గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, May 30 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

Last week Business

ఈ-కామర్స్‌లోకి టాటా గ్రూప్
టాటా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘టాటాక్లిక్.కామ్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీన్ని టాటా యూనిస్టోర్ నిర్వహించనున్నది. టాటాక్లిక్‌లో టాటా ఇండస్ట్రీస్ 90 శాతం వాటాను, గ్రూప్ రిటైల్ విభాగం ట్రెంట్ మిగిలిన 10 శాతం వాటాను కలిగింది. ఈ-కామర్స్ మార్కెట్‌లో తొలిసారిగా ‘ఫిజిటల్’ విధానాన్ని ఆవిష్కరిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి, దాన్ని సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న 530 స్టోర్లలో ఎక్కడైనా తీసుకోవచ్చని వివరించారు.
 
మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!
స్మార్ట్‌ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్‌లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా కంపెనీ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్‌ఐహెచ్ మొబైల్‌కు విక్రయించింది.
 
టాప్-10లో ఏడు మారుతీ కార్లే
ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ... దేశీ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోం ది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ప్యాసెంజర్ కార్లలో ఏడు మారుతీవే కావటం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి విడుదలైన ఈ గణాంకాల్లో మారుతీ ఆల్టో అగ్రస్థానంలో ఉంది. దీని విక్రయాలు 16,583 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆటో మొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. అల్టో తర్వాతి స్థానాల్లో మారుతీ స్విఫ్ట్ (15,661 యూనిట్లు), మారుతీ వేగన్ ఆర్ (15,323 యూనిట్లు) వంటి తదితర మోడళ్లు ఉన్నాయి.
 
భారత్‌లో చుక్కల్లో స్పెక్ట్రం ధర: సిస్టెమా
భారత్‌లో స్పెక్ట్రం ధర చాలా ఎక్కువగా ఉందని రష్యాకు చెందిన సిస్టెమా కంపెనీ భారత టెలికం విభాగం ఎస్‌ఎస్‌టీఎల్ పేర్కొంది. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించడం చాలా కష్టమని సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్‌ఎస్‌టీఎల్) సీఈవో సెర్జీ సవ్‌కెన్నో వ్యాఖ్యానించారు. ఎస్‌ఎస్‌టీఎల్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
 
సినీపొలిస్ రూ.400 కోట్ల పెట్టుబడులు!
మెక్సికన్ మల్టీప్లెక్స్ చైన్ ‘సినీపొలిస్’ భారత్‌లో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టి, వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 160 సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. సినీపొలిస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ జేవియర్ సోటోమేయర్ ఈ విషయం వెల్లడించారు. మెక్సికో తర్వాత భారతే తమకు అతిపెద్ద మార్కెట్ అన్నారు. టాప్-60 పట్టణాల్లో విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త స్క్రీన్ల ఏర్పాటు ఆరు నెలల్లో పూర్తవుతుందని సంస్థ తెలిపింది.
 
ఈ-వ్యర్ధాల విడుదలలో 5వ స్థానంలో భారత్
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ ఉన్న దేశం భారత్. ఇక్కడ ఏటా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్) వెలువడుతున్నాయని, ఇది ప్రపంచంలో 5వ స్థానమని తాజా అధ్యయనం పేర్కొంది. అందులోనూ 12 శాతం టెలికం పరికరాల నుంచే ఈ-వ్యర్ధాలు వస్తున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.
 
4,200 కంపెనీలపై డి-లిస్టింగ్ వేటు!
స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా సెబీ కీలక చర్యలకు సమాయత్తమవుతోంది. ముఖ్యంగా ట్రేడింగ్ లావాదేవీలు జరగని కంపెనీలపై సెబీ కొరడా ఝళిపిస్తోంది. ఇలాంటి 4,200కు పైగా లిస్టెడ్ కంపెనీలను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించే ప్రణాళికల్లో ఉంది.
 
మార్కెట్ నిపుణుల కోసం ఎన్‌ఎస్‌ఈ అకాడెమీ
ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను ద ృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ‘ఎన్‌ఎస్‌ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఈ కొత్త అకాడెమీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్  సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది.
 
నాల్కో షేర్ల బైబ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం
అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది.
 
ప్రి-ఓన్‌డ్ కార్ల వ్యాపారంలోకి రెనో

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా ప్రి-ఓన్‌డ్ కార్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే బెంగళూరులో ‘రెనో సెలెక్షన్’ అనే ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అన్ని బ్రాండ్లకు చెందిన ప్రి-ఓన్‌డ్ కార్ల కొనుగోలు, విక్రయం, ఎక్స్ఛేంజ్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తామని రెనో తెలిపింది. అలాగే పాత కార్లకు 24ఁ7 రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఫైనాన్స్ సదుపాయం, వారెంటీ వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొంది.
 
ఫోర్బ్స్ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో మనవి 56
ఫోర్బ్స్ రూపొందించిన వార్షిక ‘గ్లోబల్ 2,000 అతిపెద్ద, శక్తివంతమైన కంపెనీలు’ జాబితాలో భారత్ నుంచి 56 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉంది. ఇది 121వ స్థానంలో నిలిచింది. దీని మార్కెట్ విలువ 50.6 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (149వ స్థానం) ఉంది. దీని మార్కెట్ విలువ 23.3 బిలియన్ డాలర్లు. ఇక ఫోర్బ్స్ జాబితా టాప్-3లో ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ), చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా అనే అన్ని చైనా బ్యాంకులే ఉన్నాయి.
 
నియామకాలు
హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా మళ్లీ వినోద్ కె దాసరి నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీ కాలంతో వినోద్ కె దాసరి నియామకానికి డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని అశోక్ లేలాండ్ బీఎస్‌ఈకి నివేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement