IT workers
-
కొలువుపోయి కొత్త కష్టాలు! అమెరికాలో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరం
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి దెబ్బకు దిగ్గజ టెక్ సంస్థలు భారీగా తీసివేతలకు దిగడంతో భారత టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత నవంబర్ నుంచి ఏకంగా 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ సహా ఐటీ, సోషల్ మీడియా, ఆర్థిక సేవల సంస్థలు ఉద్యోగులను భారీగా తీసేస్తున్నాయి. వీరిలో 30 నుంచి 40 శాతం భారత టెకీలేనని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. వీరంతా హెచ్–1బీ, ఎల్1 వీసాల మీద అమెరికాలో పని చేస్తున్నావారే. 60 రోజుల్లోపు మరో ఉద్యోగం వెతుక్కోకుంటే వీరిని స్వదేశానికి పంపించేస్తారు. లేదంటే హెచ్–1బీ, ఎల్1 నుంచి వేరే కేటగిరీకి మార్చుకోక తప్పని పరిస్థితి! ‘‘మూణ్నెల్ల కింద అమెరికా వచ్చా. మార్చి 20న తప్పుకోవాలని చెప్పేశారు. నేను సింగిల్ పేరెంట్ను. నా పరిస్థితేమిటి?’’ అంటూ అమెజాన్ ఉద్యోగి ఒకామె వాపోయారు. వీరికి మరింత గడువివ్వాలని సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ భుతోరియా అన్నారు. పరస్పర సాయం... ఉన్నపళాన ఉద్యోగం కోల్పోయిన వారికి సాయపడేందుకు గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (జీఐటీపీఆర్ఓ) ముందుకొచ్చింది. వారికి, సంస్థలకు అనుసంధానకర్తగా ఉంటోంది. ఉద్యోగ ఖాళీల ప్రకటనలను షేర్ చేసుకుంటున్న వాట్సాప్ గ్రూప్‌లో వందలాది భారత టెకీలు సభ్యులుగా ఉన్నారు. తొలి అమెరికాకు వచ్చిన వారి వీసా స్టేటస్ మార్చేందుకు సాయపడుతూ కొందరు వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్నారు. మరోవైపు పులి మీద పుట్రలా తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టేలా కన్పిస్తున్నాయి. ఈ టెకీలను మోదీ సర్కార్ తక్షణం ఆదుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించాలంటూ సోమవారం హిందీలో ట్వీట్‌చేశారు. -
హెచ్ -1బి వీసాలపై కంపీట్ అమెరికా ఫిర్యాదు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను డొమొక్రాట్లు గట్టి దెబ్బతీసారు. మరోవైపు టాప్ ఐటీ కంపెనీలకు జారీ అయ్యే వీసాలపై ప్రముఖ ఐటీ కంపెనీల సంఘం కంపీట్ అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సర్కార్ హయాంలో విదేశీ ఐటీ నిపుణులకిచ్చే హెచ్ 1బీ వీసాల జారీ నిలుపుదల సంఖ్య బాగా పెరిగిందని తేల్చి చెప్పింది. ఈ సంఘంలో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని కంపీట్ అమెరికా తెలిపింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో యూఎస్సీఐఎస్ వద్ద హోల్డ్‌లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. అంతేకాదు అయితే ట్రంప్ యంత్రాగం ఆధ్వర్యంలో హెచ్-1బీ వీసాల న్యాయ విచారణ పద్ధతుల్లో మూడు ప్రధానమైన మార్పులు గమనించామని కంపీట్ అమెరికా పేర్కొంది. న్యాయపరమైన నిబంధనలలో చాలా అసమానతలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్ట్ జెన్ నీల్సన్, యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా కంపీట్ అమెరికా నవంబరు 1వ తేదీన ఒక లేఖ రాసింది. ఈ విధానం యజమానులను గందరగోళంలో పడవేస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. యూఎస్సీఐఎస్ పద్ధతులు, నిబంధనల పట్ల కంపెనీలకు సరైన అవగాహన లేకుండా పోయిందనీ, ఈ అనిశ్చితి వల్ల అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్న కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. గత 18 నెలల్లో కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లు, దరఖాస్తుల తిరస్కరణలు బాగా పెరిగిపోయాయని వెల్లడించింది. కాగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్-1బీ వీసా చట్టాల్లో పలు మార్పులను తీసుకొవస్తున్నసంగతి తెలిసిందే. ఈ హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేసే విదేశీయులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులను భారీగా ప్రభావితం చేస్తోంది. -
49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం
శాన్ ఫ్రాన్సిస్కో: ట్రంప్ సంస్కరణల నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్శిటీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా కొంతమంది ఔట్సోర్సింగ్ ఐటీ ఉద్యోగులను తొలగించింది. ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలందిస్తున్న 49మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఈ పనిని ఇండియా ఆధారిత ఔట్సోర్సింగ్ కంపెనీకి అప్పగించడం విమర్శలకు దారి తీసింది. పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చుల కారణంగా ఈ తొలగింపు అనివార్యమైందని విశ్వ విద్యాలయం ప్రతినిది ఒకరు తెలిపారు. 49 మంది సిబ్బంది తొలగింపుతోపాటు, ఖాళీగా ఉన్న లేదా కాంట్రాక్టర్లద్వారా నియమితులైన మరో 48 మందినికూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. యూనివర్శిటీ నిర్ణయంతో సాఫీగా, సెక్యూర్డ్‌గా సాగిపోతున్న కంప్యూటర్ నెట్ వర్క్‌లకు అంతరాయం కలుగుతుందని తొలగించిన యూనివర్శిటీ సిస్టం అడ్మినిస్ట్రేటర్ కుర్ట్ హో(58) వ్యాఖ్యానించారు. బే ఏరియాలో పాతికేళ్లుగా తాను ఐటీ సేవల్లో ఉన్నట్టు తెలిపారు. ఐటి సేవల్లో పెరుగుతున్న అవుట్సోర్సింగ్ ధోరణి ఆందోళన కలిగిస్తుందన్నారు. అమెరికా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో గ్లోబలైజేషన్ అండ్ ఔట్సోర్సింగ్ హాట్ టాపిక్ మారాయి. దీంతో యజమానులు ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రపంచంలోని దూర ప్రాంతాల్లో ఉండే తక్కువ వేతనానికి పనిచేసే ఉద్యోగులకోసం ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, పరిశోధన పై దృష్టిపై పనిచేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయా వనరులను పెంచుకోవడానికి అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది జులైలో భారతదేశం ఆధారిత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఐదేళ్లకు గాను 50 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే రాబోయే ఐదేళ్లలో 30మిలియన్ డాలర్లను పొదుపు చేసే ఆలోచనలోఉన్నట్టు ప్రకటించింది. అలాగే దేశీయ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ కు పోకుండా బాధ్యత తీసుకున్నట్టు యూనివర్శిటీ సెనేటర్ డయానే గత ఏడాది ప్రకటించారు. ఈ మేరకు సంస్కరణలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.