ఐదు నెలల్లోనే కోటి మంది చేరిక
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్‌ను (2024 ఆగస్ట్ నాటికి) అధిగమించింది. చివరి కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం ఐదు నెలల్లోనే చేరినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎన్‌ఎస్‌ఈ వద్ద ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు వేగాన్ని అందుకున్నాయని, గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగినట్టు తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మొదటి కోటి ఇన్వెస్టర్ల చేరికకు 14 ఏళ్లు పట్టగా, తదుపరి కోటి మందికి ఏడేళ్లు పట్టింది.
ఆ తర్వాత కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం 3.5 ఏళ్లలోనే చేరారు. ఆ తర్వాత కోటి మంది చేరికకు కేవలం ఏడాది సమయం తీసుకుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ‘‘గత ఐదు నెలల నుంచి రోజువారీ యూనిక్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు 47,000 నుంచి 73,000 మధ్య ఉంటున్నాయి. డిజిటైజేషన్ వేగాన్ని పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో అవగాహన, అందరికీ ఆర్థిక సేవల చేరువ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ పనితీరు బలంగా ఉండడం వంటివి దోహదం చేశాయి’’అని ఎన్‌ఎస్‌ఈ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment