ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా యు.ఎస్ కంపెనీ చరిత్రలో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద కోల్పోయిన ఒక రోజు తర్వాత అమెజాన్ అందుకు భిన్నంగా ఒకే రోజు భారీగా సంపాధించింది. ఆన్ లైన్ రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ త్రైమాసిక నివేదిక తర్వాత కంపెనీ షేర్లు 13.5% పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్(రూ.14.18 లక్షల కోట్లు) డాలర్లు పెరిగింది. జనవరి 28న వెలువడిన ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్రైమాసిక నివేదిక తర్వాత ఆ కంపెనీ ఒక్కరోజులో స్టాక్ మార్కెట్లో $181 బిలియన్ లాభాన్ని ఆర్జించింది.
తాజాగా, ఈ రికార్డును అమెజాన్ 190 బిలియన్ డాలర్లతో అధిగమించింది. ఆ ఈ-కామర్స్ సంస్థ షేర్లు భారీగా పెరగడంతో అమెజాన్ నికర విలువ ఇప్పుడు సుమారు 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఫలితాలు మెప్పించడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వం ధరలను పెంచనున్నట్లు ప్రకటించడమే అమెజాన్ షేర్ల ర్యాలీకి కారణంగా తెలుస్తోంది. అమెజాన్ ఒక్కరోజులో పోగేసుకున్న సంపద ఏటీఅండ్ టీ, మోర్గాన్ స్టాన్లీ, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువతో సమానం కావడం గమనార్హం. ఆపిల్, మైక్రోసాఫ్ట్ కార్ప్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్.. వాల్ స్ట్రీట్ అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి. ఆపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.8 ట్రిలియన్లు, మైక్రోసాఫ్ట్ కార్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $2.3 ట్రిలియన్లు, గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $1.9 ట్రిలియన్లుగా ఉన్నాయి.
(చదవండి: ఇక సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయా?)
Comments
Please login to add a commentAdd a comment