గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Dec 25 2017 2:13 AM | Last Updated on Mon, Dec 25 2017 11:38 AM

Last week's business - Sakshi

ఆస్ట్రేలియా మైనింగ్‌ సంస్థకు అదానీ గుడ్‌బై
ఆస్ట్రేలియాలో తలపెట్టిన కార్‌మైకేల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌ తాజాగా అక్కడి మైనింగ్‌ సర్వీసుల సంస్థ డౌనర్‌కి ఇచ్చిన 2.6 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టును రద్దు చేసింది. కార్‌మైకేల్‌ దాకా రైల్వే లైను నిర్మాణానికి రాయితీపై 900 మిలియన్‌ డాలర్ల రుణమిచ్చేందుకు క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో అదానీ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది.   

 27న బ్యాంకుల సమ్మె!!
బ్యాంకులు డిసెంబర్‌ 27న సమ్మె బాట పట్టనున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయాలన్నది యూనియన్ల డిమాండ్‌. ఈ అంశం 2012 నుంచి పెండింగ్‌లో ఉంది. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ) యూనియన్లు సమ్మె నోటీసులు అందించాయని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) బ్యాంకులకు తెలియజేసింది.  

‘బిట్‌కాయిన్‌’ సంపన్నులకు ఐటీ నోటీసులు
వర్చువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్న, ట్రేడింగ్‌ చేస్తున్న వారిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సుమారు 4–5 లక్షల మంది అత్యంత సంపన్నులకు నోటీసులు జారీచేయటం మొదలెట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఐటీ శాఖ బెంగళూరు విభాగం అధికారులు గత వారం తొమ్మిది వర్చువల్‌ కరెన్సీ ఎక్సే్ఛంజీల్లో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఎక్సే్ఛంజీల్లో 20 లక్షల మంది వ్యక్తులు నమోదు చేసుకోగా.. సుమారు 4–5 లక్షల మంది క్రియాశీలకంగా లావాదేవీలు చేస్తున్నారని వెల్లడయింది. 
 
ఐఫోన్‌ ధరలు పెరిగాయ్‌..
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్‌’.. ఐఫోన్‌ ధరలను పెంచింది. దీంతో పలు మోడళ్లపై ధరలు గరిష్టంగా 4.3 శాతం వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీ పలు మోడళ్లపై ధరలు పెంచింది.

కోటీశ్వరులు పెరుగుతున్నారు...
దేశంలో వ్యక్తిగత ఆదాయం రూ.కోటికి పైగా ఉన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో తమకు మొత్తం మీద రూ.కోటి, అంతకు మించి ఆదాయం ఉందంటూ 59,830 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. వీరు ప్రకటించిన ఉమ్మడి ఆదాయం రూ.1.54 లక్షల కోట్లు. ఆదాయపన్ను శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటికిపైగా ఆదాయం ఉందంటూ రిటర్నులు వేసిన వ్యక్తుల సంఖ్య 48,417 కాగా, వీరి ఉమ్మడి ఆదాయం రూ.2.05 లక్షల కోట్లు కావడం గమనార్హం.    

15 వేల కోట్ల ఆదాయం తగ్గించి చూపాయి..
టాటా టెలీ, జియో, టెలినార్, వీడియోకాన్‌ టెలికామ్, క్వాడ్రాంట్‌ (వీడియోకాన్‌ గ్రూప్‌ సంస్థ) టెలికం సంస్థలు లెక్కల్లో దాదాపు రూ. 14,814 కోట్ల మేర ఆదాయాలను తక్కువగా చేసి చూపాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆక్షేపించింది. దీనివల్ల ఖజానాకు సుమారు రూ. 2,578 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. 2014–15 దాకా ఈ 5 కంపెనీలు తమ ఆదాయాలను రూ. 14,814 కోట్ల మేర తక్కువ చేసి చూపించినట్లు ఆడిటింగ్‌లో తేలిందని కాగ్‌ వివరించింది.   

ఎయిర్‌సెల్‌ కార్యకలాపాలు నిలిపివేత!
ఎయిర్‌సెల్‌ కంపెనీ ఆరు టెలికం సర్కిళ్లలో తన కార్యకలాపాలను ఆపేయనుంది. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ టెలికం సర్కిళ్లలో జనవరి 30 నుంచి మొబైల్‌ సర్వీసులను నిలిపేస్తామని ఎయిర్‌సెల్‌ తెలిపింది. కాగా వేరే కంపెనీ నెట్‌వర్క్‌ను మారాలనుకుంటున్న ఎయిర్‌సెల్‌ వినియోగదారుల అభ్యర్థనలను వచ్చే ఏడాది మార్చి 10 వరకూ అంగీకరించాలని ఇతర టెలికం కంపెనీలను ట్రాయ్‌ ఆదేశించింది.  

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఆర్‌బీఐ కొరడా
మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ)పై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. బీఓఐ తాజాగా రుణాలు జారీ చేయరాదని, డివిడెండ్‌ను పంపిణి చేయకూడదని ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటంతో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై కూడా ఆర్‌బీఐ అదనపు ఆంక్షలను విధించింది.   

టీసీఎస్‌ ఆర్డర్‌ను పొడిగించిన నీల్సన్‌
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)... భారీ అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెటింగ్‌ రీసెర్చ్‌ కంపెనీ నీల్సన్‌ నుంచి 225 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ను టీసీఎస్‌ సాధించింది. ఈ డీల్‌పై ఇరు కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్‌లోనే సంతకాలు చేశాయి. 2007లో కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందానికి ఇది రెన్యువల్‌ అని, ఆ డీల్‌ను మరో ఐదేళ్ల పాటు నీల్సన్‌ పొడిగించిందని టీసీఎస్‌ తెలియజేసింది. ఒక భారత ఐటీ కంపెనీ సాధించిన అతి పెద్ద అవుట్‌సోర్సింగ్‌ ఆర్డర్‌ ఇదేనని నిపుణులంటున్నారు.   

ఎయిర్‌టెల్‌ ఈకేవైసీ లైసెన్స్‌ దుర్వినియోగం!  
మొబైల్‌ కనెక్షన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కోసం కస్టమర్ల నుంచి ఆధార్‌ వివరాలు సేకరించిన ఎయిర్‌టెల్‌.. కస్టమర్ల అను మతి తీసుకోకుండానే వారి పేరిట పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఖాతాలు తెరిచిందని ఆరోపణలు ఉన్నా యి. ఆ యూజర్లకు రావాల్సిన గ్యాస్‌ సబ్సిడీ మొత్తాలు కూడా ఈ ఖాతాల్లోకి చేరడం వివాదానికి దారి తీసింది. దీంతో యూఐడీఏఐ.. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ సంస్థల ఈకేవైసీ లైసెన్స్‌లను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. అయితే యూఐడీఏఐ తర్వాత ఎయిర్‌టెల్‌కు మాత్రమే జనవరి 10 వరకు ఈకేవైసీ వెరిఫికేషన్‌ నిర్వహించుకోవచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశి అరోరా తన పదవికి రాజీనామా చేశారు.  

7 ట్రిలియన్‌ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ!
భారత ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5–7 ట్రిలియన్‌ డాలర్ల (6.5–7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ వివేక్‌ దేబ్రాయ్‌ గురువారం పేర్కొన్నారు. 2035–40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని విశ్లేషించారు. ప్రస్తుతం భారత్‌ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.25 ట్రిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఆరవది.  

2047 నాటికి అన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలే!!
‘సియామ్‌’ తాజాగా 2047 నాటికి దేశంలో విక్రయమయ్యే వెహికల్స్‌ అన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలే అయ్యుండాలని పేర్కొంది. నగరాల్లోని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఈ గడువును 2030గా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.   


డీల్స్‌..
ఆటోమొబైల్‌ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘డ్రూమ్‌’.. మహీంద్రా, హీరో ఎలక్ట్రిక్‌ కంపెనీలతో భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా డ్రూమ్‌ తన ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను అందుబాటులో ఉంచనుంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ధర రూ.20,000– రూ.42,400 శ్రేణిలో, ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు రూ.8 లక్షలు –రూ.13 లక్షల శ్రేణిలో ఉంటాయని సంస్థ తెలిపింది. మరోవైపు ఒకినావా స్కూటర్స్, యోబైక్స్‌తోనూ డ్రూమ్‌ ఒప్పందం చేసుకుంది.
 ఆన్‌లైన్‌ ఆహార పదార్థాల సరఫరా కంపెనీ ఫుడ్‌ పాండా భారత కార్యకలాపాలను క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఓలా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ మొత్తం షేర్ల రూపంలోనే జరిగింది.
భారతీ ఎయిర్‌టెల్‌.. రువాండాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెలికం కంపెనీలో పూర్తి వాటాను కొనుగోలు చేయనుంది. టిగో రువాండా బ్రాండ్‌ కింద టెలికం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిల్లికామ్‌ ఇంటర్నేషనల్‌ సెల్యులర్‌ ఎస్‌ఏలో వంద శాతం వాటా కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.  
 ఈఐడీ ప్యారీ ఇండియాకి చెందిన బయో పెస్టిసైడ్స్‌ వ్యాపారాన్ని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేయనుంది. అలాగే మరో అనుబంధ కంపెనీ యూఎస్‌లో ఉన్న ప్యారీ అమెరికాను సైతం దక్కించుకోనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని కోరమాండల్‌ అంచనా వేసింది. కాగా ఈ మొత్తం డీల్‌ విలువ రూ.338 కోట్లు.
 హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ, హెచ్‌డీఎఫ్‌సీ డెవలపర్స్‌ను క్వికర్‌ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. అంతా షేర్ల రూపంలోనే అనుబంధ సంస్థలను క్వికర్‌కు విక్రయించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
 రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన ముంబై విద్యుత్‌ వ్యాపారాన్ని (రిలయన్స్‌ ఎనర్జీగా వ్యవహరిస్తారు) అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీకి విక్రయించనుంది. ఈ డీల్‌ విలువ రూ.18,000 కోట్లు.
 మహీంద్రా గ్రూప్‌.. ఫిన్‌లాండ్‌ స్టార్టప్‌ ’మెడిక్సిన్‌’లో 2,00,000 యూరోలను ఇన్వెస్ట్‌ చేస్తామని ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement