Jobs Cuttings
-
బైజూస్‌లో 3,500 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ (విద్యా సంబంధిత) బైజూస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థలోని వివిధ స్థాయిల్లో బృందాల క్రమబదీ్ధకరణకు తోడు ప్రాంతాల వారీ ప్రత్యేక దృష్టిని విస్తృతం చేయనుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో, దీనికి అనుగుణంగా బైజూస్ తన ఉద్యోగులను గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు ఆన్లైన్ విద్యకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోవడంతో దిద్దుబాటు చర్యలను చేపడుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికైతే తొలగింపులు లేవు. వివిధ యూనిట్ల పునర్నిర్మాణం, డిమాండ్‌పై అంచనా వేయడం కొనసాగుతోంది. ఇప్పటికి 1,000 మంది నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. మరో 1,000 మంది పనితీరు మెరుగుపరుచుకునే లక్ష్యా లను ఇంకా చేరుకోలేదు. ఈ అంచనా ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బైజూస్‌లో ఇదే చివరి తొలగింపులు అని, ఈ ప్రక్రియ అక్టోబర్ చివరికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని మరింత చురుగ్గా, అనుకూలంగా మార్చడం ఈ ప్రక్రియ వెనుక లక్ష్యమని తెలిపాయి. స్పష్టమైన జవాబుదారీ తనంతో నడిచే నిర్మాణం ఏర్పాటు చేయడంగా పేర్కొన్నాయి. వ్యాపార పునర్నిర్మాణం.. బైజూస్ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు. ‘‘వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉంది. నిర్వహణ తీరును మరింత సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించుకోవడం, మెరుగైన నగదు ప్రవాహాల కోసం దీన్ని చేపట్టాం. బైజూస్ కొత్త భారత సీఈవో అర్జున్ మోహన్ వచ్చే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పునరుద్ధరించిన, స్థిరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు’’అని వెల్లడించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన కొన్ని ఉత్పత్తులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై కే12 విద్య, ఇతర పోటీ పరీక్షల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రాంతీయ బృందాలు మరింత జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుందని, హైబ్రిడ్ మోడల్, ట్యూషన్ సెంటర్లపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. 2022 అక్టోబర్ నాటికి బైజూస్‌లో 50,000 మంది ఉండగా, తాజా ప్రక్రియ ముగిస్తే వీరి సంఖ్య 31,000–33,000కు తగ్గనుంది. -
కొలువుపోయి కొత్త కష్టాలు! అమెరికాలో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరం
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు. పరస్పర సాయం... ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్‌చేశారు. -
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
జెనీవా: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ. ► యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు. ► స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది. ► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది. ► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ► ఫ్రాన్స్‌లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి ► థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. ► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
గతవారం బిజినెస్
చెన్నైలో ఐబీఎం పబ్లిక్ డేటా సెంటర్ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సర్వీసులు అందించే దిశగా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తాజాగా చెన్నైలో పబ్లిక్ డేటా సెంటర్‌ను ఆవిష్కరించింది. ఇది తమకు 42వ డేటా సెంటర్ అని ఐబీఎం క్లౌడ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ లెబ్లాంక్ తెలిపారు. క్యాబ్ సంస్థల నియంత్రణకు నిబంధనలు ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల సంస్థలను నియంత్రించే దిశగా కేంద్రం.. రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. యాప్ ఆధారిత సంస్థలను కూడా సాధారణ క్యాబ్ సంస్థల తరహాలోనే పరిగణించాలని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్ల నేపథ్యం తదితర వివరాలన్నీ క్షుణ్నంగా పరిశీలించాలని పేర్కొంది. గతంలో ఏదైనా తీవ్ర నేరంలో శిక్ష పడిన వారిని ఆయా సంస్థలు డ్రైవర్లుగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ డెవలపర్ ఎస్ఏఎస్ ఇన్స్టిట్యూట్, తయారీ కంపెనీ వీ ఎల్ గోరే వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్’ రూపొందించిన ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్‌ప్లేసెస్’ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. ట్విటర్లో ఉద్యోగాల కోత మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విటర్ 336 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ మొత్తం ఉద్యోగ సిబ్బంది 4,100లో తొలగిస్తున్న ఉద్యోగుల వాటా 8 శాతంగా ఉంది. కంపెనీ వ్యయాలను తగ్గించే దిశగా ట్విటర్ సీఈవో జాక్ డార్సే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్విటర్ నిధుల కొరతతో సతమతమౌతోంది. ట్విటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సే ఇటీవలనే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పీ-నోట్ల పెట్టుబడులు తగ్గాయ్ భారత క్యాపిటల్ మార్కెట్లో ఆగస్టులో పీ-నోట్ల పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్న పార్టిసిపేటరీ నోట్ల ద్వారా పెట్టుబడులు ఈ ఏడాది ఆగస్టులో రూ.2.53 లక్షల కోట్లకు తగ్గాయని సెబీ వెల్లడించింది. నల్లధనంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పీ-నోట్లకు సంబంధించిన నియమనిబంధనలను సమీక్షించాలని సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. 11వ నెలా టోకు ద్ర వోల్బణం మైనస్‌లోనే! టోకు ధరలకు సంబంధించి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -4.54% ఉంది. క్రూడ్ సహా అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతుండడం దేశంలో టోకు ధరల క్షీణతకు కారణం. భారత్‌లో ఐపీఓకు వొడాఫోన్ కసరత్తు బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ తాజాగా తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి కొంత కసరత్తు మొదలైందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో తెలిపారు. పబ్లిక్ ఇష్యూని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నందున తాము ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని, కానీ ఐపీవో వైపే తాము మొగ్గు చూపుతున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ ఎం స్టూడియో! జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఎం స్టూడియోను ఏర్పాటు చేయనున్నది. బీఎండబ్ల్యూ కంపెనీ సూపర్ లగ్జరీ కార్లను ఎం స్టూడియో అవుట్లెట్ ద్వారా విక్రయిస్తోంది. ఇలాంటి అవుట్లెట్ దేశంలో ఒకటే, ముంబైలో ఉందని కంపెనీ తెలిపింది. 24 శాతం పడిపోయిన ఎగుమతులు భారత ఎగుమతుల రంగానికి కష్టాలు తొలగిపోలేదు. 2014 సెప్టెంబర్ ఎగుమతులతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 24 శాతం పడిపోయాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 22 బిలియన్ డాలర్లు. 2014 సెప్టెంబర్‌లో 29 బిలియన్ డాలర్లు. ఇలాంటి క్షీణ ధోరణి గడచిన 10 నెలలుగా నెలకొంది. ఈ-కామర్స్ రంగంలోకి పలు కంపెనీలు పలు కంపెనీలు ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టాయి. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ వెల్స్పన్ ఇండియా ‘షాప్వెల్స్పన్.ఇన్’ పేరుతో కొత్త ఆన్లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. కాగా ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ టీబీజెడ్ (త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి) డైమండ్ జ్యువెల్లరీ, బంగారు నాణేల విక్రయాల కోసం స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. భారత్‌లో బోయింగ్ హెలికాప్టర్ల అసెంబ్లింగ్! అమెరికా విమానయాన దిగ్గజ కంపెనీ బోయింగ్ భారత్‌లో చినూక్ లేదా అపాచీ హెలికాప్టర్లను అసెంబుల్ చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఫైటర్ జెట్ విమానాల తయారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. భారత మార్కెట్ తమకు అత్యంత ముఖ్యమైనదని బోయింగ్ చైర్మన్ జిమ్ మ్యాక్నెర్నీ చెప్పారు. భారత్‌లో చైనా శానీ గ్రూప్ పెట్టుబడులు చైనాకు చెందిన నిర్మాణ రంగ పరికరాలు తయారు చేసే చైనాకు చెందిన శానీ గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. నవీకరణ ఇంధన, నిర్మాణ రంగ పరికరాల తయారీ, గృహ నిర్మాణ రంగాల్లో రూ.33,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని శానీ గ్రూప్ చైర్మన్ లియాంగ్ వెన్‌జెన్ చెప్పారు. కాల్ డ్రాప్‌కి రూపాయి పరిహారం కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో డ్రాప్ అయిన ప్రతి కాల్కి టెలికం కంపెనీలు రూ. 1 చొప్పున మొబైల్ యూజర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు గరిష్టంగా మూడు కాల్ డ్రాప్స్‌కి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. డీల్స్.. * ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డా లర్లుకు ఈఎంసీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది. * ఫండ్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్క్యామ్)లో భాగస్వామ్య కంపెనీ నిప్పన్ లైఫ్ మరో 14 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 1,196 కోట్లు వెచ్చించింది. దీంతో ఆర్క్యామ్లో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి చేరింది. * జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తన వాణిజ్య రుణాలు, లీజింగ్ వ్యాపారాలను 3,000 కోట్ల డాలర్లకు వెల్స్‌ఫార్గో కంపెనీకి విక్రయించనున్నది.