గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Feb 29 2016 12:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

Last week Business

కొత్తగా ఐదు నిఫ్టీ స్టాక్ సూచీలు
ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా కొత్తగా ఐదు స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) గ్రూప్ సంస్థ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్‌ఎల్) తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సూచీలతో కలుపుకొని స్టాక్ సూచీల సంఖ్య 11కు చేరుతుందని పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250, నిఫ్టీ ఫుల్ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 50, నిఫ్టీ పుల్ స్మాల్ క్యాప్ 100-ఈ ఐదు కొత్త స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ నెక్స్‌ట్ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 సూచీలున్నాయి.
 
కార్డులతో చెల్లింపులకు సర్‌చార్జీలు రద్దు!
క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది.
 
మళ్లీ మారుతీ టాప్
దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది.
 
పీఎన్‌బీ రుణ ఎగవేతదార్ల జాబితా విడుదల
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)... భారీ మొండిబకాయిల చిట్టాను ప్రకటించింది. తమ బ్యాంకులో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) కంపెనీలు 904 ఉన్నాయని వెల్లడించింది. ఈ మొత్తం సంస్థల రుణ బకాయిల విలువ గతేడాది డిసెంబర్ చివరినాటికి 10,870 కోట్లుగా పీఎన్‌బీ పేర్కొంది. జాబితాలో విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ, జూమ్ డెవలపర్స్, నాఫెడ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి.
 
బ్యాంక్ షేర్లు తగ్గించుకుంటున్న ఫండ్స్
మొండి బకాయిలు భారీగా పెరిగిపోతుండటడంతో బ్యాంక్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకుంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల నుంచి గత నెలలో  రూ.6,662 కోట్లు ఉపసంహరించుకోవడంతో ఆ షేర్లలో పెట్టుబడులు రూ.78,600 కోట్లకు పడిపోయాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ తెలిపింది.
 
ఐటీ హార్డ్‌వేర్‌తో 4 లక్షల ఉద్యోగాలు!
దేశీ ఐటీ హార్డ్‌వేర్ రంగం ఉపాధి కొలువుగా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో నోట్‌బుక్, డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు సహా తదితర వస్తువుల తయారీకి చేయూతనందించేలా పన్ను సుంకాలను తగ్గిస్తే.. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య ‘మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎంఏఐటీ) తన నివేదికలో పేర్కొంది.
 
ఎన్‌టీపీసీ ఆఫర్‌తో 5 వేల కోట్లు
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)కి రూ. 5,030 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూలో మూడింట రెండొంతుల షేర్లను బీమా సంస్థలు దక్కించుకున్నాయి. సింహభాగం షేర్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ), బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సంపన్న ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది.
 
కుబేర భారతీయుడు.. ముకేశ్ అంబానీ
అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 30 శాతం వృద్ధితో 2,600 కోట్ల డాలర్లకు పెరిగిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016 వెల్లడించింది. ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 8,000 కోట్ల డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 111కు పెరిగిందని, అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదేనని ఈ జాబితా  తెలిపింది.
 
వృద్ధికి రైల్వే కూత
కేంద్ర ప్రభుత్వం 2016-17కు సంబంధించి గురువారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. మూడు కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్‌పూర్-ముంబై), ఈస్ట్‌కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు.
 
30 నెలల కనిష్టానికి రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి  డాలర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో గురువారం రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు.
 
ఎల్‌ఐసీ.. సెన్సెక్స్ షేర్ల కొనుగోలు జోరు
ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఈ క్యూ3లో సెన్సెక్స్ కంపెనీ షేర్లను జోరుగా కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక కాలానికి రూ.10,415 కోట్ల విలువైన 18 సెన్సెక్స్ కంపెనీల షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. అలాగే రూ.7,300 కోట్ల విలువైన సెన్సెక్స్ కంపెనీల షేర్లను విక్రయించింది. దీంతో నికర కొనుగోళ్లు రూ.3,115 కోట్లుగా ఉన్నాయి. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే ఎల్‌ఐసీ అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. ఈ కంపెనీలో 4.26 శాతం వాటాకు సమానమైన షేర్లను కొనుగోలు చేసింది.
 
జికా కాదు టియాగో
టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హ్యాచ్‌బాక్ జికా  పేరును ‘టియాగో’గా మార్చింది. ఇటీవల కాలంలో  జికా వైరస్ ప్రబలడంతో ఈ హ్యాచ్‌బాక్‌కు అంతకు ముందు నిర్ణయించిన జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెంటాస్టికో నేమ్ హంట్ పేరుతో కొత్త పేర్లను కంపెనీ నెటిజన్ల నుంచి ఆహ్వానించింది. అందులో టియాగో, సివెట్, అడోర్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, ఓటింగ్ ద్వారా టియాగో పేరును ఖరారు చేశామని పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా టియాగో(జికా) హ్యాచ్‌బాక్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ పేర్కొంది.
 
ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకులకు మెజార్టీ వాటా
ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్‌ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్‌సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది.
 
డీల్స్..
* మహేంద్ర నహతా ప్రమోట్ చేసిన మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో దాదాపు 5 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఓజస్వి ట్రేడింగ్ కంపెనీ మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో 5.25 కోట్ల షేర్లను గత వారంలో మూడు వేర్వేరు బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసింది. దీంతో మీడియా మెట్రిక్స్ వరల్డ్‌వైడ్‌లో ఓజస్వి ట్రేడింగ్ వాటా 4.63 శాతానికి చేరింది.
* రిలయన్స్ క్యాపిటల్.. కమర్షియల్ ఫైనాన్స్ విభాగాన్ని తన అనుబంధ కంపెనీకి బదలాయిస్తోంది. ఈ బదలాయింపు తర్వాత కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ(సీఐసీ)గా తమను నమోదు చేయాలని ఆర్‌బీఐకు దరఖాస్తు చేస్తామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. ఫలితంగా, భవిష్యత్తులో ఆర్‌బీఐ నిబంధనలను సరళీకరిస్తే బ్యాంక్ లెసైన్స్ పొందే వీలు కలుగుతుందని రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ శామ్ ఘోష్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement