73,500 కోట్ల డాలర్ల ఉపసంహరణ
వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ప్రపంచ ఇన్వెస్టర్లు, కంపెనీలు గత ఏడాది 73,500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్(ఐఐఎఫ్) పేర్కొంది. గత 15 ఏళ్లలో ఆ దేశాల నుంచి ఈ స్థాయిలో నిధులు వెనక్కితీసుకోవడం ఇదే మొదటిసారని వివరించింది.
ప్రైవేట్ రంగానికి ఏడీబీ అధిక రుణం
అంతర్జాతీయ రుణ సంస్థ- ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రై వేటు రంగ రుణ పరిమాణం 2015లో 37 శాతం ఎగసింది. దీనితో బ్యాంక్ ప్రై వేటు రంగం పెట్టుబడుల పోర్టిఫోలియో 8 బిలియన్ డాలర్లు దాటింది.
అక్కడ తగ్గింది.. ఇక్కడ పెరిగింది..
అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి తగ్గితే.. భారత్‌లో మాత్రం పెరిగింది. అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి గతేడాది 2.8 శాతం క్షీణతతో 1,622 మిలియన్ టన్నులకు తగ్గింది. 2009 నుంచి చూస్తే ఇదే తొలి క్షీణత. కాగా భారత్‌లో 2014లో 87.3 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి 2015కు వచ్చేసరికి 2.6 శాతం వద్ధితో 89.6 మిలియన్ టన్నులకు పెరిగింది.
లేమన్ బ్రదర్స్‌కు జేపీమోర్గాన్ పరిహారం
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు లేమన్ బ్రదర్స్‌తో వివాదాన్ని కొంత మేర పరిష్కరించుకునేందుకు 1.42 బిలియన్ డాలర్లు చెల్లించడానికి జేపీమోర్గాన్ చేజ్ అంగీకరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి తెరతీస్తూ 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా ప్రకటించింది. తమకు క్లియరింగ్ బ్యాంక్‌గా వ్యవహరించిన జేపీమోర్గాన్ అక్రమంగా నిధులు కైంకర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని లేమన్ బ్రదర్స్ దావా వేసింది.
ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అధ్యయనానికి ఏర్పాటయిన ప్రత్యక కర్తవ్య నిర్వహణా బృందంలో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సభ్యునిగా నియమితులయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకర్లు, విధాన నిర్ణేతలు ఉన్నారు.
రిలయన్స్ 4జీ ఫోన్ల విక్రయాలు
లైఫ్ (ఎల్‌వైఎఫ్) బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్ 4జీ ఫోన్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో మొదలయ్యే గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియో టెలికం సర్వీసులకు అనువైనవిగా ఈ 3 హ్యాండ్‌సెట్స్‌ను రూపొందించారు. వీటి ధరలు రూ. 15,499 నుంచి రూ. 25,800 దాకా ఉన్నాయి.
తక్కువ ధరల హౌసింగ్‌లోకి షాపూర్‌జీ
డైవర్సిఫైడ్ కంపెనీ ‘షాపూర్‌జీ పల్లోంజీ’ తాజాగా తక్కువ ధరల రెసిడెన్షియల్ హౌసింగ్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ‘జాయ్‌విల్లే’ బ్రాండ్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో స్టాండర్డ్ చార్టర్డ్ ప్రై వేట్ ఈక్విటీ, ప్రపంచ బ్యాంకు విభాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకులకు 70 శాతం వాటా ఉంది. కాగా 2-3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్స్ ధర రూ.20-30 లక్షల మధ్యలో ఉంటుందని కంపెనీ తెలిపింది.
బ్లాక్‌బెర్రీ తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై(ఓఎస్) పనిచేసే స్మార్ట్‌ఫోన్ ‘ప్రివ్’ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.62,990.
ప్రపంచ సంపన్నుల్లో మనోళ్లు ముగ్గురు
ప్రపంచ సంపన్నుల జాబితాలో ముగ్గురు భారతీయులు స్థానం పొందారు. వెల్త్‌ఎక్స్ టాప్-50 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్ల సంపదతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల సంపదతో 43వ స్థానంలో, సన్ ఫార్మా అధిపతి దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో ఉన్నారు. ఇక 87.4 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
భారత్‌లో ఫోర్డ్ ‘మస్టాంగ్’ స్పోర్ట్స్ కారు!
దాదాపు 50 ఏళ్లకుపైగా చరిత్ర... అమెరికాలో చక్కని జనాదరణ ఉన్న స్పోర్ట్స్ కారు ‘మస్టాంగ్’ భారతీయ రోడ్లపై పరిగెత్తడానికి సిద్ధమవుతోంది. అమెరికా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ తాజాగా ఆరవ జనరేషన్ ‘మస్టాంగ్’ను వచ్చే ఏడాది భారత మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీన్ని ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఢిల్లీ ఆటో ఎక్స్‌పో-2016’లో ఆవిష్కరించనుంది.
ఈఐఎల్‌కు రెండున్నర రెట్లు సబ్‌స్క్రిప్షన్
డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో (ఈఐఎల్) 10 శాతం వాటాల విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి మెరుగైన స్పందన కనిపించింది. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తితో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) 2.54 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
రెండో విడత గోల్డ్ బాండ్లతో రూ.798 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రెండో విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా రూ.798 కోట్లను సమీకరించింది. రెండో విడతలో 3,071 కేజీల బంగారపు సబ్‌స్క్రిప్షన్ జరిగింది. తొలి విడత గోల్డ్ బాండ్ల సమీకరణ మొత్తంతో పోలిస్తే రెండో విడత మొత్తం మూడు రెట్లు అధికమని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. రెండో విడతలో మొత్తంగా దాదాపు 3.39 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తొలి విడత గోల్డ్ బాండ్ల ప్రక్రియలో 916 కేజీల బంగారానికి గానూ 62,169 దరఖాస్తులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా రూ.246 కోట్లను సమీకరించింది.
పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీ
పశ్చిమ తీరంలో భారీ రిఫైనరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఈఐఎల్ చేతులు కలుపుతున్నాయి. ఇవి దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద రిఫైనరీని నెలకొల్పనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మహారాష్ట్రలో దాదాపు 60 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
డీల్స్..
* ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తాజాగా స్పెషాల్టీ టీ సంస్థ టీబాక్స్‌లో పెట్టుబడులు పెట్టారు.
* అమెరికాకు చెందిన క్లౌడ్, ఎనలిటిక్స్ సర్వీసెస్ సంస్థ. బోకన్యి కంపెనీని హైదరాబాద్‌కు చెందిన కెల్టన్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
గతవారం బిజినెస్
Published Mon, Feb 1 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement
Advertisement