వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి.
వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్‌ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు.
పరస్పర సాయం...
ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్‌ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్నారు.
మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment