గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Mar 12 2018 12:07 AM | Last Updated on Mon, Mar 12 2018 12:07 AM

Last week's business - Sakshi

అత్యంత సంపన్నుడు.. అమెజాన్‌ ’బెజోస్‌’
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ నిలిచాడని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. జెఫ్‌ బెజోస్‌ ఫోర్బ్స్‌ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే తొలిసారి. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది.

ఏడాది కాలంలో అమెజాన్‌ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్‌ బెజోస్‌ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ నిలిచారు.   

టీడీఎస్‌ పేరిట రూ.3,200 కోట్ల స్వాహా!
నీరవ్‌ మోదీ 12,700 కోట్ల స్కామ్‌ దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేస్తే... మరోవైపు టీడీఎస్‌ రూపంలో కంపెనీలు రూ.3,200 కోట్ల మేర భారీ అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీఎస్‌ అంటే... ఉద్యోగుల జీతం నుంచి ఆదాయపు పన్ను నిమిత్తం నెల నెలా కోత వేసే మొత్తం.

ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు తమ ఉద్యోగుల వార్షికాదాయం గనక పన్ను చెల్లించేటంత ఉంటే ఆ మేరకు టీడీఎస్‌ను మినహాయించి వారి పేరిట ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంటాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 447 కంపెనీలు టీడీఎస్‌ సొమ్మును జమ చేయకుండా పక్కదారి పట్టించినట్టు ఆ శాఖ గుర్తించింది.
 
గతేడాది రూ.81,683 కోట్ల రైటాఫ్‌!
మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకు లు (పీఎస్‌బీ) భారీ మొత్తంలోనే రుణాలను మాఫీ చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్‌) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్స్‌ షీట్‌ రైటాఫ్‌ కింద చూపిస్తాయని.. సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టంచేశారు.  

వారి పాస్‌పోర్టులపై లుక్కేయండి!
విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల తరహాలో భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయే వారిని కట్టడి చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.50 కోట్లు, అంతకు మించి భారీగా రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలందరి పాస్‌పోర్టు వివరాలను సేకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.

ఇందుకు 45 రోజుల గడువు విధించింది. ఒకవేళ రుణ గ్రహీతకు పాస్‌పోర్ట్‌ లేని పక్ష ంలో ఆ విషయాన్ని ధృవీకరిస్తూ వారి దగ్గరి నుంచి డిక్లరేషన్‌ తీ సుకోవాలని సూచించింది. అలాగే, పాస్‌పోర్ట్‌ వివరాలు పొందు పర్చేలా రుణ దరఖాస్తుల్లో మార్పులు చేయాలని పేర్కొంది.    

టెలికం కంపెనీలకు భారీ ఊరట
రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే స్పెక్ట్రమ్‌ హోల్డింగ్‌ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  

దిగుమతి సుంకాలతో ట్రంప్‌ షాక్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు.

ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్‌ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు.  

ట్వీటర్‌ సీటీవోగా పరాగ్‌ అగర్వాల్‌
మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ’ట్వీటర్‌’.. పరాగ్‌ అగర్వాల్‌ను చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా (సీటీవో) నియమించుకుంది. ఈయన ఆడమ్‌ మెస్జింగర్‌ స్థానాన్ని భర్తీ చేశారు. ఆడమ్‌ మెస్జింగర్‌ 2016 చివరిలో కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఇకపోతే అగర్వాల్‌ ఐఐటీ–బాంబే పూర్వ విద్యార్థి. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.  

భారత్‌కి రావడం అసాధ్యం: చోక్సీ
పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడైన గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీ.. సీబీఐకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విచారణలో సహకరించడానికి తాను భారత్‌ తిరిగి రావడం ‘అసాధ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ఇప్పటికే తన పాస్‌పోర్టు రద్దు కావడం ఒక కారణం కాగా.. అనారోగ్య సమస్యల వ ల్ల ప్రయాణం చేయలేకపోవడం మరో కారణమని వివరించారు.


డీల్స్‌..
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. జేఎస్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్, చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల్లోకి అడుగు పెట్టేందుకు వీలుగా, డైవర్సిఫికేషన్‌ వ్యూహంలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను సొంతం చేసుకున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బీఎస్‌ఈకి తెలిపింది.
   ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీకి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి రూ.192 కోట్ల ఆర్డర్‌ లభించింది. గురుగ్రామ్‌లో ఆర్‌ఈసీకి టౌన్‌షిప్‌ని నిర్మించి డెవలప్‌చేసే ఆర్డర్‌ లభించిందని ఎన్‌బీసీసీ తెలిపింది.  
 టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ అపోలో హాస్పిటల్స్‌ గుండె సంబంధిత వ్యాధుల్లో ఆధునాతన టెక్నాలజీ వినియోగానికి చేతులు కలిపాయి. గుండె వ్యాధులకు సంబంధించి రోగికున్న ప్రమాదాన్ని అంచనా వేయడానికి, డాక్టర్లకు వ్యాధి ట్రీట్‌మెంట్‌కు అవసరమైన సాయమందించేందుకు కొత్త మెషీన్‌ లెర్నింగ్‌ విధానాలను ఇవి అభివృద్ధి చేస్తాయి.
గృహ రుణాలు అందించే కెన్‌ఫిన్‌ హోమ్స్‌తో కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చేతులు కలిపింది. మూడేళ్ల కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం చేసుకుంది. దీనికింద కెన్‌ఫిన్‌ హోమ్స్‌ నుంచి గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తుంది.  
 విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు (భెల్‌) భారీ ఆర్డర్‌ లభించింది. జార్ఖండ్‌లో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఆర్డర్‌ను సాధించామని, ఈ ఆర్డర్‌ విలువ రూ.11,700 కోట్లని భెల్‌ తెలిపింది.


ఆటోమొబైల్స్‌..
 దేశీ రెండో అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తన చెన్నై ప్లాంటులో తొలిసారిగా తయారు చేసిన 6 సిరీస్‌ గ్రాన్‌ టురిస్మో కారు ‘బీఎండబ్ల్యూ 630ఐ గ్రాన్‌ టురిస్మో స్పోర్ట్‌ లైన్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది పెట్రోల్‌ వేరియంట్‌ రూపంలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.58.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).  
 మహీంద్రా టూవీలర్స్‌ తన ప్రీమియం స్పోర్ట్స్‌ టూరర్‌ బైక్‌ ‘మోజో’లో కొత్త వేరియంట్‌ ‘మోజో యూటీ (యూనివర్సల్‌ టూరర్‌) 300’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).  
   ‘టాటా మోటార్స్‌’ తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘జెస్ట్‌’లో స్పెషల్‌ ఎడిషన్‌ ‘జెస్ట్‌ ప్రీమియో’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).  
 టూవీలర్‌ కంపెనీ ‘సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా’ తాజాగా 2018 ఎడిషన్‌ జిక్సర్, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ బైక్స్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.80,928, రూ.90,037గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి.
 వాహన తయారీ కం పెనీ ‘టీవీఎస్‌ మో టార్‌’ తన ‘అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ’ లో కొత్త ఎడిషన్‌ను తీసుకువచ్చింది. అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ రేస్‌ ఎడిషన్‌ 2.0 పేరుతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బైక్‌ గరిష్ట ధర రూ.1,08,985 (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).  
 ‘ఫోక్స్‌వ్యాగన్‌’ తన పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్‌ ‘పోలో’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5,41,800 (ఎక్స్‌షోరూమ్‌). ఇందులో 1.0 లీటర్‌ ఎంపీఐ ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement