గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Jan 29 2018 2:09 AM | Last Updated on Mon, Jan 29 2018 11:04 AM

Last week's business - Sakshi

సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్‌
సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్‌ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్‌ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది.  

అందుబాటులోకి ’అమెజాన్‌ గో’ స్టోర్‌
అమెజాన్‌ ఎట్టకేలకు తన తొలి ’అమెజాన్‌ గో’ స్టోర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ.. మెషీన్‌ లెర్నింగ్, సెన్సార్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలతో అమెరికాలోని సీటెల్‌లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఎలాంటి చెక్‌ పాయింట్స్‌ ఉండవు. అంటే కస్టమర్‌ స్టోర్‌ లోనికి వెళ్లి తనకు నచ్చిన వస్తువులు/సరుకులు తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు. కస్టమర్‌ అమెజాన్‌ అకౌంట్‌ నుంచి బిల్లు ఆటోమేటిక్‌గా డెబిట్‌ అయిపోతుంది.

గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్‌జీసీ ఔట్‌!
ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఓఎన్‌జీసీ సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు కోసం ఓఎన్‌జీసీ ఉపయోగించుకోనుంది. ఓఎన్‌జీసీకి ఐవోసీలో 13.77 శాతం వాటా, గెయిల్‌లో 4.86 శాతం వాటా ఉంది.  

పోర్టుల రంగంలో భారీ పెట్టుబడులు
పోర్టులు, లాజిస్టిక్స్‌ రంగాల్లో మూడు బిలియన్‌ డాలర్ల (రూ.19,200 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఓ వేదిక ఏర్పాటుకు చేయటానికి జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధితో (ఎన్‌ఐఐఎఫ్‌) ఈ రంగంలో పేరొందిన డీపీ వరల్డ్‌ సంస్థ చేతులు కలిపింది. ’’పోర్టులు, టెర్మినళ్లు, రవాణా, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులకు గాను ఎన్‌ఐఐఎఫ్, డీపీ వరల్డ్‌ కలసి పెట్టుబడుల వేదిక ఏర్పాటు చేస్తాయి. ఈ రంగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, ఆస్తుల కొనుగోలు కోసం 3 బిలియన్‌ డాలర్ల నిధులను ఈ వేదిక ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తాం’’ అని డీపీ వరల్డ్‌ పేర్కొంది.

ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయ్‌
ఆర్థిక వృద్ధి గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ దేశీయంగా ఆర్థిక అసమానతలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతేడాది జరిగిన మొత్తం çసంపద సృష్టిలో 73 శాతం సొమ్మంతా ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది. అదే సమయంలో దేశ జనాభాలో దాదాపు సగభాగమైన 67 కోట్ల మంది పైగా పేదల సంపద కేవలం ఒకే ఒక్క శాతం పెరిగింది. అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.   

వృద్ధిలో మహిళలనూ కలపండి: ఐఎంఎఫ్‌  
అధిక వృద్ధి సాధించేందుకు ఆర్థిక వ్యవస్థలో మహిళలను మరింత భాగస్వాముల్ని చేయడంపై భారత్‌ దృష్టి పెట్టాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టీన్‌ లగార్డ్‌ సూచించారు. ఆర్థిక సేవలు తదితర కీలక రంగాల్లో సంస్కరణలను కొనసాగించాలని పేర్కొన్నారు. పురుష ఉద్యోగులకు దీటుగా ఉద్యోగినుల సంఖ్య పెరిగిన పక్షంలో భారత ఎకానమీ 27 శాతం మేర వృద్ధి చెందేందుకు తోడ్పడగలదని ఐఎంఎఫ్‌ అధ్యయనంలో తేలినట్లు ఆమె వెల్లడించారు.  


డీల్స్‌..
మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ (ఎమ్‌ఆర్‌పీఎల్‌)ను నగదు, షేర్ల మార్పిడి రూపంలో కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముకేశ్‌ కుమార్‌ సురానా చెప్పారు. కాగా హెచ్‌పీసీఎల్‌ను ఓఎన్‌జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే.
 మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్లో ప్రమోటర్‌ సంస్థ ఎస్సెల్‌ హోల్డింగ్స్‌ 1.44 శాతం వాటాలను విక్రయించింది. ఈ డీల్‌ విలువ రూ. 825 కోట్లు.
 గ్రామీణ గృహ నిర్మాణానికి సంబంధించి వడ్డీ సబ్సిడీ పథకం (ఆర్‌హెచ్‌ఐఎస్‌ఎస్‌) అమలు విషయంలో నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌తో (ఎన్‌హెచ్‌బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ తెలిపింది.  
 అమెరికాకు చెందిన హర్టే హంక్స్‌లో ఐటీ సంస్థ విప్రో తన అనుబంధ కంపెనీ అయిన విప్రో ఎల్‌ఎల్‌సీ ద్వారా 9.9 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.   
 కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌.. ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విభాగం వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.35 కోట్లు.
 బంగాళాఖాతంలోని ’ఎన్‌ఈసీ (నార్త్‌ ఈస్ట్‌ కోస్ట్‌)– 25’ చమురు క్షేత్రంలో నికో రిసోర్సెస్‌ సంస్థకున్న వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటిష్‌ పెట్రోలియం పీఎల్‌సీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  

పెట్టుబడులకు బెస్ట్‌.. భారత్‌
పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్‌ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ’పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. దీని ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించి భారత్‌ ఐదో స్థానానికి చేరింది. 2017లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.


ఆటో షోలో మారుతీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ!
దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ ఇండియా’ తన కాన్సెప్ట్‌ ఎలక్ట్రిక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’ఇ–సర్వైవర్‌’ను ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనుంది. ఇది టూ సీట్స్‌ కలిగిన ఓపెన్‌ టాప్‌ ఎస్‌యూవీ. అలాగే కంపెనీ.. కాన్సెప్ట్‌ ’ఫ్యూచర్‌ ఎస్‌’ (ఎస్‌యూవీ ప్రత్యేకతలు కలిగిన కాంపాక్ట్‌ కారు)ను, సరికొత్త మూడో జనరేషన్‌ స్విఫ్ట్‌ కారును, నెక్స్ట్‌ జనరేషన్‌ సుజుకీ హైబ్రిడ్‌ సిస్టమ్‌ (హెచ్‌ఈవీ) వర్కింగ్‌ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement