ఆన్‌లైన్‌లో పర్సనల్ కేర్ జోరు.. | Online Personal Care initiative .. | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పర్సనల్ కేర్ జోరు..

Published Thu, Mar 19 2015 12:56 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

ఆన్‌లైన్‌లో పర్సనల్ కేర్ జోరు.. - Sakshi

ఆన్‌లైన్‌లో పర్సనల్ కేర్ జోరు..

2020 నాటికి 5 బిలియన్ డాలర్లకు అమ్మకాలు
- హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్
- ఎఫ్‌ఎంసీజీ విక్రయాల్లో మూడో వంతు ఈ-కామర్స్ సైట్ల నుంచే

నాలుగైదేళ్ల క్రితం దాకా భారత్‌లో ఈ-కామర్స్ ఒక మోస్తరు స్థాయిలోనే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా విస్తరించింది. అంతకంతకూ పెరుగుతోంది.

ముందుగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావించినప్పటికీ.. ఎప్పటికప్పుడు కొంగొత్త ఉత్పత్తులు ఆన్‌లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ ఉత్పత్తుల సంస్థలు ఆన్‌లైన్ మాధ్యమం వైపు మరింతగా దృష్టి సారిస్తున్నాయి.
 
టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2020 నాటికి ఆన్‌లైన్‌లో సౌందర్య సంరక్షణ, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు 5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 30,000 కోట్లు) ఉంటాయని అంచనా. అప్పటికి ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాలు 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 6 లక్షల కోట్లు) చేరనున్నాయి. ఇందులో ఆన్‌లైన్ అమ్మకాల వాటా స్వల్పంగా అయిదు శాతం స్థాయే అయినప్పటికీ.. ఈ మాధ్యమం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూడలేమని కంపెనీలు భావిస్తున్నాయి.

రాబోయే అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే రాబోతోందని పరిశ్రమవర్గాల మరో అంచనా. అందుకే .. ఈ మాధ్యమంపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. సౌందర్య సాధనాల సంస్థ లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్‌లైన్ అమ్మకాలదే ఉంటోంది కంపెనీకి చెందిన. మేబెలీన్  బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే ఉంది.

దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్‌సెయింట్‌లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మెటిక్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనున్నట్లు లోరియల్ వర్గాలు తెలిపాయి. కొత్తగా ప్రవేశించిన జపాన్ కాస్మెటిక్స్ కంపెనీ షీసీడో చాలా వేగంగా ఆన్‌లైన్ వైపు మళ్లింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులో మాత్రమే స్టోర్స్ ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా మరింత మంది కొనుగోలుదార్ల వద్దకు చేరవచ్చన్న ఉద్దేశంతో ఉంది. షీసీడో తాజాగా జెడ్‌ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది.  

కారణాలివీ..
ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ఆన్‌లైన్ వైపు చూడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొబైల్ ఫోన్లలో కూడా ఇంటర్నెట్ లావాదేవీలు పెరుగుతుండటం ఒకటి కాగా డిజిటల్ మాధ్యమం ద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశం ఉండటం మరొక కారణం. ఇతరత్రా మాధ్యమాలతో పోలిస్తే ఆన్‌లైన్లో విక్రయానికి ఉంచే ఉత్పత్తులను చూసి, కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
 
లగ్జరీకి డిమాండ్..
సాధారణంగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దొరకని ప్రత్యేక, లగ్జరీ ఉత్పత్తులకు ఆన్‌లైన్లో మంచి డిమాండ్ ఉంటోంది. హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు ఆఫ్‌లైన్లో కంటే ఆన్‌లైన్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా కొనుగోలుదారులకు సౌకర్యం కోణంలో ఆన్‌లైన్‌లో కొన్ని రకాల ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోంది. పురుషుల సౌందర్య సాధనాలు, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవి ఇందులో ఉంటున్నాయి. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో సుమారు పాతిక శాతం వాటా వీటిదే ఉంటోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో మొత్తం ఎఫ్‌ఎంసీజీ మార్కెట్ విక్రయాల్లో మూడో వంతు.. డిజిటల్ మాధ్యమం నుంచే రాబోతోందని విశ్లేషకులు తెలిపారు. దీన్ని గుర్తించే మారికో, గోద్రెజ్ కన్జూమర్ వంటి సంస్థలు తమ ఈ-కామర్స్ వెబ్‌సైట్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ మొబైల్స్ ద్వారా లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మకాలు మరింత మెరుగుపడగలవని మారికో అంటోంది. గోద్రెజ్ వంటి సంస్థలు సొంత పోర్టల్స్ ఏర్పాటుకంటే ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లతో జట్టు కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement