మార్కెట్‌కు  దేశీ ఇంధనం! | DIIs had a share of 16. 9percent compared to 17. 2percent of FPIs | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు  దేశీ ఇంధనం!

Published Fri, Feb 7 2025 12:31 AM | Last Updated on Fri, Feb 7 2025 12:31 AM

DIIs had a share of 16. 9percent compared to 17. 2percent of FPIs

విదేశీ ఇన్వెస్టర్లకు దేశీ ఫండ్స్‌ చెక్‌

ఇటీవల స్టాక్స్‌లో డీఐఐల భారీ పెట్టుబడులు 

ఎఫ్‌పీఐల అమ్మకాలను మించుతున్న కొనుగోళ్లు 

ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో 16.9% వాటా

17.2%కి దిగివచ్చిన  ఎఫ్‌పీఐల వాటా

సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్‌పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్‌ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్‌పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.

దేశీ లిస్టెడ్‌ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్‌íÙప్‌లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తూ దేశీ స్టాక్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్‌ మారుతోంది. 

గత నాలుగేళ్లుగా బుల్‌ ట్రెండ్‌తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్‌ నుంచి ఎఫ్‌పీఐలు యూటర్న్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.

2015తో పోలిస్తే 
2025లో ఎఫ్‌పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో 2024 డిసెంబర్‌కల్లా ఎఫ్‌పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్‌ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్‌పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్‌ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్‌పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

ఫండ్స్‌ ఆధిపత్యం 
డీఐఐలలో మ్యూచువల్‌ ఫండ్స్‌దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక 2024 అక్టోబర్‌–డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్‌పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్‌పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్‌ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువలో మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!

రిటైలర్ల బలమిది 
ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్‌ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్‌కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్‌ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్‌ చేశాయి. 2024 చివరి క్వార్టర్‌లో రిటైలర్లు స్టాక్స్‌లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు! ఈ జోష్‌తో గతేడాది 91 కంపెనీలు  ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!

జనవరిలో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లు
దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు  
అక్టోబర్‌–డిసెంబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు  
ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు   

–సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement