ఈ-కామర్స్‌లో కొలువుల జాతర
ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో వస్తు, సేవల అమ్మకమే.. ఈ-కామర్స్ (ఎలక్ట్రానిక్ కామర్స్)! దేశంలో ఇప్పుడు ఈ రంగం ఓ వెలుగు వెలుగుతోంది. దేశీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ కంపెనీలు నియామకాలను వేగవంతం చేయడంతో యువతకు కొలువుల పంటపండుతోంది. అమెజాన్, ఈబె, రాకుటెన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు.. ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్నాప్‌డీల్.. తదితర స్వదేశీ స్టార్ట్ అప్ కంపెనీలు అధిక సంఖ్యలో ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఇస్తున్నాయి. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల భారీ వార్షిక పే ప్యాకేజీలతో ఐఐఎంలు, ఐఐటీల్లో చదువుకున్న ప్రతిభావంతుల కోసం పోటీ పడుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఈ-కామర్స్ కెరీర్ హాట్ టాపిక్‌గా మారింది.
1980లలో ప్రొక్టర్ అండ్ గాంబెల్, యూనిలివర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి పేరున్న పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం చాలా గొప్పగా భావించేవారు. అదే 1990లకు వచ్చేసరికి ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొలువెంతో క్రేజీ! ఇప్పుడు అమెజాన్, ఈబె, ఫ్లిప్‌కార్ట్‌ల్లో కెరీర్ హాట్ కేక్‌గా మారింది. భారత ఈ-కామర్స్ పరిశ్రమ 2 బిలియన్ డాలర్లు దాటింది. వాస్తవానికి ఇది ప్రపంచ ఈ-కామర్స్ పరిశ్రమతో పోల్చితే ఇసుమంతే. దేశంలోనూ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో వచ్చే పదేళ్లలో మన ఈ-కామర్స్ మార్కెట్ పదింతలవుతుందని నిపుణుల అంచనా. ఆ మేరకు యువతకు ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలు లభించనున్నాయి. భారత్ కొంత ఆలస్యంగా ఈ రంగంలోకి ప్రవేశించినా.. అమెజాన్, ఈబె వంటి అంతర్జాతీయ కంపెనీలతో పోటీ పడుతోంది.
ఐటీ రంగాన్ని మించి
ప్రస్తుతం ఐటీ రంగాన్ని మించి ఈ కామర్స్ దూసుకుపోతోంది. బీస్కూల్స్ ఎదుట భారీ ప్యాకేజీలతో ఆన్‌లైన్ కంపెనీలు క్యూ కట్టడమే ఇందుకు నిదర్శనం. అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ డాట్ కామ్ భారత్‌లోకి ప్రవేశించడంతో ఇక్కడి ఈ-కామర్స్ రంగంలో పోటీ పెరిగింది. సమర్థవంతమైన మానవ వనరుల అవసరమూ ఏర్పడింది. దాంతో దేశంలోని ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జొమాటో లాంటి ఈ-కామర్స్ కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్స్ ఇస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇలాంటి కంపెనీల నియామకాల్లో 50 శాతం పెరుగుదల నమోదైంది.
ప్రస్తుత హైరింగ్ ట్రెండ్ ఇలా
ప్రముఖ కన్సల్టెన్సీ రాండ్‌స్టాడ్ అంచనా ప్రకారం- ప్రస్తుతం భారత ఈ-కామర్స్ రంగం 35 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇదే ఊపుతో రాబోయే రెండేళ్లలో ఈ-కామర్స్ కంపెనీల్లో హైరింగ్ ఏటా 30 శాతం మేర పెరగనుంది. తద్వారా 2015లో ఈ-కామర్స్ రంగం కొత్తగా 50,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ఈ-కామర్స్ కంపెనీలు దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలానీ, ఐఎస్‌బీ వంటి టాప్ బిజినెస్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. 2013-14లో ఈ-కామర్స్ సంస్థలు దాదాపు 4,000 మందిని నియమించుకోవడమే ఈ రంగంలో అవకాశాలకు నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఫ్లిప్‌కార్‌ట సిబ్బంది గతేడాది 1,500మంది ఉంటే.. ఈ సంవత్సరం అది మూడింతలు పెరిగి 5,000 అయింది. రాబోయే రోజుల్లో మరో 12వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరో ఈ-కామర్స్ కంపెనీ ‘ఫ్యాషన్ అండ్ యూ’ ప్రస్తుత సిబ్బంది 1500 ఉండగా.. త్వరలోనే మరో 400 మందికి ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ విభాగాల్లో కొలువులు
ఈ-కామర్స్ కంపెనీలు కొనుగోళ్లు- అమ్మకాలు, ప్రాసెసింగ్, సేవలు.. ఇలా అన్ని రకాల కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోనే వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తాయి. ఆ మేరకు వెబ్‌డిజైనర్, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ దగ్గర నుంచి మార్కెటింగ్ స్పెషలిస్ట్, మర్చండైజింగ్ ఆఫీసర్, ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ వరకూ.. వివిధ జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. భారతీయ ఈ-కామర్స్ కంపెనీలతోపాటు దేశంలోకి ప్రవేశిస్తున్న బహుళజాతి సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, గ్లోబల్ బిజినెస్ సపోర్టింగ్ కోసం సిబ్బందిని నియమించుకుంటున్నాయి. వాస్తవానికి ఈ కామర్స్ సంస్థల వృద్ధి.. సేల్స్, టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అందుకే తమ మార్కెటింగ్, టెక్నికల్ సిబ్బందిని నిరంతరం పెంచుకుంటున్నాయి. కంపెనీలు విస్తరణ దిశగా మౌలిక వసతులను కూడా మెరుగుపరుచుకుంటు న్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో చూస్తే.. ప్రస్తుతం మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్, బిగ్ డేటా, అనలిటిక్స్ నిపుణులకు ఈ-కామర్స్ కంపెనీల్లో ఉజ్వల కెరీర్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీరితోపాటు ఐటీ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, అనలిటిక్స్, బ్యాక్ ఆఫీస్, సేల్స్, ఆన్‌లైన్ మర్చండైజింగ్, కంటెంట్ రైటర్స్, కంటెంట్ మేనేజ్‌మెంట్, కంటెంట్ ఎడిటర్స్, విజువలైజర్, ఈవెంట్ స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైన ర్స్, ఫోటోగ్రాఫర్స్ వంటి ఉద్యోగాలు ఈ-కామర్స్ సంస్థల్లో లభిస్తాయి. ఈ-కామర్స్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ కూడా భవిష్యత్‌లో మంచి వృద్ధి సాధించే అవకాశమున్న రంగం. యువత ఇందులోనూ అవకాశాలు అందుకోవచ్చు.
స్కిల్ సెట్ ఎలా ఉండాలి
ఈ-కామర్స్ రంగం విస్తరణంతా సోషల్, మొబైల్, క్లౌడ్, అనలిటిక్స్(ఎస్‌ఎంఈసీ)పై ఆధారపడి ఉండటంతో టెక్నాలజీ నిపుణులకు అవకాశాలు అపారం కానున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డొమైన్స్‌లో సాంకేతికతను విస్తరించుకుంటుండడంతో నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. దాంతోపాటు సేల్స్ స్కిల్స్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి మంచి ఆఫర్స్ అందుతాయి.
మరోవైపు స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ విస్తరణతోపాటు మొబైల్ షాపింగ్ పట్ల వినియోగదారుల ఆసక్తి కారణంగా మొబైల్ కంప్యూటింగ్ నైపుణ్యాలు, ఆప్స్ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉన్న వారు ఈ-కామర్స్ కంపెనీల్లో వేగంగా ఎదగొచ్చు. పీహెచ్‌పీ, రూబీ ఆన్ రైల్స్, మాజెంటో, వర్డ్‌ప్రెస్ వంటి టెక్నాలజీలను ఆయా కంపెనీలు వినియోగిస్తున్నాయి. కాబట్టి అందుకుతగ్గ కోడింగ్ నైపుణ్యాలు ఉండాలి. టెక్నికల్ ఉద్యోగాలకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీపై పట్టుతోపాటు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, లాజికల్, క్రియేటివ్ థింకింగ్, సమస్యా పరిష్కార సామర్థ్యాలను కంపెనీలు పరీక్షిస్తున్నాయి.
సేల్స్ విభాగంలో ప్రవేశించేవారికి ఆన్‌లైన్‌లో వినియోగదారుడి షాపింగ్ తీరు- సామాజిక ప్రవర్తనపై అవగాహన అవసరం. అలాగే వినియోగదారుడి అవసరాలు, ఆసక్తుల కోణంలో ఆలోచించగలగాలి. ఆన్‌లైన్‌లో కస్టమర్‌ను ఒప్పించే నైపుణ్యాలు, మార్కెట్‌పై అవగాహన, వస్తువుల అమ్మకం పట్ల ఇష్టం తదితర ప్రాథమిక స్కిల్స్ మార్కెటింగ్ సిబ్బందికి తప్పనిసరి.
వేతనాలు ఇలా..
టెక్నికల్, మేనేజీరియల్ ఉద్యోగాలకు నైపుణ్యాలను బట్టి రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల వరకూ అందుకోవచ్చు. ఈ-కామర్స్ కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్‌కు మాత్రం ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల
నుంచి 3.5 లక్షల వరకూ లభిస్తుంది.
ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవగాహన
అకడమిక్, కెరీర్ కోణాల్లో ఈ-కామర్స్ పట్ల విద్యార్థుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. దీన్ని గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంకాం (ఈ-కామర్స్)ను అందిస్తున్నాం. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకామ్‌లోనే ఈ-కామర్స్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పెషలైజేషన్‌ను మిగతా కళాశాలల్లో.. అన్ని స్థాయిల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది. అందుకు అవసరమైన ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. కామర్స్ విభాగాన్ని కెరీర్‌గా ఎంచుకునే విద్యార్థులకు అవకాశాలపరంగా ఈ-కామర్స్‌లో మంచి భవిష్యత్తు లభిస్తుంది. దేశంలో ప్రముఖ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలోనే ఉన్న ఈ కోర్సును.. అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమ అవసరాలు తీరడంతోపాటు విద్యార్థులకు అవకాశాలు కూడా లభిస్తాయి.
-ప్రొఫెసర్. జి. లక్ష్మణ్, చైర్మన్,
బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ
వచ్చే ఏడాది చివరికి 10 బిలియన్ డాలర్ల వృద్ధి
దేశంలో ఈ-కామర్స్ రంగం శరవేగంగా పురోగతి సాధిస్తోంది. ప్రతి ఏటా వృద్ధి రెట్టింపవుతోంది. ఇదే క్రమంలో 2015 చివరి నాటికి పది బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోనుంది. కారణం.. వినియోగదారుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం. సమయం ఆదా అవుతుందనే ఆలోచనతో ఆన్‌లైన్ షాపింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఈ-కామర్స్‌లో ప్రొడక్ట్స్ క్రయవిక్రయాల కోసం మొబైల్ ఫోన్స్‌లోనూ ప్రత్యేక అప్లికేషన్లు రూపొందుతున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్ షాపింగ్ మరింత సులువైంది. కానీ, పరిశ్రమకు నిపుణులైన మానవ వనరుల కొరత ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీసం పది వేల మంది క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అవసరం. కానీ ఆ మేరకు అకడమిక్‌గా శిక్షణ అవకాశాలు అందుబాటులో లేవు. ఇటీవల కాలంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, కళాశాలలు ఈ-కామర్స్, ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను అందిస్తున్నప్పటికీ.. డిమాండ్-సప్లయ్ మధ్య ఎంతో గ్యాప్ ఉంది. పలు సంస్థలు టెక్నికల్ విభాగానికి ఇంజనీరింగ్, మార్కెటింగ్-అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలకు మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. అయితే ఈ-కామర్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ కోర్సుల అవసరం ఎంతో ఉంది. ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్‌గానైనా బోధిస్తే కొంతమేర ఈ రంగం గురించి అవగాహన, ఆసక్తి ఏర్పడుతుంది. సంబంధిత ప్రొఫెషనల్స్‌కు మార్కెటింగ్, టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లో కనీసం రూ.5 లక్షల వార్షిక వేతనం లభించడం ఖాయం.
- అశ్విన్ కృష్ణ
సీనియర్ వైస్ ప్రెసిడెంట్,
మార్ట్‌జాక్ (డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం)