భారీ నిక్షేపాలు కనుగొన్న ఓఎన్‌జీసీ
ఓఎన్‌జీసీ అరేబియా సముద్రంలో భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అరేబియా సముద్రంలోని ముంబై హై చమురు క్షేత్రాల్లో ఓఎన్‌జీసీ ఈ నిక్షేపాలను కనుగొన్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ ఆవిష్కరణల్లో 29.74 మిలియన్ టన్నుల ఆయిల్, ఆయిల్ సమానమైన గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఐటీలో 2 లక్షల ఉద్యోగాలు!!
ప్రస్తుత ఏడాది ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలున్నాయి. ’ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ బిజినెస్‌లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి’ అని టీమ్‌లీజ్ వివరించింది.
ఎస్‌బీఐ రుణ రేట్లు తగ్గాయ్..
ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకగా ఎస్‌బీఐ.. బేస్ రేటు బీపీఎల్‌ఆర్‌ను 0.3 శాతం మేర తగ్గించింది. దీంతో పాత వడ్డీ రేట్ల విధానంలో రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత కస్టమర్లకు బేస్ రేటును 8.95 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్‌ఆర్) 13.70 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గించింది.
ఎస్‌బీఐ కనీస నిల్వ వడ్డింపులు 1,772 కోట్లు
బ్యాంక్ ఖాతాల్లో నెలవారీ కనీస మొత్తం నిల్వ నిబంధనను పాటించని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఎస్‌బీఐ భారీగానే సొమ్ములు రాబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఈ జరిమానాలు రూ.1,772 కోట్లకు పెరిగాయి. ఈ బ్యాంక్ సాధించిన రెండో క్వార్టర్ నికర లాభం (రూ.1,582 కోట్లు) కన్నా ఈ మొత్తం అధికం కావడం విశేషం.
ఇన్ఫీ సీఈవోగా పరేఖ్ బాధ్యతల స్వీకరణ
దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ’ఇన్ఫోసిస్’ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన వార్షికంగా రూ.18.6 కోట్ల మేర జీతభత్యాలు అందుకోబోతున్నారు. సంస్థ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో స్థిరమైన వార్షిక వేతనం రూ.6.5 కోట్లు కాగా, మిగతాది పనితీరు ఆధారితంగా (వేరియబుల్) ఉండనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నుంచి ఈ ప్యాకేజీ అమలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment