గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Apr 2 2018 12:14 AM | Last Updated on Mon, Apr 2 2018 12:14 AM

Last week's business  - Sakshi

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ గ్యారేజ్‌
ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగులు పనిచేసేందుకు, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది.   

దేశీ స్టార్టప్స్‌లో షావోమి పెట్టుబడులు!
స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ ’షావోమి’... భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతోంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 100 స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో బలోపేతమవ్వడమే ఈ ఇన్వెస్ట్‌మెంట్ల ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

5 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ
దేశీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2025 నాటికి రెట్టింపై.. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరగలదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత ద్రవ్యోల్బణ లక్ష్యాలు దెబ్బతినకుండానే దీన్ని సాధించగలమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో భారత్‌ .. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎకానమీగా ఉంది.

మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌.. మనం వెనకే!
మొబైల్‌ ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో మన దేశం టాప్‌–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. మొబైల్‌ ఫోన్‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్‌.

ఇక్కడ స్పీడ్‌ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్‌ టెస్ట్‌ ఇండెక్స్‌ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 62.07 ఎంబీపీఎస్‌.

టెక్సాస్‌లో విప్రో టెక్‌ సెంటర్‌
దేశీ మూడో అతిపెద్ద ఐటీ సర్వీసెస్‌ కంపెనీ ’విప్రో’ తాజాగా టెక్సాస్‌లోని ప్లానో ప్రాంతంలో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రానున్న కొన్నేళ్లలో టెక్సాస్‌లో ఉద్యోగుల సంఖ్యను 2,000కు పెంచుకుంటామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,400గా ఉంది. విప్రో క్లయింట్లకు నూతన, కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీలకు సంబంధించిన సేవలను అందించడంపై ఈ కొత్త సెంటర్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని కంపెనీ తెలిపింది.  

జూన్‌ నాటికి 5జీ రోడ్‌మ్యాప్‌ సిద్ధం!!
భారత్‌ 5జీ టెక్నాలజీ వినియోగంలో ముందుండాలని భావిస్తోంది. 5జీ టెక్నాలజీకి సంబంధించి జూన్‌ నాటికి ఒక పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తామని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు.

హైస్పీడ్‌ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, మిషన్‌ క్రిటికల్‌ సర్వీసులు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వంటి వాటికి అవసరమవ్వనున్న 5జీ టెక్నాలజీ వినియోగంలో ఇండియా ముందు వరుసలో ఉండేందుకు పరిశ్రమ సహా విద్యా సంస్థలు, స్టార్టప్స్‌ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని పిలుపునిచ్చారు.  5జీకి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులతో, పరిశ్రమ వ్యక్తులతో, ఐఐటీలతో ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేశామని, ఇది ఇప్పటికే పనిని ప్రారంభించిందని పేర్కొన్నారు.  

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు పెంపు  
రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్‌లపై వడ్డీరేట్లను బ్యాంకింగ్‌ దిగ్గజం– ఎస్‌బీఐ పెంచింది.  తాజా నిర్ణయం ప్రకారం– రెండేళ్లు పైబడిన స్థిర డిపాజిట్లపై రేట్లు 10 నుంచి 25 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరిగాయి. రెండేళ్ల నుంచి పదేళ్ల కాలానికి మధ్య కోటిలోపు డిపాజిట్లపై ఇకపై 6.6 శాతం నుంచి 6.75 శాతం శ్రేణిలో వడ్డీ రాబడి ఉంటుంది.

వృద్ధులకు 50 బేసిస్‌ పాయింట్లు అదనపు వడ్డీరేటు అమలవుతుంది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి డిపాజిట్‌ రేటు ప్రస్తుతం 6.4 శాతం (వృద్ధులకు 6.90 శాతం) అమలవుతోంది. ఈ రేటులో ఎటువంటి మార్పూ లేదు.  

ఎయిరిండియాకు కొత్త రెక్కలు
భారీగా రుణాలు పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా... ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది.

అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏఐఏటీఎస్‌ఎల్‌లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్‌ ఉంటుంది.  

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కట్టుదిట్టం!
కంపెనీల్లో కార్పొరేట్‌ నైతికతను (గవర్నెన్స్‌) మరింత కట్టుదిట్టం చేసేలా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక సంస్కరణలకు తెరతీసింది. దీనికి సంబంధించి ఉదయ్‌ కోటక్‌ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది.

అదే విధంగా లిస్టెడ్‌ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్‌ నిబంధనల్లో సవరణలు, స్టార్టప్‌లకు మరిన్ని నిధులు వచ్చేలా చూడటం వంటి పలు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.

ఐసీఐసీఐలో కొచర్‌ దుమారం?
కార్పొరేట్లు, బ్యాంకర్లు కుమ్మక్కై బ్యాంకింగ్‌ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలకు బలమిస్తూ.. మరో కుంభకోణం!! ఈ సారి బయటపడింది ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐలో. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌.. క్విడ్‌ ప్రో కో విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు కొచర్‌ కుటుంబం లబ్ధి పొందిందనే ఆరోపణల వెనకున్న ఆధారాలు చూస్తుంటే... ప్రైవేట్‌ బ్యాంకుల్లోనూ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సందేహాస్పదమయిందని అనిపించకమానదు.

జియో ప్రైమ్‌.. మరో ఏడాది ఉచితం
జియో యూజర్లకు తీపికబురు. రిలయన్స్‌ జియో తాజాగా జియో ప్రైమ్‌ సభ్యత్వాన్ని పొడిగించింది. మరో ఏడాదిపాటు ప్రైమ్‌ సర్వీసులను ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. దీని కోసం యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపింది.

మామూలుగా అయితే జియో ప్రైమ్‌ సభ్యత్వం గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఇక కొత్త యూజర్లు రూ.99ల వార్షిక సభ్యత్వ ఫీజుతో ప్రైమ్‌ బెనిఫిట్స్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగినవారు లైవ్‌ టీవీ చానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్‌ సంబంధిత కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు.     

ఆటోమొబైల్స్‌
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టాటా మోటార్స్‌’ తన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’నెక్సాన్‌’లో కొత్త వేరియంట్‌ ’నెక్సాన్‌ ఎక్స్‌జెడ్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).
 టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ’యాపిల్‌’.. కొత్త ఐపాడ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇందులో 9.7 అంగుళాల స్క్రీన్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), ఏ10 ఫ్యూజన్‌ చిప్, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 ఎంపీ కెమెరా, యాపిల్‌ పెన్సిల్‌ సపోర్ట్, హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఐపాడ్‌ భారత్‌లో ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. 32 జీబీ వై–ఫై మోడల్‌ ధర రూ.28,000గా, 32 జీబీ వై–ఫై + సెల్యులర్‌ మోడల్‌ ధర రూ.38,600గా ఉంది.  
 చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’హువావే’ మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. హువావే పీ20, హువావే పీ20 ప్రో అనేవి వీటి పేర్లు. పీ20 ధర దాదాపు రూ.52,200గా, పీ20 ప్రో ధర దాదాపు రూ.72,300గా ఉంది.
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’టాటా మోటార్స్‌’ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా.. రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ కన్వర్ట్టబుల్‌ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.69.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఇండియా). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement