్ అంచనా వేసింది. కాగా ఈ మొత్తం డీల్ విలువ రూ.338 కోట్లు. ♦ హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ రియల్టీ, హెచ్డీఎఫ్సీ డెవలపర్స్‌ను క్వికర్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. అంతా షేర్ల రూపంలోనే అనుబంధ సంస్థలను క్వికర్‌కు విక్రయించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ♦ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన ముంబై విద్యుత్ వ్యాపారాన్ని (రిలయన్స్ ఎనర్జీగా వ్యవహరిస్తారు) అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.18,000 కోట్లు. ♦ మహీంద్రా గ్రూప్.. ఫిన్లాండ్ స్టార్టప్ ’మెడిక్సిన్’లో 2,00,000 యూరోలను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. -
గతవారం బిజినెస్
ధరలు పైకి.. పారిశ్రామికోత్పత్తి కిందకు! కేంద్రం అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. పారిశ్రామికోత్పత్తిలో కేవలం 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామికోత్పత్తి నమోదు కాలేదు. 2016 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 4.2%. సెప్టెంబర్‌లో ఐఐపీ రేటు 4.14 శాతంగా నమోదయ్యింది. కాగా నవంబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.88%గా నమోదయ్యింది. ఫెడ్ రేటు పావుశాతం పెంపు అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్– తన ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఫెడ్ రేటు 1.25 శాతం నుంచి 1.50 శాతానికి పెరిగింది. జోరుగానే వాహన విక్రయాలు ఈ ఏడాది నవంబర్‌లో వాహన విక్రయాలు జోరుగా పెరిగినట్లు సియామ్ తెలిపింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు బాగుండటం, కంపెనీలు అధికంగా డిస్కౌంట్లు ఇవ్వడం కూడా కలసిరావడంతో ప్రయాణికుల వాహన విక్రయాలు 14% వృద్ది చెందినట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు బాగా తగ్గాయని, అందుకని అప్పటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయని వివరించారు. వాట్సాప్ లీక్‌లపై ’సెబీ’ సీరియస్ వాట్సాప్ లీక్‌ల విషయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ విషయమై తీవ్రంగానే దర్యాప్తు జరుగుతోందని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. మరోవైపు ఐపీఓకు వచ్చిన కంపెనీల స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సమయాన్ని ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల అవగాహన పెరుగుతోందని, ఫండ్స్‌లో మదుపు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఐపీఓ రూట్లో రిలయన్స్ జియో! దేశీ టెలికం పరిశ్రమను ’జియో’తో షేక్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ... స్టాక్ మార్కెట్లో కూడా ఇదే విధమైన ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆఖరికల్లా లేదా 2019 తొలినాళ్లలో జియోను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజీల్లో ఐటీ తనిఖీలు దేశీ బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజీల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలకు దిగింది. అధికార బృందాలు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజ్‌లలో విచారణ నిర్వహించగా, అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు జరిపిన లక్షలాది లావాదేవీల సమాచారం వెలుగు చూసింది. బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేతకు సంబంధించి వివరాలు ఆరాతీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిర్ డెక్కన్ మరో జర్నీ దేశంలో తొలిసారి చౌక విమానయాన సేవల్లోకి ప్రవేశించి... అతితక్కువ చార్జీకే ఆకాశయానాన్ని పరిచయం చేసిన ’ఎయిర్ డెక్కన్’... రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఉడాన్ కింద తొలి విమానాన్ని నడపటానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 22 నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. తొలి ఫ్లైట్ నాసిక్ నుంచి ముంబైకు ప్రయాణించనుంది. కంపెనీ ’సింప్లిఫై’ ట్యాగ్‌లైన్‌తో ’సామాన్యులకు విమాన ప్రయాణం’ లోగోతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధార్‌కు మూడు నెలల విరామం ఆధార్ అనుసంధాన ఇబ్బందులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. డిసెంబర్ 31తో ముగుస్తుందని చెప్పిన గడువును మరో మూడు నెలల పాటు కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చునంటూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు, పాన్, పోస్టాఫీసు ఖాతాలు, బీమా పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు, మొబైల్ సిమ్ రీవెరిఫికేషన్‌కు మరింత సమయం లభించింది. ’కేంద్రం చేతికి యూనిటెక్’.. సుప్రీం స్టే రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్ పగ్గాలను కేంద్రం తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్సీఎల్టీ ముందుకు 23 భారీ ఎన్పీఏలు బ్యాంకులకు భారీగా రుణపడిన 23 నిరర్ధక ఆస్తుల ఖాతాలు (ఎన్పీఏలు) ఎన్సీఎల్టీ ముందుకు చేరాయి. మొత్తం 28 అతిపెద్ద ఎన్పీఏ ఖాతాల జాబితాను ఆర్బీఐ ఖరారు చేసి వీటి విషయంలో పరిష్కారానికి ఇచ్చిన గడువు ఈ నెల 13తో ముగిసింది. డిసెంబర్ 13వ తేదీ లోగా వీటి పరిష్కారానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో వాటిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాలని ఆగస్టులోనే బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిపోవటంతో... వీటిలో 23 ఖాతాలకు సంబంధించి దివాలా చర్యలు ఆరంభించాలని కోరుతూ బ్యాంకులు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయనున్నాయి. టోకు ధరలూ మంటే..! టోకు ధరలు నవంబర్‌లో భగ్గుమన్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93%గా నమోదయ్యింది. అంటే 2016 నవంబర్‌లో ఉన్న టోకు బాస్కెట్ ధరతో పోల్చితే 2017 నవంబర్‌లో టోకు బాస్కెట్ ధర 3.93% పెరిగిందన్నమాట. ఇంత స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. ఇదే ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.59% కాగా, గత ఏడాది నవంబర్‌లో 1.82%గా ఉంది. ఎగుమతులకు ’గ్లోబల్ డిమాండ్’ బలం! మెరుగుపడిన అంతర్జాతీయ డిమాండ్.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. జీఎస్టీ రిఫండ్ ప్రక్రియ సరళీకరణ వెరసి నవంబర్‌లో భారత్ ఎగుమతుల్లో 30.55 శాతం భారీ వృద్ధి నమోదయ్యింది. విలువ రూపంలో ఎగుమతులు 26.19 బిలియన్ డాలర్లు. 2016 నవంబర్‌లో భారత్ ఎగుమతుల విలువ 20.06 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు కూడా 19.61 శాతం పెరిగాయి. ఆటోమొబైల్స్ ♦ ఇటలీ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ‘డ్యుకాటి’ తన కొత్త సూపర్ బైక్ ‘స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.52 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ♦కొరియాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ’ఎల్జీ’ తాజాగా తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ’వీ30ప్లస్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.44,990. ♦ఇటలీ లగ్జరీ కార్ల కంపెనీ ‘మాసెరటి’.. కొత్త లగ్జరీ కారు ‘క్వాట్రోపోర్టే జీటీఎస్’ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.2.7 కోట్లు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ♦స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ ‘వోల్వో కార్స్’ తన ప్రముఖ ఎస్యూవీ ‘ఎక్స్‌సీ 60’లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.55.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్). డీల్స్.. ♦ ఆదిభట్లలోని ఏరోస్పేస్ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు చేయడానికి టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ ఏరో సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), అంతర్జాతీయ ఇంజనీరింగ్ దిగ్గజం జీఈ గ్రూప్ ఒప్పందం చేసుకున్నాయి. ఇవి ఇక్కడ సీఎఫ్ఎం లీప్ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారు చేస్తాయి. పెట్టుబడి విలువ రూ.3,200 కోట్లపైనేనని అంచనా. ♦ భారతీ ఎయిర్టెల్ డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) విభాగంలో 20 శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేయనున్నది. తమ డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్కు చెందిన అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,310 కోట్లు. ♦ దేశీయ దిగ్గజ ఉక్కు కంపెనీ సెయిల్.. అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్‌తో కలసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. వాహన తయారీకి ఉపయోగపడే ఉక్కును ఉత్పత్తి చేసే ఈ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు సెయిల్ డైరెక్టర్ల బోర్డ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. -
గతవారం బిజినెస్
ఎయిర్పోర్ట్స్లోకి భారీ పెట్టుబడులు! ఎయిర్‌పోర్ట్స్ విభాగంలోకి వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 6 బిలియన్ డాలర్లమేర (దాదాపు రూ.40,000 కోట్లు) పెట్టుబడులు రావొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే అభిప్రాయపడ్డారు. అపార వృద్ధి అవకాశాలున్న దేశీ విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఇటీవల కొత్త పౌరవిమానయాన పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గ్లోబల్ టాప్-10లో ఆర్ఐఎల్ ప్రపంచంలోని టాప్-10 ఎనర్జీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది ఇది 14వ స్థానంలో ఉండేది. ప్లాట్స్ నిర్వహించిన ‘టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలు-2016’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఆయిల్ కార్ప్ 66వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకింది. ఇక హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ 133వ స్థానం నుంచి 48వ స్థానానికి చేరింది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటమే వీటి స్థానాల మెరుగుదలకు కారణమని ప్లాట్స్ పేర్కొంది. ఓఎన్జీసీ స్థానం మాత్రం 17 నుంచి 20కి పడింది. కోల్ ఇండియా 38వ స్థానంలో ఉంది. ఇక అదాని పవర్ 250వ స్థానంలో నిలిచింది. ఐపీవోకు బీఎస్ఈ దరఖాస్తు ఆసియాలోనే అతి పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్గా పేరొందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తు పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించనుంది. బీఎస్ఈలో ప్రస్తుత వాటాదారులైన సింగపూర్ ఎక్స్ఛేంజ్, మారిషస్ కేంద్రంగా పనిచేసే అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ క్వాంటమ్ ఫండ్, అటికస్ సంస్థలు తమకున్న 2.99 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పూర్తిగా విక్రయించనున్నాయి. అలాగే, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, కాల్డ్వెల్ ఇండియా హోల్డింగ్స్, అకాసియా బన్యన్ పార్ట్నర్స్ సైతం తమకున్న వాటాల్లో కొద్ది మేర విక్రయించనున్నాయి. కార్ల విక్రయాలు 10 శాతం అప్ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు వరుసగా 14వ నెలలోనూ పెరిగాయి. తాజాగా ఆగస్ట్‌లో వీటి అమ్మకాలు 17 శాతంమేర ఎగశాయి. దీంతో సియామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తన వ ృద్ధి అంచనాలను 10-12 శాతానికి సవరించింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఆగస్ట్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2,58,722 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గతేడాది ఇదే నెలలో 2,21,743 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 1,62,360 యూనిట్ల నుంచి 1,77,829 యూనిట్లకు ఎగశాయి. మొబైల్ యూజర్లు 103.5 కోట్లు దేశంలోని మొబైల్ యూజర్ల సంఖ్య జూన్ చివరకి 103.5 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మళ్లీ టాప్-5 టెలికం కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మొత్తం టెలికం కస్టమర్ల సంఖ్య (వైర్లెస్, వైర్‌లైన్) 105.9 కోట్లుగా ఉంది. మే నెలలో 103.3 కోట్లుగా ఉన్న మొబైల్ సబ్స్క్రైబర్ల (వైర్లెస్) సంఖ్య జూన్ చివరకి 0.19 శాతం స్వల్ప వృద్ధితో 103.5 కోట్లకు ఎగసింది. ఇదే సమయంలో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.48 కోట్ల నుంచి 2.47 కోట్లకు తగ్గింది. 19 నుంచి ఐసీఐసీఐ ప్రు. లైఫ్ ఐపీవో జీవిత బీమా రంగం నుంచి తొలిసారిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతుంది. ఈ ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.300 - రూ.334గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ.6,000 కోట్ల నిధులను సమీకరించనుంది. టాటా మోటార్స్‌కి రూ.900 కోట్ల ఆర్డర్లు దేశీ దిగ్గజ వాణిజ్య వాహన (సీవీ) తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు తాజాగా రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. దాదాపు 25 స్టేట్ /సిటీ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఎస్టీయూ) నుంచి తమకు 5,000కు పైగా బస్సుల తయారీకి ఆర్డర్లు వచ్చాయని, వీటి విలువ రూ.900 కోట్లు ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. సీవీ ప్యాసింజర్ విభాగంలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ చర్య తమకు దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం కాఫీ బిజినెస్‌లోకి ఐటీసీ దేశీ బహుళజాతి సంస్థ ఐటీసీ ఫుడ్స్ తాజాగా ప్రీమియం కాఫీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా సన్‌బీన్ గౌర్మెట్ కాఫీని నికమలై, పనగిరి అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త కాఫీ వేరియంట్లు కేవలం ఐటీసీ లగ్జరీ హోటల్స్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు ఈ కాఫీ వేరియంట్లను హోటల్స్‌లో ఉండే ఫుడ్ అండ్ బేవరేజ్ ఔట్‌లెట్స్‌లో 200 గ్రాముల ప్యాకెట్‌కు రూ.800లు వెచ్చించి కొనుగోలు చేయవచ్చని ఐటీసీ పేర్కొంది. అశోక్ లేలాండ్‌తో నిస్సాన్ దోస్తీ కట్ జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్‌తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. వచ్చే నెల 7 నుంచి దేశంలో ఐఫోన్-7 టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్‌ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్స్ పలు దేశాల్లో సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్స్ 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 స్క్రీన్ పరిమాణం 4.7 అంగుళాలు, ఐఫోన్ 7 ప్లస్ స్క్రీన్ పరిమాణం 5.5 అంగుళాలుగా ఉంది. యాపిల్ తాజాగా ఐఫోన్ 7 ఆవిష్కరణ తర్వాత తన ఇండియా వెబ్సైట్ నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్, ఐఫోన్ 5ఎస్ మోడళ్లను తొలగించింది. డీల్స్.. * జపాన్‌కు చెందిన అగ్రగామి సంస్థ ఫ్యుజి ఎలక్ట్రిక్ ఫరీదాబాద్‌కు చెందిన జెమ్‌కో క్రంటోల్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఫ్యుజి జెమ్‌కో ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థలో ఫ్యుజికి 51 శాతం, జెమ్కోకు 49 శాతం చొప్పున వాటా ఉంటుంది. జెమ్‌కో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, పవర్ కంట్రోల్స్ సిస్టమ్స్ తయారీలో ఉన్న సంస్థ. * ఆన్లైన్ ప్రకటనల పోర్టల్ క్వికర్, స్టెప్నీని బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. కారు యజమానులను, సమీపంలోని కారు సర్వీసు కేంద్రాలతో అనుసంధానానికి వీలు కల్పించేదే స్టెప్నీ. * మహీంద్రా అండ్ మహీంద్రా, క్యాబ్ సేవల సంస్థ ఓలా మధ్య కీలక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా ఓలా డ్రైవర్లకు మహీంద్రా నుంచి 100 శాతం రుణ సాయం అందుతుంది. కొత్తగా కొనుగోలు చేసే కార్లకే కాకుండా ఇప్పటికే కార్లను కలిగి ఉన్న వారికి సైతం రుణాలు లభిస్తాయి. అలాగే మహీంద్రా ఇన్సూరెన్స్ విభాగం నుంచి డ్రైవర్లకు తక్కువ ప్రీమియంకే బీమా పథకాలు లభిస్తాయి. -
గతవారం బిజినెస్
నియామకాలు.. * రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. * బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్‌లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నవ భారత్ వెంచర్స్ బోనస్ ఇష్యూ ప్రతిపాదిత బోనస్ షేర్ల ఇష్యూకి నవ భారత్ వెంచర్స్ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి మరొక షేరు లభిస్తుంది. బోనస్ ఇష్యూకి సెప్టెంబర్ 1ని రికార్డు తేదిగా నిర్ణయించారు. బోనస్ ఇష్యూ తర్వాత పెయిడప్ క్యాపిటల్ 17,85,75,482 షేర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 11 వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ ప్రభుత్వ రంగ ఎస్బీఐ డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.11 వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు టైర్ 1 అదనపు మూల ధనం సమీకరణకు అనుమతిస్తూ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ బీఎస్ఈకి సమాచారం అందించింది. బాసెల్-3 కాంప్లియెంట్ డెట్ ఇనుస్ట్రుమెంట్లను డాలర్ లేదా రూపాయిల్లో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. టెక్నాలజీ స్టార్టప్‌లలో భారత్‌కు మూడో ర్యాంక్ ప్రపంచ వ్యాప్తంగా పురుడు పోసుకుంటున్న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు అసోచామ్ వెల్లడించింది. అమెరికా ప్రథమ స్థానంలో, యూకే రెండో స్థానంలో ఉన్నాయి. దేశీయంగా చూస్తే బెంగళూరు అత్యధిక స్టార్టప్‌లను ఆకర్షిస్తూ అగ్ర స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2015 వరకు అమెరికాలో 47వేల టెక్నాలజీ స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి. యూకేలో 4,500, భారత్‌లో 4,200 స్టార్టప్‌లు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇక దేశంలో బెంగళూరు 26 శాతం టెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్ 23 శాతం, ముంబై 17 శాతం, హైదరాబాద్ 8 శాతం, చెన్నై 6 శాతం స్టార్టప్‌లను ఆకర్షించాయి. జీఎంఆర్ చేతికి గోవా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రా తాజాగా గోవాలో విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. ఉత్తర గోవాలోని మోపాలో చేపట్టే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లుగా ఉంటుందని అంచనా. బీవోవోటీ (బిల్డ్, వోన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల (మొత్తం వ్యక్తులది) సంపదతో ఈ స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. త్వరలో ఎయిర్‌సెల్-ఆర్‌కామ్ విలీనం! ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల మధ్య వచ్చే వారంలో సంతకాలు జరిగే అవకాశముంది. ఈ కంపెనీల మధ్య టర్మ్ షీట్ ఖరారయ్యింది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కంపెనీల విలీనం విజయవంతమైతే మూడో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భవిస్తుంది. కీలక బ్యాంకులుగా ఎస్బీఐ, ఐసీఐసీఐ! ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా’ ప్రకటించింది. ఇలాంటి హోదా ఆ బ్యాంకులకు లభించడం వరుసగా ఇది రెండవ సంవత్సరం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవసీకృతంగా చాలా ప్రాముఖ్యతగలవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం. మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు! దక్షిణాఫ్రికాకు చెందిన పేమెంట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ‘నెట్ 1’ కంపెనీ.. భారత్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ‘మోబిక్విక్’లో రూ.268 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనున్నది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒక వ్యూహాత్మక సబ్స్క్రిప్షన్ ఒప్పందం కుదిరింది. దీంతో నెట్ 1కి చెందిన వర్చువల్ కార్డ్ టెక్నాలజీ ఇకపై అన్ని మోబిక్విక్ వాలెట్లతో అనుసంధానం కానున్నది. మోబిక్విక్‌కు 3.2 కోట్ల మొబైల్ వాలెట్ యూజర్లు ఉన్నారు. డీల్స్.. * శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన బయోటెక్ కంపెనీ మెడివేషన్ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ప్రత్యేకీకరణ సాధిస్తున్న మెడివేషన్ను 1,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నామని ఫైజర్ పేర్కొంది. ఈ డీల్ విలువ మెడివేషన్ కంపెనీ మార్కెట్ విలువ(1,110 కోట్ల డాలర్ల)కంటే ఎక్కువ కావడం విశేషం. * యాక్సెంచర్, ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ కంపెనీ రెడ్కోర్ను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ కొనుగోలు వివరాలు తెలియలేదు. * సాఫ్ట్వేర్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా స్మార్ట్ షెడ్యూలింగ్ యాప్ ‘జెనీ’ని కొనుగోలు చేసింది. గూగుల్, యాపిల్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాన్ని మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగానే కంపెనీ ఈ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. లావాదేవీకి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు. -
గతవారం బిజినెస్
బ్రెగ్జిట్ కల్లోలం యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తాజా రిఫరెండంలో బ్రిటన్ ప్రజలు నిర్ణయించడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. పౌండు, యూరోలతో సహా వర్ధమాన కరెన్సీలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం రివ్వున ఎగిసింది. ఎఫ్‌డీఐలకు మరోసారి రెడ్‌కార్పెట్ మోదీ సర్కారు మరోమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. రక్షణ, పౌర విమానయాన, ఫార్మా, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో (డీటీహెచ్), కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రై వేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయ పన్ను చెల్లించకుంటే జైలుకే ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసిం ది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుం డా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాస్ సబ్సీడీని రద్దు చేయనున్నది. సాఫ్ట్‌బ్యాంక్‌కు అరోరా గుడ్ బై సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలిగారు. ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజెంటెటివ్ ైడె రెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఇది జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈయన సాఫ్ట్‌బ్యాంక్ అడ్వైజర్‌గా కొత్తగా ఏడాదిపాటు సేవలు అందించనున్నారు. ఇక నికేశ్ అరోరా స్థానాన్ని కెన్ మియాచి భర్తీ చేయనున్నారు. రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్‌కు ఊరట విశిష్టమైన ఉత్పత్తులను విక్రయించే యాపిల్ వంటి కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధన విషయంలో కొంత వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. 30 శాతం విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధనలో మూడేళ్ల వెసులుబాటును కల్పిస్తున్నట్లు డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు. నిధుల సమీకరణ దిశగా జేఎస్పీఎల్ నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) కంపెనీ, ఎన్సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధులు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపిందని జేఎస్పీఎల్ వెల్లడించింది. మెగా స్పెక్ట్రం వేలానికి గ్రీన్‌సిగ్నల్ దేశీ టెలికం రంగంలో మెగా స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్ అయింది. మొత్తం ఏడు రకాల బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రంను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.5.66 లక్షల కోట్లు జమవుతాయని అంచనా. ప్రధానంగా హైస్పీడ్ 4జీ డేటా, వాయిస్ సేవలను టెల్కోలు విస్తరించేందుకు ఈ స్పెక్ట్రంతో వీలవుతుంది. సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్ సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్లను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించింది. టాటా సన్స్‌కు భారీ జరిమానా జపాన్‌కు చెందిన ఎన్టీటీ డొకొమో కు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చె ల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్ ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని ఎన్టీటీ డొకొమో తెలిపింది. టయోటా డీజిల్ ఇంజిన్ ప్లాంటు రెడీ జపాన్ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టయోటా’ తాజాగా రూ.1,100 కోట్ల వ్యయంతో బెంగళూరులో నిర్మించిన డీజిల్ ఇంజిన్ తయారీ ప్లాంటును గురువారం లాంఛనంగా ప్రారంభించింది. కంపెనీ ఇందులో శక్తివంతమైన గ్లోబల్ డీజిల్ (జీడీ) ఇంజిన్లను తయారు చేయనున్నది. దేశంలో కంపెనీకి ఇది తొలి జీడీ ఇంజిన్ ప్లాంట్. ఇక్కడ 1జీడీ-ఎఫ్‌టీవీ 2.8 లీటర్, 2జీడీ-ఎఫ్‌టీవీ 2.4 లీటర్ ఇంజిన్లను రూపొందిస్తామని కంపెనీ పేర్కొంది. రాస్‌నెఫ్ట్ వాటాపై దేశీ చమురు సంస్థల కన్ను రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్సీలో 19.5 శాతం వాటాను రష్యా విక్రయించనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. డీల్స్.. * చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో అత్యాధునిక హెల్త్‌కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా హైనాన్ ఎకొలాజికల్ స్మార్ట్ సిటీ గ్రూప్ (హెచ్ఈఎస్సీజీ)తో అపోలో హాస్పిటల్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. * భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. తర్వాతి తరం క్లౌడ్ ఆధారిత డెరివేటివ్ పోస్ట్ ట్రేడ్ ప్రాసెసింగ్ సర్వీస్‌ను అందించడం కోసం ఈ సంస్థలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. * స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం కారణంగా ఈ జేవీలో దైచీ వాటా 26 శాతం నుంచి 44 శాతానికి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26 శాతం వాటా ఉంది. * మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్, లండన్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోని’ను కొనుగోలు చేసింది. డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. * టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. * ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఐ కేర్ చెయిన్, ‘దృష్టి’లో పెట్టుబడులు పెట్టారు. -
గతవారం బిజినెస్
గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ శుభారంభం స్టాక్ ఎక్స్చేంజ్ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ గత సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. టాటా క్లిక్‌లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా టాటా గ్రూప్ ఇటీవలనే ప్రారంభించిన తన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘టాటా క్లిక్’లో ప్రత్యేకమైన స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మైక్రోసాఫ్ట్ తన ట్యాబ్లెట్స్, సాఫ్ట్వేర్, ఫోన్లను వినియోగదారులకు విక్రయించనున్నది. ప్రోంటెక్లో పెరిగిన హవెల్స్ వాటా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హవెల్స్ తన భాగ స్వామ్య కంపెనీ ప్రోంటెక్ రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో అధిక వాటాను చేజిక్కించుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 51 శాతం ఉన్న వాటాను హవెల్స్ 70 శాతానికి పెంచుకున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రోంటెక్ ప్రస్తుతం ఎల్ఈడీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ రంగంలో ఉంది. ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ పేరు మార్పు ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీ పేరు భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్గా మారింది. భారత్‌లో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో లక్షకు పైగా గ్రామాల్లో 63.65 లక్షల మహిళా సభ్యుల సూక్ష్మ రుణ అవసరాలను తీరుస్తోంది. ఈ సంస్థ రుణ రికవరీ పద్ధతులు దారుణంగా ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం 2010లో సంచలనం సృష్టించింది. ఎంజీఎల్ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.380-421 మహానగర్ గ్యాస్ లిమిటెడ్(ఎంజీ ఎల్) తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు ధర శ్రేణిని రూ.380-421గా నిర్ణయించింది. దేశంలో రెండో అతి పెద్ద సీఎన్జీ రిటైల్ సంస్థ అయిన ఎంజీఎల్ ఈ ఐపీఓ ద్వారా రూ.1,040 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగుస్తుంది. పెరిగిన టోకు ద్రవ్యోల్బణం కూరగాయల ధరలు మండిపోవడంతో మే నెల టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.79 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 2.20గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 0.45గా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.34 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.21 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో 12.94 శాతానికి పెరిగింది. మాల్యా నేరస్థుడే! బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేయడంతోపాటు.. బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) మరో అడుగుముందుకేసింది. ఈడీ వినతి మేరకు ఇక్కడి ప్రత్యేక మనీలాండరింగ్ నేరాల విచారణ(పీఎంఎల్ఏ) కోర్టు మాల్యాను మంగళవారం ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించింది. ఐడీబీఐ బ్యాంకుకురూ.900 కోట్ల రుణ బకాయిలను ఎగవేసిన కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తగ్గిన ఎగుమతులు అంతర్జాతీయంగా డిమాండ్ మందగించడంతో ఎగుమతులు మే నెలలో 0.79% క్షీణించి 2,217 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఎగుమతులు వరుసగా 18వ నెలలో కూడా పతనమయ్యాయి. మే నెలలో ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా క్షీణించాయి. గత ఏడాది మేలో 3,275 కోట్లు డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది మేలో 13% తగ్గి 2,844 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది మేలో 1,040 కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు ఈ ఏడాది మేలో 627 కోట్ల డాలర్లకు తగ్గింది. సామాన్యుడికీ విమాన యోగం కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం.. ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500, అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే చార్జీ ఉండాలి. అలాగే వివాదాస్పద 5/20 నిబంధనకు కూడా కేంద్రం చరమగీతం పాడింది. ప్రయాణికులకు టిక్కెట్ రద్దుపై భారీగా కోతపెట్టకుండా పరిమితి విధింపు, అదనపు బ్యాగేజీపై రుసుము తగ్గింపుతోపాటు అకస్మాత్తుగా ప్రయాణాలను రద్దు చేసే ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం అందేవిధంగా నిబంధనలను చేర్చారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆమోదం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితోపాటు దాదాపు రూ.1,000 కోట్ల మూలధనంలో ఏర్పాటయిన భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దాదాపు 90 బ్రాంచీలతో పనిచేస్తోంది. తాజా పరిణామంతో ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా ఆవిర్భావ దిశలో ఎస్బీఐ కీలక అడుగు వేసినట్లయ్యింది. చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం చక్కెర ధరను అదుపు చేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటిఫై చేసినట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆరు నెలల క్రితం రూ. 30 వద్దనున్న చక్కెర ధరలు అమాంతం రూ. 40 వరకూ పెరిగాయి. ఈ నేపథ్యంలో 25 శాతం ఎగుమతి సుంకాన్ని విధించాలంటూ ఆహార మంత్రిత్వ శాఖ సిఫార్సుచేయగా, అంతకంటే తక్కువ సుంకాన్నే ఆర్థిక శాఖ విధించింది. నిధుల సమీకరణలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్! అందుబాటు ధరల్లో గృహాలు, మౌలిక వసతుల రంగానికి రుణాలు అందించేందుకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదార్ల అనుమతి కోరనుంది. డెట్ ఇన్స్ట్రుమెంట్స్, టైర్-2 కేపిటల్ బాండ్స్, సీనియర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ను దేశీయ మార్కెట్లో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.50వేల కోట్లకు మించకుండా నిధులు సేకరించాలని బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. స్టార్టప్‌ల కోసం ఎస్బీఐ ఫండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో నెలకొనే స్టార్టప్‌ల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 200 కోట్లతో ఫండ్ ఏర్పాటుచేసింది. బ్యాంకింగ్, సంబంధిత టెక్నాలజీ కోసం ఇండియాలో రిజిస్టర్ అయిన స్టార్టప్ కంపెనీకి రూ. 3 కోట్ల వరకూ ఈ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందించనున్నట్లు ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కొ)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ.. హడ్కొలో పెయిడప్ ఈక్విటీలో 10 శాతం వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డీల్స్.. * టెక్నాలజీ రంగంలో అతిపెద్ద డీల్‌కు మైక్రోసాఫ్ట్ తెరతీసింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్లైన్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్ఇన్ను చేజిక్కిం చుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం. * వెల్స్పన్ ఎనర్జీ అనుబంధ కంపెనీ ‘వెల్స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’(డబ్ల్యూఆర్ఈపీఎల్)ని టాటా పవర్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.9,249 కోట్లుగా ఉంటుందని అంచనా. * దేశీ బీమా రంగంలో అతిపెద్ద విలీన-కొనుగోలు ఒప్పందానికి తెరలేచింది. మ్యాక్స్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలను విలీనం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు మూడు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. -
గతవారం బిజినెస్
వ్యాపార నిర్వహణ... భారత్‌కు రెండో ర్యాంక్ వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందని నివేదిక పేర్కొంది. ఎల్అండ్టీకి ఖతార్ ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్ ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియం నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది. గ్రీన్ బాండ్లతో యాక్సిస్ నిధుల సమీకరణ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్! ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. యథాతథ రేట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు (7 శాతం), రెపో రేటు (6.5 శాతం), రివర్స్ రెపో రేటు (6 శాతం), నగదు నిల్వల శాతం (సీఆర్ఆర్-4 శాతం)లను అంచనాలకనుగుణంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు. టాప్-100 మహిళల్లో నలుగురు మనవారు.. ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. అలాగే అరుంధతీ భట్టాచార్య.. ఫోర్బ్స్ ‘ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల రికార్డు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. మే నెలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)తో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4,721 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు యాంఫీ పేర్కొంది. ఆరు నెలల కాలంలో ఈ నెలలోనే అధిక పెట్టుబడులు వచ్చాయని, రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసింది. సిండికేట్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని వివరించింది. ఆఫీసు లీజుల్లో బెంగళూరు టాప్ ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటంలో బెంగళూరు రికార్డుసృష్టించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక ఆఫీసు స్థల లీజు ఒప్పందాలు బెంగళూరులోనే చోటు చేసుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలియజేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి బెంగళూరు, టోక్యో, ఢిల్లీ- ఎన్సీఆర్లో ఈ ఏడాది ప్రారంభం నుంచే లీజింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సంస్థ పేర్కొంది. రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ బకాయిల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొంది. ఇక నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది. హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్మెంట్ సెంటర్ కావటం విశేషం. తిరిగి పరిశ్రమల పడక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -0.8 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం. అమ్మకానికి డెక్కన్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరు తేదీగా పేర్కొంది. డీల్స్.. * పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. * అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది. * టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్ఎల్) సంస్థ 3 స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్ఎల్ వివరించింది. * ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. * స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు పెరుగుతోంది. తాజాగా ఆయన ఈ-టికెటింగ్ కంపెనీ క్యజూంగలో పెట్టుబడులు పెట్టారు. * బీఎల్ఏ పవర్లో 15.23 శాతం వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. -
గతవారం బిజినెస్
ఈ-కామర్స్‌లోకి టాటా గ్రూప్ టాటా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘టాటాక్లిక్.కామ్’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని టాటా యూనిస్టోర్ నిర్వహించనున్నది. టాటాక్లిక్లో టాటా ఇండస్ట్రీస్ 90 శాతం వాటాను, గ్రూప్ రిటైల్ విభాగం ట్రెంట్ మిగిలిన 10 శాతం వాటాను కలిగింది. ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారిగా ‘ఫిజిటల్’ విధానాన్ని ఆవిష్కరిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. ఈ విధానంలో ఆన్లైన్లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి, దాన్ని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 530 స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చని వివరించారు. మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై! స్మార్ట్ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కంపెనీ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్‌కు విక్రయించింది. టాప్-10లో ఏడు మారుతీ కార్లే ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ... దేశీ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోం ది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ప్యాసెంజర్ కార్లలో ఏడు మారుతీవే కావటం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదలైన ఈ గణాంకాల్లో మారుతీ ఆల్టో అగ్రస్థానంలో ఉంది. దీని విక్రయాలు 16,583 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆటో మొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. అల్టో తర్వాతి స్థానాల్లో మారుతీ స్విఫ్ట్ (15,661 యూనిట్లు), మారుతీ వేగన్ ఆర్ (15,323 యూనిట్లు) వంటి తదితర మోడళ్లు ఉన్నాయి. భారత్‌లో చుక్కల్లో స్పెక్ట్రం ధర: సిస్టెమా భారత్‌లో స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందని రష్యాకు చెందిన సిస్టెమా కంపెనీ భారత టెలికం విభాగం ఎస్ఎస్టీఎల్ పేర్కొంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించడం చాలా కష్టమని సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్) సీఈవో సెర్జీ సవ్కెన్నో వ్యాఖ్యానించారు. ఎస్ఎస్టీఎల్ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినీపొలిస్ రూ.400 కోట్ల పెట్టుబడులు! మెక్సికన్ మల్టీప్లెక్స్ చైన్ ‘సినీపొలిస్’ భారత్‌లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టి, వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 160 సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. సినీపొలిస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ జేవియర్ సోటోమేయర్ ఈ విషయం వెల్లడించారు. మెక్సికో తర్వాత భారతే తమకు అతిపెద్ద మార్కెట్ అన్నారు. టాప్-60 పట్టణాల్లో విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త స్క్రీన్ల ఏర్పాటు ఆరు నెలల్లో పూర్తవుతుందని సంస్థ తెలిపింది. ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఉన్న దేశం భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. 4,200 కంపెనీలపై డి-లిస్టింగ్ వేటు! స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా సెబీ కీలక చర్యలకు సమాయత్తమవుతోంది. ముఖ్యంగా ట్రేడింగ్ లావాదేవీలు జరగని కంపెనీలపై సెబీ కొరడా ఝళిపిస్తోంది. ఇలాంటి 4,200కు పైగా లిస్టెడ్ కంపెనీలను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించే ప్రణాళికల్లో ఉంది. మార్కెట్ నిపుణుల కోసం ఎన్ఎస్ఈ అకాడెమీ ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను ద ృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘ఎన్ఎస్ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఈ కొత్త అకాడెమీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది. నాల్కో షేర్ల బైబ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ప్రి-ఓన్డ్ కార్ల వ్యాపారంలోకి రెనో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా ప్రి-ఓన్డ్ కార్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే బెంగళూరులో ‘రెనో సెలెక్షన్’ అనే ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అన్ని బ్రాండ్లకు చెందిన ప్రి-ఓన్డ్ కార్ల కొనుగోలు, విక్రయం, ఎక్స్ఛేంజ్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తామని రెనో తెలిపింది. అలాగే పాత కార్లకు 24ఁ7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఫైనాన్స్ సదుపాయం, వారెంటీ వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొంది. ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో మనవి 56 ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2,000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉంది. ఇది 121వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ 50.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. దీని మార్కెట్ విలువ 23.3 బిలియన్ డాలర్లు. ఇక ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా అనే అన్ని చైనా బ్యాంకులే ఉన్నాయి. నియామకాలు హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్ఈకి నివేదించింది. -
గతవారం బిజినెస్
టోకు ద్రవ్యోల్బణం యూ టర్న్ తయారీ రంగం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్‌లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 0.34 శాతం పెరిగిందన్నమాట. 2015 ఏప్రిల్‌లో ఈ రేటు -2.43 శాతం. విలీనానికి ఎస్బీఐ గ్రూప్ సిద్ధం ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది. క్రాష్ టెస్ట్‌లో ఐదు కార్లు ఫెయిల్ భారత్‌లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్సీఏపీ(న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్...ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్ట్‌ల్లో విఫలమయ్యాయని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వ భ ద్రత నియమ నిబంధనలకనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి. టాటా మెటాలిక్స్ విలీనానికి టాటా స్టీల్ స్వస్తి టాటా మెటాలిక్స్, టాటా మెటాలికస్ డీఐ పైప్స్.. ఈ రెండు కంపెనీలను విలీనం చేసుకునే యోచనను టాటా స్టీల్ కంపెనీ అటకెక్కించింది. ఈ విలీనానికి సంబంధించి, చట్ట, శాసనపరమైన ఆమోదాలు పొందడంలో జాప్యం కావడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ విలీన యోచనను పక్కన పెట్టామని టాటా స్టీల్ తెలిపింది. స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకం చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్‌లెస్ ట్యూబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల నుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవడానికి ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీఏడీ ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక ప్రతిపాదన చేసింది. మార్కెట్లోకి మళ్లీ నోకియా ఫోన్స్ మళ్లీ నోకియా బ్రాండ్ ఫోన్లు, ట్యాబ్‌లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఎఫ్ఐహెచ్ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. నోకియా బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్‌ను హెచ్ఎండీ గ్లోబల్‌కు పదేళ్లపాటు లీజ్‌కు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. పీ-నోట్ల నిబంధనలు మరింత కఠినం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి.. పీ-నోట్ల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పార్టిసిపేటరీ నోట్ల ద్వారా ప్రయోజనం పొందేవాళ్లు మనీల్యాండరింగ్‌ను నిరోధించే భారత చట్టాలకు బద్దులై ఉండడం తప్పనిసరని పేర్కొంది. ఆష్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ (ఓడీఐ-వీటినే పీ-నోట్లగా వ్యవహరిస్తారు)కు సంబంధించి ఏవైనా సందేహాస్పద లావాదేవీలు ఉంటే, వీటిని జారీ చేసిన సంస్థలు తక్షణం తమకు నివేదించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ అసిస్టెంట్‌ను ఆవిష్కరించిన పిచాయ్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘గూగుల్ అసిస్టెంట్’ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీనితోపాటు ఆయన ‘గూగుల్ హోమ్’ అనే వైస్-యాక్టివేటెడ్ ప్రొడక్ట్‌ను, ‘అలో’ మేసేజింగ్ యాప్‌ను, ‘డుయో’ వీడియో కాలింగ్ యాప్‌ను, ఇన్స్టాంట్ యాప్స్‌ను, వీఆర్ ప్లాట్‌ఫామ్ ‘డేడ్రీమ్’ను, మొబైల్ సాఫ్ట్వేర్ ‘ఆండ్రాయిడ్ ఎన్’ను, వియరబుల్ ప్లాట్‌ఫామ్ ‘ఆండ్రాయిడ్ వియర్ 2.0’ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన సంస్థ 10వ వార్షిక డెవలపర్ సమావేశంలో వీటి ఆవిష్కరణ జరిగింది. హెచ్ఎస్బీసీ విశాఖ బ్రాంచ్ మూసివేత ! బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా ఇండియాలో కొన్ని శాఖల్ని మూసివేయనుంది. ప్రస్తుతం 29 పట్టణాల్లో 50 శాఖలను కలిగిన హెచ్ఎస్బీసీ.. తన బ్రాంచ్‌ల సంఖ్యను 26కి (14 పట్టణాల్లో) తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ మూసివేయనున్న బ్రాంచ్‌ల్లో విశాఖపట్నం శాఖ కూడా వున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ సెంటర్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్‌పై పెట్టుబడులను వెల్లడించని యాపిల్... దీని ద్వారా దాదాపు 4,000 దాకా ఉద్యోగాలొస్తాయని తెలియజేసింది. కాగా కంపెనీ బెంగళూరులో ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్’ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మాల్యా మొత్తం కట్టాల్సిందే: పీఎన్బీ చీఫ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్‌ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్ఎస్ఈలో వాటా విక్రయ దిశగా ఎస్బీఐ ఎన్ఎస్ఈలో కొంత వాటాను విక్రయించాలని ఎస్బీఐ యోచిస్తోంది. ఎస్బీఐకు 15 శాతం వాటా ఉంది. ఈ వాటాలో 5 శాతాన్ని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా విక్రయించనున్నామని ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా ఎస్బీఐ పేర్కొంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు వస్తాయని బ్యాంక్ అంచనా. డీల్స్.. * బయోఫార్మాస్యూటికల్ సంస్థ అనకార్ ఫార్మాస్యూటికల్స్‌ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనున్నది. అనకార్ ఫార్మాను 520 కోట్ల డాలర్లకు(రూ.34,320 కోట్లు సుమారుగా) అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని ఫైజర్ తెలిపింది. * స్టార్టప్‌లలో రతన్ టాటా పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఆయన తాజాగా శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన అత్యవసర వైద్య సేవలందించే స్టార్టప్.. ఎంర్జెన్సీ ఇన్కార్పొలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్‌బోట్, నికిడాట్ఏఐలోనూ ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల వివరాలు వెల్లడి కాలేదు. * టాటా కమ్యూనికేషన్స్ సంస్థ తన భారత్, సింగపూర్‌లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74 శాతం వాటాను ఎస్టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించింది. * క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్‌కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతం వాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది. -
గతవారం బిజినెస్
నియామకాలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చైర్మన్‌గా అశోక్ చావ్లా నియమితులయ్యారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. చావ్లా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈయన 2019 మార్చి 27 వరకు పదవిలో కొనసాగనున్నారు. చావ్లా నియామకం మే 3 నుంచి అమల్లోకి వచ్చింది. పరిశ్రమల పేలవ పనితీరు పరిశ్రమల ఉత్పత్తి గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చి) నత్తనడకన సాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 2.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014-15లో ఈ రేటు 2.8 శాతం. గురువారం మార్చి గణాంకాలు వెళ్లడికావడంతో... ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరు స్పష్టమైంది. ఒక్క మార్చిని చూస్తే... వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం పైకి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో మళ్లీ మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. 5.39 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 5.69 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాత రెండు నెలల్లో 5.18 శాతంగా, 4.83 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆహార ధరలు ఎగయడం కారణంగా ఉంది. ఎగుమతులు 17వ ‘సారీ’ భారత్ ఎగుమతులు క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధి లేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి నమోదుకావడం వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు 23 శాతం క్షీణతతో 25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరోక్ష పన్ను వసూళ్ల శుభారంభం పరోక్ష పన్నుల విభాగం కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో (2016-17 ఏప్రిల్-మార్చి) శుభారంభాన్ని ఇచ్చింది. వసూళ్లు 42 శాతం పెరిగాయి. 2015-16 ఇదే నెలలో రూ. 45,417 కోట్లుగా ఉన్న ఈ విభాగం వసూళ్లు తాజా సమీక్షా నెలలో రూ.64,394 కోట్లకు చేరాయని ఒక అధికార ప్రకటన పేర్కొంది. టాటా యూకే ప్లాంట్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ప్లాంట్ల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది. వృద్ది వ్యూహంలో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. యూకే ప్లాంట్ల కొనుగోలుకు ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది. మాల్యాను బహిష్కరించలేం బ్యాంకింగ్ రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే ఆయనపై ఉన్న కేసులు, తీవ్ర అభియోగాలకు సంబంధించి ఆయన ‘అప్పగింత’ను భారత్ కోరవచ్చని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాల్ డ్రాప్స్‌పై టెల్కోలకు ఊరట కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని, తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారీగా తగ్గిన పసిడి డిమాండ్ భారత్‌లో పసిడి డిమాండ్ 2016 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారీగా పడిపోయింది. 2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే.. 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎకై ్సజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కరువు భారం రూ.6.5 లక్షల కోట్లు! భారత్‌లోని 10 రాష్ట్రాల్లోని కరువు ఆర్థిక వ్యవస్థపై కనీసం రూ.6.5 లక్షల కోట్ల భారం మోపనున్నదని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాల్లో 33 కోట్ల మంది కరువు బారిన పడ్డారని అసోచామ్ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్లలో నీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటడం.. కరువు పీడిత ప్రాంతాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించింది. డీటీఏసీ సవరణకు భారత్-మారిషస్ ఓకే ద్వంద్వ పన్ను నివారణా ఒప్పందం (డీటీఏసీ) సవరణ ఒప్పందంపై భారత్-మారిషస్ సంతకాలు చేశాయి. మారిషస్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ భారత్ రెసిడెంట్ కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా పొందే క్యాపిటల్ గెయిన్‌పై పన్ను విధించే అవకాశం భారత్‌కే లభిస్తుండడం ఈ ఒప్పందంలో ప్రధానాంశం. 2017 ఏప్రిల్ 1 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. డీల్స్.. * మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు). * సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. * ఫెయిర్అసెట్స్ టెక్నాలజీస్‌లో 9.84 శాతం వాటాను తమ అనుబంధ సంస్థ జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసిందని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. * జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది. -
గతవారం బిజినెస్
మౌలిక పరిశ్రమల మెరుపు ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4% వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదు చేసుకోకపోగా -0.7% క్షీణతను నమోదు చేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38%. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది. సౌదీలో విప్రో ఉమెన్ బిజినెస్ పార్క్ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ సౌదీ అరేబియాలోని రియాద్‌లో అందరూ మహిళలే ఉద్యోగులుగా ఉండే ఉమెన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ పార్క్(డబ్ల్యూబీపీ)ను సోమవారం ప్రారంభించింది. ప్రిన్సెస్ నౌరాహ్ యూనివర్శిటీ(పీఎన్‌యూ), సౌదీ అరామ్కో భాగస్వామ్యంతో ఈ డబ్ల్యూబీపీని ఏర్పాటు చేశామని విప్రో అనుబంధ సంస్థ విప్రో అరేబియా పేర్కొంది. ఈ ఉమెన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ పార్క్ 2025 కల్లా 21,000 ఉద్యోగాలు కల్పించనున్నదని అంచనా. టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు వాహన విక్రయాలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్)లో జోరుగా సాగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా సహా పలు కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ అమ్మకాలు మాత్రం పతనమయ్యాయి. టూవీలర్ కంపెనీలు హీరో మోటొకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీల విక్రయాలు కూడా బాగా పెరగ్గా బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. ఆసియాకు భారత్ వృద్ధి దన్ను భారత్ పటిష్టంగా వృద్ధి చెందుతుండటంతో అది ఆసియా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకోవ్ అభిప్రాయపడ్డారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ 2016లో ఆసియా వృద్ధి రేటు 5.7 శాతంగా ఉంటుందని తెలియజేశారు. ఏడీబీ 49వ వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. టయోటా నుంచి కొత్త ఇన్నోవా క్రిస్టా ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను దశాబ్ద కాలం తర్వాత అప్డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గింది. తాజా తగ్గింపు ప్రకారం.. మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.40 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.35 శాతంగా ఉంది. కారు రుణ రేటు కూడా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఎన్ఆర్ఐ కార్ లోన్స్, ఎస్బీఐ కాంబో రుణ పథకం, ఎస్బీఐ లాయల్టీ కార్ లోన్ స్కీమ్‌లకు తాజా నిర్ణయం వర్తిస్తుంది. డాయిష్ ఫండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన సెబీ సెబీ.. డాయిష్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. డాయిష్ ఎంఎఫ్ తన పథకాలన్నింటినీ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా మ్యూచువల్ ఫండ్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో సెబీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. డాయిష్ ఎంఎఫ్ దేశీ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్‌ను ప్రమెరికా ఎంఎఫ్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ రద్దు నేపథ్యంలో డాయిష్ ఎంఎఫ్ ఇక నుంచి ఎంఎఫ్‌గా, ట్రస్టీగా, ఏఎంసీగా ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకూడదని సెబీ ఆదేశించింది. అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం పన్నుపై వీడిన అస్పష్టత అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ‘క్యాపిటల్ గెయిన్’గా పరిగణించి దానిపై పన్ను విధించడం జరుగుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రం బోర్డ్ (సీబీడీటీ) వివరణ ఇచ్చింది. హోల్డింగ్ కాలంతో సంబంధం లేకుండా పన్ను అమలవుతుందని వివరించింది. అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయం క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుందా లేదా బిజినెస్ ఆదాయంగా పరిగణించాలా అన్న అంశంపై ఇప్పటివరకూ నెలకొన్న సందిగ్ధత తాజా సీబీడీటీ నిర్ణయంతో తొలగిపోయింది. దివాలా బిల్లుకు లోక్‌సభ ఓకే వందేళ్లకు పైగా మార్పులకు నోచుకోకుండా అమల్లో ఉన్న దివాలా చట్టాలు కనుమరుగు కానున్నాయి. వీటన్నిటి స్థానంలో అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న ‘దివాలా కోడ్-2016’కు గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే... ఇది చట్టరూపం దాలుస్తుంది. ఎన్డీబీతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఓయూ బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)తో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బాండ్ల జారీ, ట్రెజరీ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఎన్డీబీతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్. మళ్లీ మింత్రా డెస్క్‌టాప్ వెబ్సైట్ ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా.. ఏడాది క్రితం మూసేసిన తన డెస్క్‌టాప్ వెర్షన్‌ను జూన్ 1 నుంచీ తిరిగి ప్రారంభించనుంది. ఏడాదిగా కేవలం మొబైల్ యాప్‌పై వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విభాగమైన మింత్రా తిరిగి తన డెస్క్‌టాప్ వెర్షన్‌కు మొగ్గుచూపింది. 2 బిలియన్ డాలర్లకు ఐటీ ఇన్ఫ్రా మార్కెట్! దేశీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 1.93 బిలియన్ డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది. ఇది 2020 నాటికి 2.13 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. కాగా గతేడాది ఈ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వర్లు, స్టోరేజ్, ఎంటర్‌ప్రై జ్ నెట్వర్కింగ్ ఉపకరణాలన్నీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. డీల్స్.. * నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1,000 మెగావాట్ల పవర్ ప్లాం ట్ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.6,500 కోట్లు. * వర్చువల్ రియాలిటీ స్టార్టప్ వొలోబ్ టెక్నాలజీస్‌ను గిర్నార్ సాఫ్ట్ కొనుగోలు చేసింది. కార్దేఖో.కామ్, గాడి.కామ్, జిగ్వీల్స్.కామ్ వంటి వాహన పోర్టళ్లను నిర్వహిస్తున్న గిర్నార్ కంపెనీ వొలోబ్ టెక్నాలజీస్‌ను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది తెలియలేదు. * అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో అదనంగా 23% వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు విదేశీ భాగస్వామ్య సంస్థ అవీవా వెల్లడించింది. దీంతో వాటాలు గరిష్ట పరిమితి 49 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది. -
గతవారం బిజినెస్
ఐపీఓకు పరాగ్ మిల్క్ ఫుడ్స్ డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నది. మే 6న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది. రికార్డ్ స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరుగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి రికార్డ్ స్థాయిలో 5,100 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్‌డీఐలు ఇంతవరకూ ఎన్నడూ రాలేదని డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ వెల్లడించారు. రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్ ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్.. బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72 శాతానికి దిగింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. టెలిఫోన్ వినియోగదారులు-105 కోట్లు దేశంలోని టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరిలో 105.18 కోట్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. ఒకవైపు వైర్‌లైన్ సబ్స్క్రైబర్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. వైర్లెస్ వినియోగదారుల పెరుగుదలే మొత్తం యూజర్ల పెరుగుదలకు కారణమని వివరించింది. మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 101.79 కోట్ల నుంచి 102.66 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.53 కోట్ల నుంచి 2.52 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మెటల్ ఎక్స్ ఆఫర్‌కు హిందాల్కో ఓకే! ఆస్ట్రేలియాకు చెందిన గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిసై ్టన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు. యాపిల్ షాకింగ్ ఫలితాలు యాపిల్ ప్రకటించిన 2016, జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు కంపెనీ ఇన్వెస్టర్లకు షాకిచ్చాయి. గడిచిన పదమూడేళ్లలో తొలిసారిగా ఆదాయం క్షీణించింది. 2015 ఇదే త్రైమాసికంలో ఆదాయం 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 13 శాతం మేర దిగజారి 50.6 డాలర్లకు పడిపోయింది. నికర లాభం కూడా 22 శాతం క్షీణతతో 13.6 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం సక్సెస్ కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్, ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి. సహారా ఆస్తులు తెలపాలి: సుప్రీం సహారా మొత్తం ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్లో తెలియజేయాలని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలరా? లేదా అన్న అంశం నిర్ధారించడానికి ఆస్తుల వివరాలు వెల్లడికావడం అవసరమని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాలు పాటించేంతవరకూ పెరోల్‌కు వీలు ఉండబోదని స్పష్టం చేసింది. అధిక వేతన సీఈఓల్లో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పది మంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి (2.22 కోట్ల డాలర్లు) 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ (2.45 కోట్ల డాలర్లు) ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వంద మంది జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్‌ల తో పాటు సత్య నాదెళ్ల (26వ స్థానం-1.83 కోట్ల డాలర్లు) కూడా ఉన్నారు. ఎక్సైజ్ సుంకం తొలగింపులేదు: జైట్లీ వెండి యేతర ఆభరణాలపై ఒక శాతం ఎకై ్సజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు. 13 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం! యాక్సిస్ బ్యాంక్‌లో ప్రస్తుతమున్న విదేశీ వాటా పరిమితిని 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సహా మొత్తం 13,030 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) మొత్తం 14 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించి ఐదింటికి ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. భారత్‌కు వచ్చే ఉద్దేశం లేదు: మాల్యా బ్యాంకుల చేత ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ముద్ర వేయించుకుని బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా భారత్‌కు వచ్చే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. తనకు సంబంధించి పరిస్థితులు తీవ్రంగా ఉన్న భారత్‌కు తిరిగి వెళ్లే తక్షణ ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ‘బలవంతపు ప్రవాస’ స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. డీల్స్.. * రేల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్సైట్ రైల్యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. -
గతవారం బిజినెస్
యూరప్ యూనిట్‌ను విక్రయిస్తున్న టాటా స్టీల్ యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూని ట్లలో ఒకదానిని ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు నామమాత్ర మొత్తానికి విక్రయించనున్నది. ఎంత మొత్తానికి అమ్ముతున్నదీ వెల్లడికాలేదు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా 40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది. కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓకు సెబీ ఓకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ కనీసం రూ.180 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో రూ.180 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత వాటాదారుల 50 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. బిర్లా లైఫ్‌లో అదనపు వాటా విక్రయం పూర్తి బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి, కెనడాకు చెందిన సన్‌లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో బీఎస్ఈకి నివేదించింది. ఫండ్స్ నుంచి రూ.73,000 కోట్ల ఉపసంహరణ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీమ్స్ నుంచి గత నెలలో రూ.73,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ అధికంగా జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు లిక్విడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటాయని, ఇది ప్రతి ఏటా జరిగేదేనని నిపుణులు వివరించారు. 49 శాతం తగ్గిన క్విప్ నిధుల సమీకరణ భారత కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) విధానంలో గత ఆర్థిక సంవత్సరానికి రూ.14,358 కోట్ల నిధులు సమీకరించాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన నిధులు(రూ.28,429 కోట్లు)తో పోల్చితే దాదాపు 50 శాతం తగ్గుదల నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 51 కంపెనీలు క్విప్ ద్వారా నిధులు సమీకరించగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 20 కంపెనీలు మాత్రమే క్విప్‌కు వచ్చాయి. ఎయిర్టెల్ ఎం-కామర్స్ పేమెంట్ బ్యాంక్! దేశీ టెలికం దిగ్గజ సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ మొబైల్ కామర్స్ అనుబంధ కంపెనీ ‘ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ (ఏఎంఎస్ఎల్)కు ఆర్బీఐ నుంచి పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ లభించింది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ సంస్థ బీఎస్ఈకి నివేదించింది. ద్రవ్యోల్బణం తగ్గింది.. పారిశ్రామికోత్పత్తి పెరిగింది.. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధి సాధించడం... భారత ఆర్థిక వ్యవస్థకు మంగళకరమైనవని నిపుణులంటున్నారు. ఫిబ్రవరిలో 5.26 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొంది. 53 ఏళ్ల కనిష్టానికి డిపాజిట్ల వృద్ధి రేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో (2015ఏప్రిల్-16 మార్చి) కేవలం 9.9 శాతంగా నమోదయినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. డిపాజిట్లు ఇంత తక్కువ శాతం వృద్ధి చెందడం 53 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని తెలిపింది. 2014 నుంచీ డిపాజిట్లు మందగమన ధోరణిలో ఉన్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాంకింగ్ వడ్డీరేట్లతో పోల్చితే... వాస్తవిక వడ్డీరేట్లు (బాండ్ల రేట్లకు సంబంధించి) అధికంగా ఉండడం డిపాజిట్లు తగ్గడానికి కారణమని వివరించింది. 18 నుంచి డా.రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. డీమెర్జర్ దిశగా ఎమ్మార్ ఎంజీఎఫ్ ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ నుంచి దుబాయ్ సంస్థ వైదొలగనున్నట్లు సమాచారం. భవిష్యత్ వృద్ధి, విస్తరణ నిమిత్తం డీమెర్జర్ స్కీమ్ ద్వారా వ్యాపారాన్ని పునర్వవ్యస్థీకరిస్తున్నామని ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ బీఎస్ఈకి నివేదించింది. మరోవైపు ఈ జేవీ డీమెర్జర్ కోసం చర్యలు తీసుకోనున్నామని ఎమ్మార్ ప్రోపర్టీస్ కూడా దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్‌కు నివేదించింది. అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్‌పై మరో వివాదం అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో న్యాయ వివాదం చోటు చేసుకుంది. అదానీ సంస్థ క్వీన్స్‌లాండ్‌లోని గలిలీ బేసిన్లో 1,200 కోట్ల డాలర్ల మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లీజ్‌లను సవాల్ చేస్తూ, ఈ గలిలీ బేసిన్ పాత యాజమాన్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ వాన్గన్ అండ్ జగలిన్గావూ(డబ్ల్యూ అండ్ జే) సంస్థ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో తాజాగా కేసు దాఖలు చేసింది. మాల్యా పాస్‌పోర్ట్ సస్పెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సిఫారసులకు అనుగుణంగా భారత విదేశాంగశాఖ ‘ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు’ విజయ్‌మాల్యాపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆయన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను నాలుగువారాలు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న మాల్యా, భారత్‌కు తిరిగి వచ్చే అంశం, అలాగే పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదన్న అంశంపై వారంలోపు స్పందించకపోతే... పాస్‌పోర్ట్ రద్దు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. అదరగొట్టిన ఇన్ఫోసిస్ దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో లాభం రూ. 3,097 కోట్లతో పోలిస్తే 16.2 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 13,411 కోట్ల నుంచి రూ.16,550 కోట్లకు పెరిగింది. 23.4 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు, 285 శాతం తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించి ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు పెరిగాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరికల్లా తపాలా బ్యాంకు తపాలా శాఖ త్వరలో బ్యాంకింగ్ రం గంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే జనవరికి గానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు. డీల్స్.. * సాఫ్ట్వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్‌స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు. * కెన్‌బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ చండీగఢ్‌కు చెందిన హిమ్ టెక్నోఫోర్జ్లో మైనార్టీ వాటాను రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది. ఎమర్జింగ్ ఇండియా గ్రోత్ ఫండ్ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేశామని కెన్‌బ్యాంక్ వీసీ ఫండ్ పేర్కొంది. * ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేందుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. -
గతవారం బిజినెస్
16 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్! ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్‌హెచ్‌పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సమాచారం. రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో చేపట్టిన తొలి ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ).. కీలకమైన పాలసీ వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించి 6.5 శాతానికి చేర్చింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని యథాతథంగా 4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్) వ్యవస్థను ఆర్బీఐ ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజా రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా రుణ గ్రహీతలకు బదలాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైజర్-అలెర్గాన్ డీల్ రద్దు! ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్- ఐర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న అలెర్గాన్ కుదుర్చుకున్న ఒప్పందం రద్దయింది. 160 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌ను అంతర్జాతీయ ఫార్మా రంగంలో అతిపెద్ద డీల్‌గా పేర్కొనటం తెలిసిందే. ప్రధానంగా అమెరికాలోని పన్నుల్ని తప్పించుకోవటానికి ఫైజర్ తన కేంద్రాన్ని ఐర్లాండ్‌కు తరలించడానికి ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా పన్నుల రూపంలో ఏటా బిలియన్ డాలర్లకుపైగా మిగులుతాయని ఫైజర్ భావించింది. అయితే ఇలాంటి డీల్స్‌ను అడ్డుకునేలా ఒబామా యంత్రాంగం ఇన్వర్షన్స్ పేరిట కొత్త పన్ను నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. ఐపీఓకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్! హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఈ ఏడాది చివరికల్లా ఐపీఓకు రానున్నది. అంతేకాకుండా ఈ కంపెనీలో ప్రభుత్వానికున్న వాటాలో 10 శాతాన్ని విక్రయించనున్నది. ఈ సంస్థ ఇటీవలనే రూ.4,300 కోట్ల షేర్లను(ప్రభుత్వానికి చెందిన 25 శాతం వాటాను) బై బ్యాక్ చేసింది. షేర్ల బై బ్యాక్ వల్ల తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా తయారైందని, ప్రస్తుతం ఐపీఓ ముసాయిదా పత్రాలను రూపొందిస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ ఐపీఓ ముసాయిదా పత్రాలను సెప్టెంబర్‌కల్లా సెబీకి సమర్పిస్తామని, అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో ఐపీఓకు వస్తామని వివరించారు. టాటా ‘టియాగో’ వచ్చేసింది దేశీ వాహన దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త హ్యాచ్‌బాక్ ‘టియాగో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.20 లక్షలు- రూ.5.54 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ న్యూఢిల్లీ) ఉంది. టియాగో ప్రధానంగా ఎక్స్‌బీ, ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టీ, ఎక్స్జెడ్ అనే ఐదు వేరియంట్లలో లభ్యంకానున్నది. ఇది 1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోల్, 1.05 లీటర్ రెవొటార్క్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి ఉండనున్నది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.84 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ లీటరుకు 27.28 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ముడి చమురు దిగుమతుల్లో స్వేచ్ఛ భూగర్భ జల వనరుల్ని మదించటం నుంచి రిజర్వాయర్లు, వరద సమస్య దాకా అన్నిటికీ పరిష్కారంగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు (ఎన్హెచ్పీ) కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.3,680 కోట్లు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్... దీంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. వీటిలో రైల్వేల్లో విదేశీ (స్వీడన్) సాంకేతిక సహకారం, ముడి చమురును కంపెనీలు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవటం, టెలికం టవర్ సంస్థ వినోమ్లో వాటా విక్రయం వంటి కీలకాంశాలున్నాయి. భెల్ నష్టాలు రూ.877 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో భెల్‌కు రూ.877 కోట్ల నష్టాలు వచ్చాయి. కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరపు తాత్కాలిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.30,947 కోట్లుగా ఉన్న టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,702 కోట్లకు తగ్గిందని భెల్ పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,419 కోట్ల నికర లాభం (ఆడిటెడ్ ఫలితాలు) వచ్చిందని, 2015-16 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.877 కోట్లు(తాత్కాలిక అంచనాలు) నష్టాలు వచ్చాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.43,727 కోట్ల కొత్త ఆర్డర్లు వస్తే.. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు రూ.30,814 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణల్లో వసూళ్లు పెరిగాయ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను అధిగమించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. 2015-16 సంవత్సరంలో రూ.36,251 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా... దానికన్నా అధికంగా రూ.36,663 కోట్లను వసూలు చేసినట్లు ఈ రెండు రాష్ట్రాల ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇండ్ల సురేశ్ బాబు తెలిపారు. ఈ మొత్తంలో కార్పొరేట్ ట్యాక్స్ వాటా రూ. 21,382 కోట్లు కాగా, ఆదాయ పన్ను మొదలైనవి రూ.15,281 కోట్లు. ఆస్తుల లెక్క.. మాల్యాకు సుప్రీం ఆదేశం తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఈ నెల 21లోపు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. విజయ్ మాల్యాను ఆదేశించింది. దేశ, విదేశాల్లోని ఆస్తుల వివరాల న్నింటినీ తెలియజేయాలని స్పష్టం చేసింది. తన ముందు ఎప్పుడు హాజరవుతారో తెలియజేయాలని కూడా సుప్రీం పేర్కొ ంది. కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఒరాకిల్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు ఐటీ దిగ్గజం ఒరాకిల్ దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్, విజయవాడలతో పాటు మరో ఆరు నగరాల్లో ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలిటరేర్ పేరుతో ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నామని సంస్థ తెలిపింది. వృద్ధిలోకి వస్తున్న ఎంటర్ప్రెన్యూర్లకు తగిన మార్గదర్శకత్వం అందించడం, అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు ఉత్తమ టెక్నాలజీని అందించడం లక్ష్యాలుగా ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్స్క్రిప్షన్ చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు భారీ స్పందన లభించింది. రూ. 2,200 కోట్ల సేకరణకు ఈక్విటీస్ జారీచేసిన ఈ ఐపీఓ చివరి రోజైన గురువారం నాటికి 17.21 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 109-10 ప్రై స్బ్యాండ్తో 13.91 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, 239 కోట్ల షేర్లకు రూ. 37,000 కోట్ల విలువైన బిడ్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.31 రెట్లు ఓవర్‌సబ్ స్క్రయిబ్కాగా, సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 14.92 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. నియామకాలు * ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ నియమితులయ్యారు. * ఫోర్బ్స్ మార్షల్ సంస్థ కో-చైర్మన్ నౌషద్ ఫోర్బ్స్.. సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. డీల్స్.. * దేశీ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకోనుంది. ఈ డీల్ విలువ రూ.7,071 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఎంఫసిస్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రై జ్(హెచ్‌పీఈ) నుంచి 60.5 శాతం పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం బ్లాక్‌స్టోన్ ప్రకటించింది. * చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ, టెక్నాలజీ దిగ్గజం షావోమి.. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్లో 25 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. * ఒక భారతీయ కంపెనీలో షావోమికి ఇదే తొలి ఇన్వెస్ట్మెంట్ కావడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగార్జునా గ్రూప్‌నకు చెందిన నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ (ఎన్‌ఓసీఎల్)లో వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. * ఎయిర్‌సెల్ కంపెనీకి 8 టెలికం సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రమ్‌ను ఎయిర్టెల్ కంపెనీ రూ. 3,438 కోట్లకు కొనుగోలు చేయనున్నది. -
గతవారం బిజినెస్
రూ.17 వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ విశాఖపట్టణంలోని రిఫైనరీ విస్తరణ కోసం 2020 కల్లా రూ.17,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. విశాఖ రిఫైనరీ వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని 8.3 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్లో కొత్తగాఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. రిఫైనరీల విస్తరణ, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల కోసం 2020 కల్లా మొత్తం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరించింది. మాల్యాకు ఈడీ సమన్లు చడీ చప్పుడు లేకుండా దేశం విడిచిపోయిన మాల్యాపై.. ఐడీబీఐ బ్యాంకుకు రూ. 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసి సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఐసీఐసీఐ’ మహిళా దినోత్సవం ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళలు ఏడాదిపాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే వె సులుబాటు కల్పిస్తూ ‘ఐవర్క్-హోమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే మూడేళ్లలోపు పిల్లలను కలిగిన మహిళా ఉద్యోగులు పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారు వారి పిల్లలను కూడా తమతోపాటు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. భారత్‌లోకి శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్స్ దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఇవి ఓపెన్ మార్కెట్లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశీయంగా హయబుసా అసెంబ్లింగ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియం బైక్ ‘హయబుసా’ అసెంబ్లింగ్‌ను హరియాణాలోని గుర్గావ్ ప్లాంటులో ప్రారంభించింది. దీంతో ఇప్పుడు బైక్ రూ.13.57 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దిగుమతుల కారణంగా బైక్ ధర ఇదివరకు రూ.15.95 లక్షలుగా ఉండేది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. డీమ్యాట్ ఖాతాలు-2.5 కోట్లు ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ డిపాజిటరీల్లోని మొత్తం ఇన్వెస్టర్ ఖాతాలు ఫిబ్రవరి నెల చివరి నాటికి 2.5 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి చివరికి మొత్తం ఇన్వెస్టర్ ఖాతాల సంఖ్య 2.33 కోట్లుగా ఉంది. గతనెల చివరి నాటికి ఎన్ఎస్డీఎల్ వద్ద 1.45 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 1.38 కోట్లు), సీడీఎస్ఎల్ వద్ద 1.06 కోట్ల ఖాతాలు (గతేడాది ఖాతాలు 95.2 లక్షలు) ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో ఐపీసీఎల్కు ఊరట ఐపీసీఎల్(ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొ) కేసులో ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్(ఆర్‌పీఐఎల్)కు ఊరట లభించింది. 9 ఏళ్ల ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఆర్‌పీఐఎల్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిందనడానికి తగిన ఆధారాల్లేవంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేసును కొట్టివేసింది. వడ్డీ రేట్లు తగ్గించిన ఈసీబీ యూరోజోన్ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వడ్డీ రేట్లనూ తగ్గించింది. తాను బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును (రిఫీ రేటు- రీఫైనాన్షింగ్ రేటు) ప్రస్తుత 0.05 శాతం నుంచి జీరో స్థాయికి తగ్గించింది. ఇక బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు (డిపాజిట్)ను కూడా మైనస్ - 0.3 శాతం నుంచి మైనస్ -0.4 శాతానికి తగ్గించింది. చమురు, గ్యాస్ రంగంలో సంస్కరణలు కఠిన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతను ప్రోత్సహించేలా కొన్ని పరిమితులతో కొత్త ధరల విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే మైనింగ్ సంస్థలు మరిన్ని అసెట్స్‌ను సులువుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత చట్టాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో నిర్వహించే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి సంబంధించి వివాదాస్పదమైన ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ)స్థానంలో ఆదాయ పంపక ఒప్పందాన్ని కూడా ఓకే చేసింది. మన దగ్గరే కాల్ డ్రాప్స్ ఎక్కువ కాల్ డ్రాప్స్ భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో కాల్ డ్రాప్స్ సగటు రేటు 4.73 శాతంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్టాండర్డ్ 3 శాతం కన్నా అధికం. రెడ్మ్యాంగో అనలిటిక్స్ ప్రకారం.. కవరేజ్ లోపాల వ ల్ల 4 శాతం కాల్ డ్రాప్స్ ఏర్పడుతుంటే.. నాణ్యత లేమి వల్ల 59.1 శాతం కాల్ డ్రాప్స్, నెట్వర్క్ సమస్యల వల్ల 36.9 శాతం కాల్డ్రాప్స్ ఉత్పన్నమౌతున్నాయి. కాల్ డ్రాప్‌కు ట్రాయ్ బెంచ్‌మార్క్ 2 శాతంగా ఉంది. డివిడెండ్ల జోరు తాజా బడ్జెట్లోని ప్రతిపాదిత రూ.10 లక్షలకు మించిన కంపెనీ డివిడెండ్లపై 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీటీటీ) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్నందున.. ఆ పన్ను పోటును తప్పించుకోవడానికి కంపెనీలు ఇప్పటి నుంచే డివిడెండ్ల మీద డివిడెండ్లు ప్రకటిస్తున్నాయి. ఒక్క గురువారం రోజే 47 కంపెనీలు డివిడెండ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటొకార్ప్, శ్రీ సిమెంట్, టొరంట్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లకు నష్టం ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) పెట్టుబడులకు స్టాక్ మార్కెట్లో10 శాతం(రూ.565 కోట్లు) వరకూ నష్టాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో ఈపీఎఫ్ఓ రూ.5,920 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ విలువ గత నెల 29 నాటికి రూ 9.54 శాతం క్షీణించి రూ.5,355 కోట్లకు తగ్గింది. రెండో నెలా కార్ల విక్రయాలు దిగువకే కార్ల అమ్మకాలు 14 నెలల వరుస పెరుగుదల తర్వాత జనవరిలో తొలిసారి తగ్గితే.. అదే పరిస్థితి తర్వాతి నెలలోనూ కొనసాగింది. దేశీ కార్ల విక్రయాలు ఫిబ్రవరిలో 4.21 శాతంమేర క్షీణించాయి. బడ్జెట్ తర్వాత ధరల తగ్గుతాయనే అంచనాలతో కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, జాట్ రిజర్వేషన్ల గొడవ, డీలర్లు కూడా బడ్జెట్లో ఎకై ్సజ్ సుంకం తగ్గింపు ఉంటుందని భావించి స్టాక్ పెంపునకు దూరంగా ఉండటం వంటి తదితర అంశాలు కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయని సియామ్ పేర్కొంది. మూడవ నెలా పరిశ్రమల్లో నిరాశే! పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2016 జనవరిలో 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే అసలు వృద్ధి లేకపోగా 1.5 శాతం (మైనస్) క్షీణించింది. ఇలాంటి ధోరణి ఇది వరుసగా మూడవ నెల. ఈ సూచీ నవంబర్‌లో - 3.4 శాతం, డిసెంబర్లో - 1.2 శాతం క్షీణించింది. తయారీ రంగం పేలవ పనితీరు, డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ పరికరాల ఉత్పత్తుల క్యాపిటల్ గూడ్స్ విభాగం మందగమన ధోరణి తాజా నిరుత్సాహ ఫలితానికి కారణమని కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. 2015 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం. ఎకోస్పోర్ట్ ధర తగ్గించిన ఫోర్డ్ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా ‘ఎకోస్పోర్ట్’ ధరను రూ.1.12 లక్షల వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.53,000- రూ.87,000 శ్రేణిలోనూ, డీజిల్ వేరియంట్ ధర రూ.1.12 లక్షలమేర తగ్గింది. దీంతో ఇప్పటి నుంచి పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.68 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.7.28 లక్షలుగా ఉండనున్నది. ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. 25 డాలర్లకు తగ్గనున్న చమురు! అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. -
గతవారం బిజినెస్
కొత్తగా ఐదు నిఫ్టీ స్టాక్ సూచీలు ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా కొత్తగా ఐదు స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) గ్రూప్ సంస్థ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సూచీలతో కలుపుకొని స్టాక్ సూచీల సంఖ్య 11కు చేరుతుందని పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250, నిఫ్టీ ఫుల్ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 50, నిఫ్టీ పుల్ స్మాల్ క్యాప్ 100-ఈ ఐదు కొత్త స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 సూచీలున్నాయి. కార్డులతో చెల్లింపులకు సర్‌చార్జీలు రద్దు! క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. మళ్లీ మారుతీ టాప్ దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. పీఎన్బీ రుణ ఎగవేతదార్ల జాబితా విడుదల ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)... భారీ మొండిబకాయిల చిట్టాను ప్రకటించింది. తమ బ్యాంకులో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) కంపెనీలు 904 ఉన్నాయని వెల్లడించింది. ఈ మొత్తం సంస్థల రుణ బకాయిల విలువ గతేడాది డిసెంబర్ చివరినాటికి 10,870 కోట్లుగా పీఎన్బీ పేర్కొంది. జాబితాలో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ, జూమ్ డెవలపర్స్, నాఫెడ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. బ్యాంక్ షేర్లు తగ్గించుకుంటున్న ఫండ్స్ మొండి బకాయిలు భారీగా పెరిగిపోతుండటడంతో బ్యాంక్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకుంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల నుంచి గత నెలలో రూ.6,662 కోట్లు ఉపసంహరించుకోవడంతో ఆ షేర్లలో పెట్టుబడులు రూ.78,600 కోట్లకు పడిపోయాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ తెలిపింది. ఐటీ హార్డ్‌వేర్‌తో 4 లక్షల ఉద్యోగాలు! దేశీ ఐటీ హార్డ్‌వేర్ రంగం ఉపాధి కొలువుగా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో నోట్‌బుక్, డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు సహా తదితర వస్తువుల తయారీకి చేయూతనందించేలా పన్ను సుంకాలను తగ్గిస్తే.. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య ‘మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎంఏఐటీ) తన నివేదికలో పేర్కొంది. ఎన్టీపీసీ ఆఫర్‌తో 5 వేల కోట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కి రూ. 5,030 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూలో మూడింట రెండొంతుల షేర్లను బీమా సంస్థలు దక్కించుకున్నాయి. సింహభాగం షేర్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ), బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సంపన్న ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. కుబేర భారతీయుడు.. ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 30 శాతం వృద్ధితో 2,600 కోట్ల డాలర్లకు పెరిగిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016 వెల్లడించింది. ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 8,000 కోట్ల డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 111కు పెరిగిందని, అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదేనని ఈ జాబితా తెలిపింది. వృద్ధికి రైల్వే కూత కేంద్ర ప్రభుత్వం 2016-17కు సంబంధించి గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. మూడు కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్‌పూర్-ముంబై), ఈస్ట్‌కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. 30 నెలల కనిష్టానికి రూపాయి డాలర్‌తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో గురువారం రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు. ఎల్ఐసీ.. సెన్సెక్స్ షేర్ల కొనుగోలు జోరు ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ క్యూ3లో సెన్సెక్స్ కంపెనీ షేర్లను జోరుగా కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక కాలానికి రూ.10,415 కోట్ల విలువైన 18 సెన్సెక్స్ కంపెనీల షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. అలాగే రూ.7,300 కోట్ల విలువైన సెన్సెక్స్ కంపెనీల షేర్లను విక్రయించింది. దీంతో నికర కొనుగోళ్లు రూ.3,115 కోట్లుగా ఉన్నాయి. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే ఎల్ఐసీ అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. ఈ కంపెనీలో 4.26 శాతం వాటాకు సమానమైన షేర్లను కొనుగోలు చేసింది. జికా కాదు టియాగో టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హ్యాచ్‌బాక్ జికా పేరును ‘టియాగో’గా మార్చింది. ఇటీవల కాలంలో జికా వైరస్ ప్రబలడంతో ఈ హ్యాచ్‌బాక్‌కు అంతకు ముందు నిర్ణయించిన జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెంటాస్టికో నేమ్ హంట్ పేరుతో కొత్త పేర్లను కంపెనీ నెటిజన్ల నుంచి ఆహ్వానించింది. అందులో టియాగో, సివెట్, అడోర్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, ఓటింగ్ ద్వారా టియాగో పేరును ఖరారు చేశామని పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా టియాగో(జికా) హ్యాచ్‌బాక్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకులకు మెజార్టీ వాటా ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. డీల్స్.. * మహేంద్ర నహతా ప్రమోట్ చేసిన మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో దాదాపు 5 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఓజస్వి ట్రేడింగ్ కంపెనీ మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో 5.25 కోట్ల షేర్లను గత వారంలో మూడు వేర్వేరు బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసింది. దీంతో మీడియా మెట్రిక్స్ వరల్డ్‌వైడ్‌లో ఓజస్వి ట్రేడింగ్ వాటా 4.63 శాతానికి చేరింది. * రిలయన్స్ క్యాపిటల్.. కమర్షియల్ ఫైనాన్స్ విభాగాన్ని తన అనుబంధ కంపెనీకి బదలాయిస్తోంది. ఈ బదలాయింపు తర్వాత కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ(సీఐసీ)గా తమను నమోదు చేయాలని ఆర్బీఐకు దరఖాస్తు చేస్తామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. ఫలితంగా, భవిష్యత్తులో ఆర్బీఐ నిబంధనలను సరళీకరిస్తే బ్యాంక్ లెసైన్స్ పొందే వీలు కలుగుతుందని రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ శామ్ ఘోష్ చెప్పారు. -
గతవారం బిజినెస్
నియామకాలు * మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యూ కే సిన్హా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెబీ చైర్మన్‌గా సిన్హా వచ్చే ఏడాది మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే దాకా పదవిలో కొనసాగుతారు. * దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీగా ఎం.కె.సురానా నియమితులయ్యారు. ఫండ్స్‌కి బాండ్ల నిబంధనలు కఠినం కార్పొరేట్ బాండ్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినతరం చేసింది. ఏ ఒక్క కంపెనీలోనూ 10 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయకూడదని నిర్దేశించింది. అలాగే ఒక రంగంలో పెట్టదగిన పెట్టుబడుల పరిమితిని 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. గ్రూప్ స్థాయిల్లో డెట్ సెక్యూరిటీల్లో 20-25 శాతం మేర ఇన్వెస్ట్ చేయొచ్చని పేర్కొంది. క్షీణతలోనే టోకు ధరలు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా.. క్షీణతలో (మైనస్) కొనసాగింది. - 0.9 శాతం క్షీణత నమోదయ్యింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఈ ప్రభావం ప్రధానంగా కమోడిటీ ఆధారిత తయారీ ఉత్పత్తుల మీదా ఉండడం, దేశంలో మందగమన ధోరణి అన్నీ కలసి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా క్షీణతలో ఉంచుతున్నాయి. 14వ నెలా 14 శాతం క్షీణత ఎగుమతుల రంగం నిరాశలోనే కొనసాగుతోంది. 2015 జనవరితో పోల్చిచూస్తే... 2016 జనవరిలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో ఇది 21 బిలియన్ డాలర్లు. ఎగుమతుల క్షీణ ధోరణి ఇది వరుసగా 14వ నెల. ఇక దిగుమతులు కూడా క్షీణతలోనే పయనిస్తున్నాయి. జనవరిలో 11 శాతం క్షీణించి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి- దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. 600 కోట్లకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ యూజర్లు! టెలికం పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తుండటంతో రానున్న కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగ నున్నది. అంతర్జాతీయంగా 2020 నాటికి వీరి సంఖ్య 600 కోట్లకు పైగా చేరుతుందని చైనా వెబ్ సర్వీసెస్ సంస్థ బైదు తన నివేదికలో పేర్కొంది. వొడాఫోన్‌కు మళ్లీ పన్ను నోటీసులు టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ మళ్లీ షాకిచ్చింది. హచిసన్ వాంపోవా భారత కార్యకలాపాల కొనుగోలు డీల్‌కు సంబంధించి రూ. 14,200 కోట్లు కట్టాలంటూ నోటీసులు పంపించింది. చెల్లించని పక్షంలో కంపెనీ ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. సరుకు రవాణ వృద్ధి 3 శాతం దేశీ ప్రముఖ 12 నౌకాశ్రయాల్లో సరుకు రవాణా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి పది మాసాల్లో 3.36 శాతం వృద్ధితో 499 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ నౌకాశ్ర యాల సరకు రవాణా గతేడాది ఇదే సమయంలో 483 మిలియన్ టన్నులుగా ఉంది. వివిధ రంగాల్లో డిమాండ్ పెరుగుదలే సరకు రవాణా వృద్ధికి కారణంగా కనిపిస్తోంది. రుణ ఎగవేతదార్లపై సుప్రీం కొరడా బడా రుణ ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. రూ. 500 కోట్లకు మించి రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన కంపెనీల జాబితాను తమముందు ఉంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను ఆదేశించింది. దీంతోపాటు కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ(సీడీఆర్) స్కీమ్‌లో రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను సైతం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా వీటిని సీల్డు కవర్లో సమర్పించాలని పేర్కొంది. చిన్న పొదుపుపై వడ్డీ రేటు కోత పోస్టాఫీస్ స్వల్ప కాల పథకాలపై పావుశాతం వడ్డీ రేటు తగ్గించింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ఇదే కాలపరిమితితో ఉన్న ప్రభుత్వ బాండ్ల రేటు కన్నా అదనంగా పావుశాతం (0.25 శాతం) వడ్డీ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచీ తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫెరారి నుంచి ‘488 జీటీబీ’ మోడల్ ఇటలీకి చెందిన దిగ్గజ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘ఫెరారి’ తాజాగా ‘488 జీటీబీ’ మోడల్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత వేగంగా ప్రయాణించే కార్లలో ఇది కూడా ఒకటి. దీని ధర రూ.3.88 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలో, 0-200 కిలోమీటర్ల వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు. సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు సిమెంట్ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4-6 శాతంమేర పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తన నివేదికలో తెలిపింది. కేంద్రం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై దృష్టి కేంద్రీకరించడమే డిమాండ్ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఇండ్-రా నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5.6 శాతంమేర పెరిగింది. వరంగల్‌లో సైయంట్ సెంటర్ ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైయంట్ వరంగల్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. రానున్న 12-18 నెలల్లో ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు! తయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా తయారు చేయాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా వీక్ దిగ్విజయంగా ముగిసింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వెల్లువెత్తాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాభ్ కాంత్ గురువారం చెప్పారు. డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్వ్యవస్థీకరణపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయడం మొదలుపెట్టింది. యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాల్లో కొంతైనా రాబట్టుకునేందుకు.. ఆ సంస్థ ఆస్తులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీ) వేలం వేసేందుకు దాదాపు 4 బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. 3-4 బ్యాంకులు ఇందుకోసం ఏఆర్‌సీలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 700 మిలియన్ డాలర్లు! రాబోయే 12 నెలల్లో సుమారు 130 దేశీ స్టార్టప్ కంపెనీలు దాదాపు 700 మిలియన్ డాలర్లు సమీకరించనున్నాయి. అలాగే సుమారు 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016 పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. డీల్స్.. * స్వీడన్‌కు చెందిన వొల్వొ గ్రూప్ ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.895కోట్లు. అంతేకాకుండా వొల్వొ కంపెనీకి ఐదేళ్ల పాటు ఐటీ సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. * ఆన్లైన్ చెల్లింపుల సేవలందించే ఇమ్వాంటేజ్ పేమెంట్స్ కంపెనీని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. * టెక్ దిగ్గజం ఐబీఎం తాజాగా ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు. -
గతవారం బిజినెస్
జీడీపీ వృద్ధి జోరు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి 7.3 శాతంగా నమోదయింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాల గణాంకాలను కూడా ఎగువముఖంగా సవరిస్తూ... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తాజా లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధిరేటు 7 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. జూలై- సెప్టెంబరు త్రైమాసిక వృద్ధి రేటు గణాంకాలను కూడా 7.4 నుంచి 7.7 శాతానికి పెంచారు. ప్రభుత్వ బ్యాంకులకు ఎన్పీఏల గుదిబండ ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 2012-15 మధ్య కాలంలో రూ. 1.14 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్పీఏ) ఖాతాల నుంచి తొలగించాయి. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో సగభాగం .. సుమారు రూ. 52,542 కోట్లను తొలగించాయి. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఈ గణాంకాలు విడుదల చేసింది. 2014-15లో రూ. 21,313 కోట్లను తొలగించిన ఎస్బీఐ అత్యధికంగా రైటాఫ్ చేసిన పీఎస్బీల్లో తొలి స్థానంలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 6,587 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ.3,131 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫార్మా రంగంలో ఉపాధి వెల్లువ! ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ రంగ ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుత సంవత్సరం 20 శాతంపైగా వృద్ధి నమోదవుతుందని, దాదాపు 1.34 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పీపుల్స్స్ట్రాంగ్, వీబాక్స్లు సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2016’ తెలియజేసింది. తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ కమ్యుని క్లిక్ తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ ఏర్పాటయింది. అమెరికాకు చెందిన కమ్యుని క్లిక్ ఐటీ కంపెనీ... తన భారతీయ అనుబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసింది. మెరుగైన, నాణ్యమైన వీడియో కాలింగ్‌ను అభివృద్ధి చేయడం, వీడియో కాలింగ్‌కు అనుబంధంగా యాప్స్‌ను రూపొందించటం ఈ విభాగం చేస్తుందని కమ్యుని క్లిక్ పేర్కొంది. పిచాయ్‌కి గూగుల్ బహుమతి గూగుల్ సెర్చింజన్ సహా పలు కీలక విభాగాలకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్‌కి కంపెనీ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించింది. అమెరికా చరిత్రలో ఒక లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగికి ఈ స్థాయిలో షేర్లు కేటాయించటం ఇదే తొలిసారి. పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. ఈ ధర 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ (అండర్ ఇన్వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది. రెండో నెలా తగ్గిన పారిశ్రామికోత్పత్తి పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణిం చింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటం ఇందుకు కారణమైంది. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’ కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా త్వరలో కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’ (బిజి నెస్ ఐడెంటిఫికేషన్ నంబర్-బీఐఎన్)ను అమల్లోకి తీసుకురానున్నది. ఒక కంపెనీ వేర్వేరు కార్యకలాపాలకు సంబంధించి పలు రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందే ప్రక్రియను తొలగించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. సాధారణంగా ఒక కంపెనీ 18 రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందాల్సి ఉంటుంది. భారత్‌లో వ్యాపారం కష్టం ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం వ్యాపారానుకూల దేశాల జా బితా-2016లో భారత్ 130వ స్థానంలో (189 దేశాలకుగానూ) ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ 4 స్థానాలను మెరుగుపరచుకుంది. ప్రభుత్వం టాప్-50లో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కింగ్‌ఫిషర్ హౌస్ వేలం! ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ.. బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఈ-వేలం వేయనుంది. దీన్ని ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఈ ప్రాపర్టీ ధరను ట్రస్టీ కంపెనీ రూ. 150 కోట్లుగా నిర్దేశించింది. ఆరో నెలా ధరలు రయ్ వరుసగా ఆరో నెలా ధరల పెరుగుదల కొనసాగింది. ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జనవరిలో ద్రవ్యోల్బణం 5.69 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2014 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణ రేటు 6.46 శాతంగా నమోదైంది. బీఎస్ఈ ‘ఆన్లైన్ ఎడ్యుకేషన్’ ‘బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్’ అనుబంధ సంస్థ ‘బీఎస్ఈ ఇన్స్టిట్యూట్’ తాజాగ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈవర్సిటీ.కామ్’ అనే ఆన్లైన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ విభాగంలో ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడమే ఈ ప్లాట్‌ఫామ్ ఉద్దేశం. ఇది ఫైనాన్స్ సంబంధిత కోర్సులను అందిస్తుంది. డీల్స్.. * స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడు ల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్లో ఇన్వెస్ట్ చేశారు. * దేశీయంగా మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో తాజాగా అ మెరికాకు చెందిన హెల్త్‌ప్లాన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చే యనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 460 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,150 కోట్లు)గా ఉంటుందని తెలియజేసింది. * టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ పబ్లిషింగ్ విభాగం వెస్ట్‌లాండ్‌లో 26 శాతం వాటాను ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది.