గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, May 16 2016 3:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

Last week Business

నియామకాలు
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌గా అశోక్ చావ్లా నియమితులయ్యారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. చావ్లా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈయన 2019 మార్చి 27 వరకు పదవిలో కొనసాగనున్నారు. చావ్లా నియామకం మే 3 నుంచి అమల్లోకి వచ్చింది.
 
పరిశ్రమల పేలవ పనితీరు
పరిశ్రమల ఉత్పత్తి గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చి) నత్తనడకన సాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 2.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014-15లో ఈ రేటు 2.8 శాతం. గురువారం మార్చి గణాంకాలు వెళ్లడికావడంతో... ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరు స్పష్టమైంది. ఒక్క మార్చిని చూస్తే... వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదయ్యింది.
    
రిటైల్ ద్రవ్యోల్బణం పైకి
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో మళ్లీ మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. 5.39 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 5.69 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాత రెండు నెలల్లో 5.18 శాతంగా, 4.83 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆహార ధరలు ఎగయడం కారణంగా ఉంది.
    
ఎగుమతులు 17వ  ‘సారీ’

భారత్ ఎగుమతులు క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధి లేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి నమోదుకావడం వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు 23 శాతం క్షీణతతో  25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
   
పరోక్ష పన్ను వసూళ్ల శుభారంభం
పరోక్ష పన్నుల విభాగం కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో (2016-17 ఏప్రిల్-మార్చి) శుభారంభాన్ని ఇచ్చింది. వసూళ్లు 42 శాతం పెరిగాయి. 2015-16 ఇదే నెలలో రూ. 45,417 కోట్లుగా ఉన్న ఈ విభాగం వసూళ్లు తాజా సమీక్షా నెలలో రూ.64,394 కోట్లకు చేరాయని ఒక అధికార ప్రకటన పేర్కొంది.
   
టాటా యూకే ప్లాంట్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్  చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ప్లాంట్‌ల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది. వృద్ది వ్యూహంలో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. యూకే ప్లాంట్ల కొనుగోలుకు ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది.  
    
మాల్యాను బహిష్కరించలేం
బ్యాంకింగ్ రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే ఆయనపై ఉన్న కేసులు, తీవ్ర అభియోగాలకు సంబంధించి ఆయన ‘అప్పగింత’ను భారత్ కోరవచ్చని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
    
కాల్ డ్రాప్స్‌పై టెల్కోలకు ఊరట
కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని,  తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
    
భారీగా తగ్గిన పసిడి డిమాండ్
భారత్‌లో పసిడి డిమాండ్ 2016 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారీగా పడిపోయింది. 2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే.. 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎకై ్సజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
   
కరువు భారం రూ.6.5 లక్షల కోట్లు!
భారత్‌లోని 10 రాష్ట్రాల్లోని కరువు ఆర్థిక వ్యవస్థపై కనీసం రూ.6.5 లక్షల కోట్ల భారం మోపనున్నదని అసోచామ్ అంచనా వేస్తోంది.  ఈ 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాల్లో 33 కోట్ల మంది కరువు బారిన పడ్డారని అసోచామ్ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్లలో నీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటడం.. కరువు పీడిత ప్రాంతాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించింది.
    
డీటీఏసీ సవరణకు భారత్-మారిషస్ ఓకే
ద్వంద్వ పన్ను నివారణా ఒప్పందం (డీటీఏసీ) సవరణ ఒప్పందంపై భారత్-మారిషస్ సంతకాలు చేశాయి. మారిషస్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ భారత్ రెసిడెంట్ కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా పొందే క్యాపిటల్ గెయిన్‌పై పన్ను విధించే అవకాశం భారత్‌కే లభిస్తుండడం ఈ ఒప్పందంలో ప్రధానాంశం. 2017 ఏప్రిల్ 1 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది.
 
డీల్స్..
* మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు).
* సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
* ఫెయిర్‌అసెట్స్ టెక్నాలజీస్‌లో 9.84 శాతం వాటాను తమ అనుబంధ సంస్థ జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసిందని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది.  
* జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్‌లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement