ఎయిర్‌పోర్ట్స్‌లోకి భారీ పెట్టుబడులు!
ఎయిర్‌పోర్ట్స్ విభాగంలోకి వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 6 బిలియన్ డాలర్లమేర (దాదాపు రూ.40,000 కోట్లు) పెట్టుబడులు రావొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే అభిప్రాయపడ్డారు. అపార వృద్ధి అవకాశాలున్న దేశీ విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఇటీవల కొత్త పౌరవిమానయాన పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
గ్లోబల్ టాప్-10లో ఆర్‌ఐఎల్
ప్రపంచంలోని టాప్-10 ఎనర్జీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది ఇది 14వ స్థానంలో ఉండేది. ప్లాట్స్ నిర్వహించిన ‘టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలు-2016’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఆయిల్ కార్ప్ 66వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకింది. ఇక హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ 133వ స్థానం నుంచి 48వ స్థానానికి చేరింది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటమే వీటి స్థానాల మెరుగుదలకు కారణమని ప్లాట్స్ పేర్కొంది. ఓఎన్‌జీసీ స్థానం మాత్రం 17 నుంచి 20కి పడింది. కోల్ ఇండియా 38వ స్థానంలో ఉంది. ఇక అదాని పవర్ 250వ స్థానంలో నిలిచింది.
ఐపీవోకు బీఎస్‌ఈ దరఖాస్తు
ఆసియాలోనే అతి పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా పేరొందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తు పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించనుంది. బీఎస్‌ఈలో ప్రస్తుత వాటాదారులైన సింగపూర్ ఎక్స్ఛేంజ్, మారిషస్ కేంద్రంగా పనిచేసే అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ క్వాంటమ్ ఫండ్, అటికస్ సంస్థలు తమకున్న 2.99 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో పూర్తిగా విక్రయించనున్నాయి. అలాగే, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, కాల్డ్‌వెల్ ఇండియా హోల్డింగ్స్, అకాసియా బన్యన్ పార్ట్‌నర్స్ సైతం తమకున్న వాటాల్లో కొద్ది మేర విక్రయించనున్నాయి.
కార్ల విక్రయాలు 10 శాతం అప్
దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు వరుసగా 14వ నెలలోనూ పెరిగాయి. తాజాగా ఆగస్ట్‌లో వీటి అమ్మకాలు 17 శాతంమేర ఎగశాయి. దీంతో సియామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తన వ ృద్ధి అంచనాలను 10-12 శాతానికి సవరించింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఆగస్ట్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2,58,722 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గతేడాది ఇదే నెలలో 2,21,743 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 1,62,360 యూనిట్ల నుంచి 1,77,829 యూనిట్లకు ఎగశాయి.
మొబైల్ యూజర్లు 103.5 కోట్లు
దేశంలోని మొబైల్ యూజర్ల సంఖ్య జూన్ చివరకి 103.5 కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ టాప్-5 టెలికం కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకుంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. మొత్తం టెలికం కస్టమర్ల సంఖ్య (వైర్‌లెస్, వైర్‌లైన్) 105.9 కోట్లుగా ఉంది. మే నెలలో 103.3 కోట్లుగా ఉన్న మొబైల్ సబ్‌స్క్రైబర్ల (వైర్‌లెస్) సంఖ్య జూన్ చివరకి 0.19 శాతం స్వల్ప వృద్ధితో 103.5 కోట్లకు ఎగసింది. ఇదే సమయంలో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.48 కోట్ల నుంచి 2.47 కోట్లకు తగ్గింది.
19 నుంచి ఐసీఐసీఐ ప్రు. లైఫ్ ఐపీవో
జీవిత బీమా రంగం నుంచి తొలిసారిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతుంది. ఈ ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.300 - రూ.334గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ.6,000 కోట్ల నిధులను సమీకరించనుంది.
టాటా మోటార్స్‌కి రూ.900 కోట్ల ఆర్డర్లు
దేశీ దిగ్గజ వాణిజ్య వాహన (సీవీ) తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు తాజాగా రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. దాదాపు 25 స్టేట్ /సిటీ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఎస్‌టీయూ) నుంచి తమకు 5,000కు పైగా బస్సుల తయారీకి ఆర్డర్లు వచ్చాయని, వీటి విలువ రూ.900 కోట్లు ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. సీవీ ప్యాసింజర్ విభాగంలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ చర్య తమకు దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.
ప్రీమియం కాఫీ బిజినెస్‌లోకి ఐటీసీ
దేశీ బహుళజాతి సంస్థ ఐటీసీ ఫుడ్స్ తాజాగా ప్రీమియం కాఫీ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా సన్‌బీన్ గౌర్మెట్ కాఫీని నికమలై, పనగిరి అనే రెండు వేరియంట్లలో మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త కాఫీ వేరియంట్లు కేవలం ఐటీసీ లగ్జరీ హోటల్స్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు ఈ కాఫీ వేరియంట్లను హోటల్స్‌లో ఉండే ఫుడ్ అండ్ బేవరేజ్ ఔట్‌లెట్స్‌లో 200 గ్రాముల ప్యాకెట్‌కు రూ.800లు వెచ్చించి కొనుగోలు చేయవచ్చని ఐటీసీ పేర్కొంది.
అశోక్ లేలాండ్‌తో నిస్సాన్ దోస్తీ కట్
జపాన్ వాహన దిగ్గజం నిస్సాన్‌తో ఎనిమిదేళ్ల అశోక్ లేలాండ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇరు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు జాయింట్ వెంచర్ల(జేవీ) నుంచి వైదొలగాలని నిస్సాన్ మోటార్ కంపెనీ నిర్ణయించింది. ఈ మూడు జేవీల్లో తమ వాటాలను అశోక్ లేలాండ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది.
వచ్చే నెల 7 నుంచి దేశంలో ఐఫోన్-7
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్‌ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్స్ పలు దేశాల్లో సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్స్ 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 స్క్రీన్ పరిమాణం 4.7 అంగుళాలు, ఐఫోన్ 7 ప్లస్ స్క్రీన్ పరిమాణం 5.5 అంగుళాలుగా ఉంది. యాపిల్ తాజాగా ఐఫోన్ 7 ఆవిష్కరణ తర్వాత తన ఇండియా వెబ్‌సైట్ నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్, ఐఫోన్ 5ఎస్ మోడళ్లను తొలగించింది.
డీల్స్..
* జపాన్‌కు చెందిన అగ్రగామి సంస్థ ఫ్యుజి ఎలక్ట్రిక్ ఫరీదాబాద్‌కు చెందిన జెమ్‌కో క్రంటోల్స్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఫ్యుజి జెమ్‌కో ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థలో ఫ్యుజికి 51 శాతం, జెమ్‌కోకు 49 శాతం చొప్పున వాటా ఉంటుంది. జెమ్‌కో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, పవర్ కంట్రోల్స్ సిస్టమ్స్ తయారీలో ఉన్న సంస్థ.
* ఆన్‌లైన్ ప్రకటనల పోర్టల్ క్వికర్, స్టెప్‌నీని బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. కారు యజమానులను, సమీపంలోని కారు సర్వీసు కేంద్రాలతో అనుసంధానానికి వీలు కల్పించేదే స్టెప్‌నీ.
* మహీంద్రా అండ్ మహీంద్రా, క్యాబ్ సేవల సంస్థ ఓలా మధ్య కీలక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగా ఓలా డ్రైవర్లకు మహీంద్రా నుంచి 100 శాతం రుణ సాయం అందుతుంది. కొత్తగా కొనుగోలు చేసే కార్లకే కాకుండా ఇప్పటికే కార్లను కలిగి ఉన్న వారికి సైతం రుణాలు లభిస్తాయి. అలాగే మహీంద్రా ఇన్సూరెన్స్ విభాగం నుంచి డ్రైవర్లకు తక్కువ ప్రీమియంకే బీమా పథకాలు లభిస్తాయి.
గతవారం బిజినెస్
Published Mon, Sep 12 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
Advertisement
Advertisement