గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Jan 15 2018 1:03 AM | Last Updated on Mon, Jan 15 2018 1:03 AM

Last week's business - Sakshi

ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.56 లక్షల కోట్లు 
ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (2017 ఏప్రిల్‌– డిసెంబర్‌) రూ.6.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18% వృద్ధి నమోదయ్యింది. 2017– 18లో మొత్తం సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.9.8 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వస్తాయని అంచనా వేశారు. కాకపోతే ఈ లక్ష్యంలో ప్రస్తుత డిసెంబర్‌ నాటికి 67% పూర్తయింది.  

12,600 కోట్ల సమీకరణకు ఎస్‌బీఐ రెడీ! 
ఎస్‌బీఐ విదేశీ బాండ్ల ద్వారా రూ.12,600 కోట్లకు పైగా నిధులు సమీకరించనుంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో డాలర్లు, ఇతర కన్వర్టబుల్‌ కరెన్సీల్లో బాండ్ల జారీతో ఈ స్థాయి లో నిధులు సమీకరిస్తామని ఎస్‌బీఐ తెలిపింది. వీటిని విదేశాల్లో కార్యకలాపాల విస్తరణకు వినియోగిస్తామని పేర్కొంది.  

’మెర్సిడెస్‌’దే లగ్జరీ కార్‌ మార్కెట్‌.. 
దేశీ లగ్జరీ కార్‌ మార్కెట్‌లో మెర్సిడెస్‌ బెంజ్‌ తన హవా కొనసాగిస్తోంది. వరుసగా మూడోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పలు సవాళ్లను అధిగమించి మరీ 2017లో ఏకంగా 15,330 కార్లు, ఎస్‌యూవీలను విక్రయించింది. కంపెనీ కార్ల విక్రయాలు 2016లో 13,231 యూనిట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన 15.86% వృద్ధి నమోదయ్యింది.  

గుర్గావ్‌లో ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్టు 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన రియ ల్టీ బ్రాండ్‌ ’ట్రంప్‌ టవర్స్‌’ గుర్గావ్‌లో ఖరీదైన రెసిడెన్షియల్‌ ప్రాజె క్టు చేపడుతోంది. డొనాల్డ్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ సారథ్యంలోని ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ నుంచి లైసెన్స్‌ పొందిన ఎం3 ఎం, ట్రైబెకా సంస్థలు ఈ ప్రాజెక్టును ప్రకటించాయి. ఇందులో రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో 250 అపార్ట్‌మెంట్లు ఉంటాయి.  

ఎఫ్‌డీఐ సంస్కరణల జోరు 
కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్, నిర్మాణ రంగం, విద్యుత్‌ ఎక్సే్చంజీల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. దీంతో సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఆటోమేటిక్‌ విధానంలో 100% ఎఫ్‌డీఐలకు మార్గం సుగమం అయ్యింది. అలాగే రుణ సంక్షోభంలో కూరుకున్న ఎయిరిండియాలో 49% దాకా విదేశీ ఎయిర్‌లైన్స్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతించింది. 

3,500 కోట్ల బినామీ ఆస్తులు జప్తు 
ఫ్లాట్లు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. వీటి విలువ రూ.3,500 కోట్లు ఉంటుందని తెలిపింది. 2016 నవంబర్‌లో అమల్లోకి వచ్చిన బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. 

పీడబ్ల్యూసీకి సెబీ షాక్‌! 
అంతర్జాతీయ ఆడిటింగ్‌ దిగ్గజం ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కేసుకు సంబంధించి పీడబ్ల్యూసీని దోషిగా తేల్చింది. ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్‌వర్క్‌ సంస్థలు రెండేళ్ల పాటు భారత్‌లోని లిస్టెడ్‌ కంపెనీలకు ఆడిట్‌ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్‌ ఖాతాలు ఆడిటింగ్‌ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్ల పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. 

ఐదో ఏడాదీ తగ్గిన గోల్డ్‌ ఫండ్స్‌ మెరుపు! 
గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి నిధులు వెనక్కుమళ్లడం కొనసాగుతోంది. 2017లో గోల్డ్‌ ఫండ్స్‌ నుంచి రూ.730 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇలాంటి ధోరణి వరుసగా ఇది ఐదో ఏడాది.    

పగ్గాలు తెంచుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం 
రిటైల్‌ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్‌లో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. మరోవైపు దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 17 నెలల గరిష్టానికి చేరింది. గత నవంబర్‌లో ఇది 8.4 శాతంగా నమోదైంది. 

ఎమ్మార్‌ డీమెర్జర్‌కు ఎన్‌సీఎల్‌టీ ఓకే 
ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ కంపెనీ డీమెర్జర్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. దీంతో ఎమార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ జాయింట్‌ వెంచర్‌ ఇక ఎమార్‌ ప్రాపర్టీస్, ఎమ్మార్‌ డెవలప్‌మెంట్‌లుగా విడిపోతుంది. 

ఆటోమొబైల్స్‌ 
’హ్యుందాయ్‌’ తన మిడ్‌సైజ్డ్‌ ప్రీమియం సెడాన్‌ ’వెర్నా’లో ’ఇ,’ ’ఇఎక్స్‌’ అనే రెండు కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.7.79 లక్షలు, రూ.9.09 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ)గా ఉంది.  

’శాంసంగ్‌ ఇండియా’.. ’గెలాక్సీ ఏ8 ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.32,990. కంపెనీ నుంచి డ్యూయెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. 

’బజాజ్‌ ఆటో’.. డిస్కవర్‌ 110, డిస్కవర్‌ 125 అనే రెండు బైక్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర రూ.50,496 (ఎక్స్‌షోరూమ్‌ మహరాష్ట్ర).  

’లంబోర్గిని’ తన తొలి సూపర్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ ’ఉరుస్‌’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3 కోట్లు.  

’హోండా కార్స్‌’ తన సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్‌–వీ మోడళ్లలో స్పెషల్‌ ఎడిషన్స్‌ను తీసుకొచ్చింది. హోండా సిటీ 20వ వార్షికోత్సవం ఎడిషన్, అమేజ్‌ ప్రైడ్‌ ఎడిషన్, డబ్ల్యూఆర్‌–వీ ఎడ్జ్‌ ఎడిషన్‌ అనేవి వీటి పేర్లు.  

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన అడ్వెంచర్‌ టూరింగ్‌ మోడల్‌ ’హిమాలయన్‌’లో కొత్త వెర్షన్‌ ’స్లీట్‌’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.13 లక్షలు (ఆన్‌–రోడ్‌ చెన్నై).  

యమహా మోటార్‌ ఇండియా తన ’ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌ఐ’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.86,042. 

డీల్స్‌..
ఎన్‌ఎస్‌ఈలో 0.20 శాతం వాటాను మౌలిక రంగ రుణాలిచ్చే ఐఎఫ్‌సీఐ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.925 ధర చొప్పున పది లక్షల షేర్లను రూ.92.51 కోట్లకు విక్రయించింది.  

’ఫోన్‌పే’.. మొబైల్‌ వాలెట్‌ సంస్థ ’ఫ్రీచార్జ్‌’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఫోన్‌పే యూజర్లు వారి ఫ్రీచార్జ్‌ వాలెట్లను ఫోన్‌పే యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.  

టాటా కెమికల్స్‌ తన యూరియా, కస్టమైజ్‌డ్‌ ఫెర్టిలైజర్స్‌ వ్యాపారాన్ని  నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ ఎఎస్‌ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియాకు రూ.2,682కోట్లకు విక్రయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement