గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Feb 5 2018 2:04 AM | Last Updated on Mon, Feb 5 2018 2:04 AM

Last week's business - Sakshi

డిసెంబర్‌లో నెమ్మదించిన మౌలిక రంగం
ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి రేటు డిసెంబర్‌లో నెమ్మదించింది. వృద్ధి 4 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఏడాది ఇదే నెల్లో గ్రూప్‌ వృద్ధి రేటు 5.6 శాతం.

ఆస్ట్రేలియా మార్కెట్లోకి ఓలా
ట్యాక్సీ సర్వీసుల దేశీ దిగ్గజం ఓలా... విదేశీ మార్కెట్లకు కూడా కార్యకలాపాలు విస్తరిస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాలోనూ సర్వీసులు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా.. ప్రస్తుతం సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్‌ నగరాల్లో ప్రైవేట్‌ వాహనదారులను తమ ప్లాట్‌ఫాంపై నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఓలా తెలిపింది.  

రైతులకు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులు
ఎస్‌బీఐ రైతులకు క్రెడిట్‌ కార్డులను అందించనున్నట్లు ప్రకటిం చింది. తమ అనుబంధ సంస్థ ’ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌’ ద్వారా రైతులకు క్రెడిట్‌ కార్డులను అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ’గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాం. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుంది’ అని వివరించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్‌బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.  

భూషణ్‌ స్టీల్‌పై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఆసక్తి
మొండిబాకీలతో ఎన్‌సీఎల్‌టీ ముం దుకు చేరిన భూషణ్‌ స్టీల్, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్, మోనెట్‌ ఇస్పాత్‌ సంస్థల కొనుగోలుపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ దృష్టి సారించింది. భూషణ్‌ స్టీల్, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌కి సంబంధించి ఫిబ్రవరి 3లోగా బిడ్లు దాఖలు చేస్తామని సంస్థ జేఎండీ శేషగిరిరావు తెలిపారు. మోనె ట్‌ ఇస్పాత్‌ కోసం ప్రణాళికను సమర్పించినట్లు పేర్కొన్నారు.

కాల్‌ డ్రాప్స్‌ కట్టడికి టెల్కోల 74 వేల కోట్లు!
టెలికం కంపెనీలు కాల్‌ డ్రాప్స్‌ సమస్య పరిష్కారానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సహా ఇతర టెలికం కంపెనీలు రూ.74,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్లతో వాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోనున్నాయని టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు. తద్వారా కాల్‌ డ్రాప్స్‌ సమస్యను అధిగమించడానికి టెల్కోలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.   

27 నుంచి 28కి ఐఎస్‌బీ ర్యాంకు!
ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్‌కతాల గ్లోబల్‌ ర్యాంక్‌ ఈ ఏడాది మెరుగుపడింది. అయితే ఐఐఎం– అహ్మదాబాద్, ఐఎస్‌బీ హైదరాబాద్‌ ర్యాంక్‌ మాత్రం తగ్గింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ లండన్‌ ’గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్‌–2018’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. స్టాన్‌ఫర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకోగా... దీని తర్వాతి స్థానంలో ఫ్రెంచ్‌ స్కూల్‌ ఇన్‌సీడ్‌ ఉంది. 2017లో 27వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఐఎస్‌బీ... ఈసారి 28కి పరిమితమయింది.   

కోటక్‌ ఎంఎఫ్‌ కొత్త స్కీమ్‌
కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా ’కోటక్‌ ఇండియా గ్రోత్‌ ఫండ్‌ సిరీస్‌–4’ అనే కొత్త స్కీమ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ఫిబ్రవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్‌ ప్రధానంగా లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది.  

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ మొత్తం రూ.24.42 లక్షల కోట్లు.   


ఆటోమొబైల్స్‌
దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్‌’ తాజాగా ‘ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌’ పేరిట కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.90,000– రూ. 1,00,000 శ్రేణిలో ఉండొచ్చు.
ఇటాలియన్‌ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మాసెరటి’  తన ప్రముఖ ప్రీమియం ఎస్‌యూవీ ‘లెవాంటె’లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌). మాసెరటి నుంచి మన దేశంలోకి వస్తోన్న తొలి ఎస్‌యూవీ ఇదే.
 ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్‌ ఇండియా’ తాజాగా కొత్త కాంపాక్ట్‌ యుటిలిటీ వెహికల్‌ ‘ఫ్రీస్టైల్‌’ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఇది ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.  


డీల్స్‌..
వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన మీడియా గ్రూప్‌ ‘టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌’ తన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ‘వయాకామ్‌ 18’లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకుంది. ఇందుకోసం 20 మిలియన్‌ డాలర్లు చెల్లించి అమెరికాకు చెందిన భాగస్వామ్య సంస్థ వయాకామ్‌ నుంచి 1 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో వయాకామ్‌18లో టీవీ18 వాటా 51 శాతానికి చేరింది.  
వాల్‌మార్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో 15 నుంచి 20 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికోసం సుమారు 1 బిలియన్‌ డాలర్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయాలని యోచిస్తోంది.  
బిగ్‌బాస్కెట్‌.. ఆలీబాబా, అబ్రాజ్‌ క్యాపిటల్, శాండ్స్‌ క్యాపిటల్, ఐఎఫ్‌సీ తదితర సంస్థల నుంచి రూ.1,920 కోట్లు పెట్టుబడులు సమీకరించింది. మరోవైపు జొమాటొలో ఆలీబాబా అనుబంధ సంస్థ ఆంట్‌ స్మాల్‌ అండ్‌ మైక్రో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.  
♦  జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో (జీహెచ్‌ఐఏఎల్‌) జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) 11 శాతం వాటా పెంచుకుంటోంది. మలేషియన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్, ఎంఏహెచ్‌బీ (మారిషస్‌) నుంచి ఈ వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్‌ విలువ సుమారు రూ.484 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement