గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, May 9 2016 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

Last week Business

మౌలిక పరిశ్రమల మెరుపు
ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4% వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదు చేసుకోకపోగా -0.7% క్షీణతను నమోదు చేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38%. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది.
 
సౌదీలో విప్రో ఉమెన్ బిజినెస్ పార్క్

ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ సౌదీ అరేబియాలోని రియాద్‌లో అందరూ మహిళలే ఉద్యోగులుగా ఉండే ఉమెన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ పార్క్(డబ్ల్యూబీపీ)ను సోమవారం ప్రారంభించింది. ప్రిన్సెస్ నౌరాహ్ యూనివర్శిటీ(పీఎన్‌యూ), సౌదీ అరామ్‌కో భాగస్వామ్యంతో ఈ డబ్ల్యూబీపీని ఏర్పాటు చేశామని విప్రో అనుబంధ సంస్థ విప్రో అరేబియా పేర్కొంది. ఈ ఉమెన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ పార్క్ 2025 కల్లా 21,000 ఉద్యోగాలు కల్పించనున్నదని అంచనా.
 
టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు

వాహన విక్రయాలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్)లో జోరుగా సాగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా సహా పలు కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ అమ్మకాలు మాత్రం పతనమయ్యాయి. టూవీలర్ కంపెనీలు హీరో మోటొకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీల  విక్రయాలు కూడా బాగా పెరగ్గా బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి.

ఆసియాకు భారత్ వృద్ధి దన్ను
భారత్ పటిష్టంగా వృద్ధి చెందుతుండటంతో అది ఆసియా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకోవ్ అభిప్రాయపడ్డారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ 2016లో ఆసియా వృద్ధి రేటు 5.7 శాతంగా ఉంటుందని తెలియజేశారు. ఏడీబీ 49వ వార్షిక సమావేశం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు.
 
టయోటా నుంచి కొత్త ఇన్నోవా క్రిస్టా
ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను దశాబ్ద కాలం తర్వాత అప్‌డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
 
స్వల్పంగా తగ్గిన ఎస్‌బీఐ రుణ రేటు

ఎస్‌బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గింది. తాజా తగ్గింపు ప్రకారం.. మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.40 శాతంగా ఉంటుంది. మహిళా కస్టమర్ల విషయంలో ఈ రుణ రేటు 9.35 శాతంగా ఉంది. కారు రుణ రేటు కూడా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఎన్‌ఆర్‌ఐ కార్ లోన్స్, ఎస్‌బీఐ కాంబో రుణ పథకం, ఎస్‌బీఐ లాయల్టీ కార్ లోన్ స్కీమ్‌లకు తాజా నిర్ణయం వర్తిస్తుంది.
 
డాయిష్ ఫండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన సెబీ
సెబీ.. డాయిష్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. డాయిష్ ఎంఎఫ్ తన పథకాలన్నింటినీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా మ్యూచువల్ ఫండ్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో సెబీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. డాయిష్ ఎంఎఫ్ దేశీ అసెట్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌ను ప్రమెరికా ఎంఎఫ్ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ రద్దు నేపథ్యంలో డాయిష్ ఎంఎఫ్ ఇక నుంచి ఎంఎఫ్‌గా, ట్రస్టీగా, ఏఎంసీగా ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకూడదని సెబీ ఆదేశించింది.
 
అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం పన్నుపై వీడిన అస్పష్టత
అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ‘క్యాపిటల్ గెయిన్’గా పరిగణించి దానిపై పన్ను విధించడం జరుగుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రం బోర్డ్ (సీబీడీటీ)  వివరణ ఇచ్చింది. హోల్డింగ్ కాలంతో సంబంధం లేకుండా పన్ను అమలవుతుందని వివరించింది. అన్‌లిస్టెడ్ షేర్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయం క్యాపిటల్ గెయిన్స్ కిందకు వస్తుందా లేదా బిజినెస్ ఆదాయంగా పరిగణించాలా అన్న అంశంపై ఇప్పటివరకూ నెలకొన్న సందిగ్ధత తాజా సీబీడీటీ నిర్ణయంతో తొలగిపోయింది.  
 
దివాలా బిల్లుకు లోక్‌సభ ఓకే
వందేళ్లకు పైగా మార్పులకు నోచుకోకుండా అమల్లో ఉన్న దివాలా చట్టాలు కనుమరుగు కానున్నాయి. వీటన్నిటి స్థానంలో అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న ‘దివాలా కోడ్-2016’కు గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే... ఇది చట్టరూపం దాలుస్తుంది.
 
ఎన్‌డీబీతో ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఓయూ

బ్రిక్స్ దేశాలు ప్రమోట్ చేస్తున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ)తో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బాండ్ల జారీ, ట్రెజరీ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో భాగస్వామ్యం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఎన్‌డీబీతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత బ్యాంక్‌గా ఐసీఐసీఐ బ్యాంక్.
 
మళ్లీ మింత్రా డెస్క్‌టాప్ వెబ్‌సైట్
ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రా.. ఏడాది క్రితం మూసేసిన తన డెస్క్‌టాప్ వెర్షన్‌ను జూన్ 1 నుంచీ తిరిగి ప్రారంభించనుంది.  ఏడాదిగా కేవలం మొబైల్ యాప్‌పై వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విభాగమైన మింత్రా తిరిగి తన డెస్క్‌టాప్ వెర్షన్‌కు మొగ్గుచూపింది.
 
2 బిలియన్ డాలర్లకు ఐటీ ఇన్‌ఫ్రా మార్కెట్!
దేశీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఈ ఏడాది స్వల్ప వృద్ధితో 1.93 బిలియన్ డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా వేసింది. ఇది 2020 నాటికి 2.13 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. కాగా గతేడాది ఈ మార్కెట్ 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. సర్వర్లు, స్టోరేజ్, ఎంటర్‌ప్రై జ్ నెట్‌వర్కింగ్ ఉపకరణాలన్నీ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరిధిలోకి వస్తాయి.
 
డీల్స్..
* నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్  1,000 మెగావాట్ల పవర్ ప్లాం ట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.6,500 కోట్లు.
* వర్చువల్ రియాలిటీ స్టార్టప్ వొలోబ్ టెక్నాలజీస్‌ను గిర్నార్ సాఫ్ట్ కొనుగోలు చేసింది. కార్‌దేఖో.కామ్, గాడి.కామ్, జిగ్‌వీల్స్.కామ్ వంటి వాహన పోర్టళ్లను నిర్వహిస్తున్న గిర్నార్ కంపెనీ వొలోబ్ టెక్నాలజీస్‌ను ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది తెలియలేదు.
* అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాలో అదనంగా 23% వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు విదేశీ భాగస్వామ్య సంస్థ అవీవా వెల్లడించింది. దీంతో వాటాలు గరిష్ట పరిమితి 49 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement