న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ (విద్యా సంబంధిత) బైజూస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. సంస్థలోని వివిధ స్థాయిల్లో బృందాల క్రమబదీ్ధకరణకు తోడు ప్రాంతాల వారీ ప్రత్యేక దృష్టిని విస్తృతం చేయనుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ఆన్‌లైన్ విద్యకు డిమాండ్ పెరగడంతో, దీనికి అనుగుణంగా బైజూస్ తన ఉద్యోగులను గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు ఆన్‌లైన్ విద్యకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోవడంతో దిద్దుబాటు చర్యలను చేపడుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఇప్పటికైతే తొలగింపులు లేవు.
వివిధ యూనిట్ల పునర్‌నిర్మాణం, డిమాండ్‌పై అంచనా వేయడం కొనసాగుతోంది. ఇప్పటికి 1,000 మంది నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. మరో 1,000 మంది పనితీరు మెరుగుపరుచుకునే లక్ష్యా లను ఇంకా చేరుకోలేదు. ఈ అంచనా ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బైజూస్‌లో ఇదే చివరి తొలగింపులు అని, ఈ ప్రక్రియ అక్టోబర్ చివరికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. వ్యాపారాన్ని మరింత చురుగ్గా, అనుకూలంగా మార్చడం ఈ ప్రక్రియ వెనుక లక్ష్యమని తెలిపాయి. స్పష్టమైన జవాబుదారీ తనంతో నడిచే నిర్మాణం ఏర్పాటు చేయడంగా పేర్కొన్నాయి.
వ్యాపార పునర్‌నిర్మాణం..
బైజూస్ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు. ‘‘వ్యాపార పునర్‌నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉంది. నిర్వహణ తీరును మరింత సులభతరం చేయడం, వ్యయాలను తగ్గించుకోవడం, మెరుగైన నగదు ప్రవాహాల కోసం దీన్ని చేపట్టాం. బైజూస్ కొత్త భారత సీఈవో అర్జున్ మోహన్ వచ్చే కొన్ని వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పునరుద్ధరించిన, స్థిరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు’’అని వెల్లడించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన కొన్ని ఉత్పత్తులు పెద్దగా ఫలితం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై కే12 విద్య, ఇతర పోటీ పరీక్షల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నాయి. ప్రాంతీయ బృందాలు మరింత జవాబుదారీగా పని చేయాల్సి ఉంటుందని, హైబ్రిడ్ మోడల్, ట్యూషన్ సెంటర్లపై అధిక దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి. 2022 అక్టోబర్ నాటికి బైజూస్‌లో 50,000 మంది ఉండగా, తాజా ప్రక్రియ ముగిస్తే వీరి సంఖ్య 31,000–33,000కు తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment