చెన్నైలో ఐబీఎం పబ్లిక్ డేటా సెంటర్
ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సర్వీసులు అందించే దిశగా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తాజాగా చెన్నైలో పబ్లిక్ డేటా సెంటర్‌ను ఆవిష్కరించింది. ఇది తమకు 42వ డేటా సెంటర్ అని ఐబీఎం క్లౌడ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ లెబ్లాంక్ తెలిపారు.
క్యాబ్ సంస్థల నియంత్రణకు నిబంధనలు
ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల సంస్థలను నియంత్రించే దిశగా కేంద్రం.. రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. యాప్ ఆధారిత సంస్థలను కూడా సాధారణ క్యాబ్ సంస్థల తరహాలోనే పరిగణించాలని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్ల నేపథ్యం తదితర వివరాలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని పేర్కొంది. గతంలో ఏదైనా తీవ్ర నేరంలో శిక్ష పడిన వారిని ఆయా సంస్థలు డ్రైవర్లుగా తీసుకోకూడదని స్పష్టం చేసింది.
ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎస్‌ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, తయారీ కంపెనీ వీ ఎల్ గోరే వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్’ రూపొందించిన ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్‌ప్లేసెస్’ జాబితాలో ఈ విషయం వెల్లడైంది.
ట్విటర్‌లో ఉద్యోగాల కోత
మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ మొత్తం ఉద్యోగ సిబ్బంది 4,100లో తొలగిస్తున్న ఉద్యోగుల వాటా 8 శాతంగా ఉంది. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్విటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్విటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్విటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
పీ-నోట్ల పెట్టుబడులు తగ్గాయ్
భారత క్యాపిటల్ మార్కెట్లో ఆగస్టులో పీ-నోట్ల పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్న పార్టిసిపేటరీ నోట్ల ద్వారా పెట్టుబడులు ఈ ఏడాది ఆగస్టులో రూ.2.53 లక్షల కోట్లకు తగ్గాయని సెబీ వెల్లడించింది. నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పీ-నోట్లకు సంబంధించిన నియమనిబంధనలను సమీక్షించాలని సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే.
11వ నెలా టోకు ద్ర వోల్బణం మైనస్‌లోనే!
టోకు ధరలకు సంబంధించి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -4.54% ఉంది. క్రూడ్ సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం దేశంలో టోకు ధరల క్షీణతకు కారణం.
భారత్‌లో ఐపీఓకు వొడాఫోన్ కసరత్తు
బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ తాజాగా తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి కొంత కసరత్తు మొదలైందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో తెలిపారు. పబ్లిక్ ఇష్యూని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నందున తాము ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని, కానీ ఐపీవో వైపే తాము మొగ్గు చూపుతున్నామని ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ ఎం స్టూడియో!
జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఎం స్టూడియోను ఏర్పాటు చేయనున్నది. బీఎండబ్ల్యూ కంపెనీ సూపర్ లగ్జరీ కార్లను ఎం స్టూడియో అవుట్‌లెట్ ద్వారా విక్రయిస్తోంది. ఇలాంటి అవుట్‌లెట్ దేశంలో ఒకటే, ముంబైలో ఉందని కంపెనీ తెలిపింది.
24 శాతం పడిపోయిన ఎగుమతులు
భారత ఎగుమతుల రంగానికి కష్టాలు తొలగిపోలేదు. 2014 సెప్టెంబర్ ఎగుమతులతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 24 శాతం పడిపోయాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 22 బిలియన్ డాలర్లు. 2014 సెప్టెంబర్‌లో 29 బిలియన్ డాలర్లు. ఇలాంటి క్షీణ ధోరణి గడచిన 10 నెలలుగా నెలకొంది.
ఈ-కామర్స్ రంగంలోకి పలు కంపెనీలు
పలు కంపెనీలు ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టాయి. ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ వెల్‌స్పన్ ఇండియా ‘షాప్‌వెల్‌స్పన్.ఇన్’ పేరుతో కొత్త ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. కాగా ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ టీబీజెడ్ (త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరి) డైమండ్ జ్యువెల్లరీ, బంగారు నాణేల విక్రయాల కోసం స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది.
భారత్‌లో బోయింగ్ హెలికాప్టర్ల అసెంబ్లింగ్!
అమెరికా విమానయాన దిగ్గజ కంపెనీ బోయింగ్ భారత్‌లో చినూక్ లేదా అపాచీ హెలికాప్టర్లను అసెంబుల్ చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఫైటర్ జెట్ విమానాల తయారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. భారత మార్కెట్ తమకు అత్యంత ముఖ్యమైనదని బోయింగ్ చైర్మన్ జిమ్ మ్యాక్‌నెర్నీ చెప్పారు.
భారత్‌లో చైనా శానీ గ్రూప్ పెట్టుబడులు
చైనాకు చెందిన నిర్మాణ రంగ పరికరాలు తయారు చేసే చైనాకు చెందిన శానీ గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. నవీకరణ ఇంధన, నిర్మాణ రంగ పరికరాల తయారీ, గృహ నిర్మాణ రంగాల్లో రూ.33,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని శానీ గ్రూప్ చైర్మన్ లియాంగ్ వెన్‌జెన్ చెప్పారు.
కాల్ డ్రాప్‌కి రూపాయి పరిహారం
కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో డ్రాప్ అయిన ప్రతి కాల్‌కి టెలికం కంపెనీలు రూ. 1 చొప్పున మొబైల్ యూజర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు గరిష్టంగా మూడు కాల్ డ్రాప్స్‌కి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
డీల్స్..
* ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డా లర్లుకు ఈఎంసీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది.
* ఫండ్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌క్యామ్)లో భాగస్వామ్య కంపెనీ నిప్పన్ లైఫ్ మరో 14 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 1,196 కోట్లు వెచ్చించింది. దీంతో ఆర్‌క్యామ్‌లో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి చేరింది.
* జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తన వాణిజ్య రుణాలు, లీజింగ్ వ్యాపారాలను 3,000 కోట్ల డాలర్లకు వెల్స్‌ఫార్గో కంపెనీకి విక్రయించనున్నది.
గతవారం బిజినెస్
Published Mon, Oct 19 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement