గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Jan 22 2018 12:22 AM | Last Updated on Mon, Jan 22 2018 12:22 AM

Last week's business - Sakshi

ఎగుమతులు రయ్‌.. రయ్‌..
ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌లో ఎగుమతులు 12.36% మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్‌ బిల్లు సైతం 21.12% ఎగసి 41.91 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది.

విమానాల్లోనూ మొబైల్, ఇంటర్నెట్‌!
దేశీ విమాన ప్రయాణికులకిది శుభవార్తే. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌... ఇన్‌–ఫ్లైట్‌ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో శాటిలైట్, టెరిస్ట్రియల్‌ నెట్‌వర్క్‌ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్‌ కనెక్టివిటీ, ఇంటర్నెట్‌ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది.

846 టన్నుల బంగారం దిగుమతి
బంగారం దిగుమతులు గతేడాది భారీ ఎత్తున పెరిగాయి. ఏకంగా 846 టన్నుల పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువ స్థాయిలో ఉండడంతో పాటు దేశీయంగా డిమాండ్‌ పెరగడమే దిగుమతులు అధికం కావడానికి కారణాలుగా ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా పేర్కొంది. 2016లో దిగుమతి అయిన బంగారం 550 టన్నులతో పోలిస్తే గతేడాది దిగుమతులు 53 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

భారత మార్కెట్లోకి థాయ్‌ రిటైల్‌ సంస్థ
థాయ్‌లాండ్‌కి చెందిన రిటైలింగ్‌ సంస్థ సియామ్‌ మాక్రో పీసీఎల్‌... భారత హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. వచ్చే ఐదేళ్లలో భారత క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సిరిపోర్ణ్‌ డెక్‌సింఘా తెలిపారు. లాట్స్‌ హోల్‌సేల్‌ సొల్యూషన్స్‌ పేరిట ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారామె.

పది రూపాయల నాణేలన్నీ చెల్లుతాయి
పది రూపాయల నాణేలకు సంబంధించి చెలామణిలో ఉన్న మొత్తం 14 డిజైన్లూ చెల్లుబాటవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఇవన్నీ చట్టబద్ధమైనవేనని పేర్కొంది. వ్యాపార వర్గాలు పది రూపాయల నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.  

ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాలు మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిదిన్నర నెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి జనవరి 15 వరకు) పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగి ఏకంగా రూ. 6.89 లక్షల కోట్లకు చేరాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9.8 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లను ఆదాయపన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


ఆటోమొబైల్స్‌
♦  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా తన రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ ల్యాండ్‌మార్క్‌ 2018 ఎడిషన్‌ ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.50.20 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).
♦   టెక్‌ దిగ్గజం శాంసంగ్‌.. గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.12,990.
♦  లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి తన ప్రీమియం ఎస్‌యూవీ క్యూ5లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57.6 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).
♦   జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ’మెర్సిడెస్‌ బెంజ్‌’ తాజాగా బీఎస్‌–6 నిబంధనలకు అనువుగా ఉన్న ’ఎస్‌ క్లాస్‌’ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది.


డీల్స్‌..
♦  టెలికం రంగంలోని భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్‌ఆర్‌ఎస్‌ పార్ట్‌నర్స్‌ (కేమాన్‌) ఎల్‌ఎల్‌సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు.
♦   మొబైల్‌ వాలెట్‌ కంపెనీ మొబిక్విక్‌లో 12.60 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. నిజానికి రూ. 225 కోట్లతో 10.83 శాతం వాటా కొనుగోలు చేసేందుకు గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా వాటా పరిమాణం కొంత పెరిగిందని, కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల కన్వర్షన్‌ ధర మారటమే ఇందుకు కారణమని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలియజేసింది. ఇందుకోసం గతంలో అంగీకరించిన మొత్తమే తప్ప .. కొత్తగా మరింత పెట్టుబడేమీ పెట్టలేదని కంపెనీ తెలిపింది.
♦  ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరో భారీ డీల్‌ను చేజిక్కించుకుంది. యూకే, యూరోప్‌ల్లో సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యాపారాన్ని నిర్వహించే ప్రుడెన్షియల్‌ పీఎల్‌సీకి చెందిన ఎమ్‌ అండ్‌ జీ ప్రుడెన్షియల్‌ నుంచి డీల్‌ను సాధించామని టీసీఎస్‌ తెలిపింది. ఈ డీల్‌ విలువ సుమారుగా రూ.4,400 కోట్లు.  


3 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహార పదార్థాల రేట్లు తగ్గటంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. గత నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ప్రకారం ద్రవ్యోల్బణం 3.58 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్టం. గత నవంబర్‌లో ఇది 3.93 శాతం.


మరో 1.20 లక్షల కంపెనీల రద్దు!
నల్లధనంపై పోరులో భాగంగా మరో 1.20 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 2.26 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు వీటితో అనుబంధం కలిగిన 3.09 లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement