ఇ-వ్యాపారానికి ఫేస్‌బుక్ వేదిక!
ఒకవైపు దేశంలో ఇ-కామర్స్ విస్తృతి పెరుగుతోంది. ఆన్‌లైన్ లో రిటైయిల్ మార్కెటింగ్‌కు అవకాశం ఇచ్చే వెబ్‌సైట్‌లు కోట్లలో సొమ్ము చేసుకొంటున్నాయి. ఇలాంటి సైట్ల సంఖ్య వందల్లో ఉంది. వాటి మధ్యనే తీవ్రమైన పోటీ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఔత్సాహికులు ఎవరైనా ఒక వెబ్‌సైట్ స్థాపించి, దాన్ని పాపులర్ చేసి, ఇ-కామర్స్ రంగంలో దూసుకుపోవడమంటే మాటలు కాదు. మరి ఇలాంటి ఆలోచ నతో ఒక ప్రత్యామ్నాయమార్గాన్ని సృష్టించుకొన్నారు ‘గిఫ్టింగ్‌హ్యాపినెస్’ నిర్వాహకులు.
ఒక ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఇ-మార్కెటింగ్ నిర్వహించడమే వీరు చేస్తున్న పని. ప్రత్యేకంగా వెబ్‌సైట్ అవసరం ఏమీ లేకుండా... ఫేస్‌బుక్ పేజ్ నుంచే నేరుగా వీరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. గిఫ్టింగ్‌హ్యాపీనెస్ అనే ఫేస్‌బుక్ పేజ్‌లోకి వెళ్లి అక్కడ ఉంచిన రకరకాల వస్తువులను చూసి ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా సైట్ వాళ్ల దగ్గర నుంచి స్నేహితుల ఇంటికి పార్శిల్ చేసి పంపవచ్చు.
వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి, దాన్ని పాపులర్ చేసి... వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ పేజ్‌కి రూపకల్పన చేశాడు. మరి ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ ఎలా.. ఫేస్‌బుక్ పేజ్‌ను నమ్మేదెలా? అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అయితే ఒక్కసారి ఈ పేజ్‌లోకి ఎంటర్ అయితే సందేహాలు, అనుమానాలు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ప్రస్తుతం ఈ పేజ్ ద్వారా దాదాపు 240 నగరాలకు వస్తువులను డెలివరీ చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సైట్‌లో కనీసం పది రూపాయల ధర నుంచి వస్తువులు అందుబాటులో ఉంటాయి.
చాక్లెట్‌లు, కేక్‌లు, పూలు, స్వీట్ల దగ్గర నుంచి బహుమతులుగా ఇవ్వదగిన దాదాపు 1500 వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఫేస్‌బుక్ ద్వారా జరుగుతున్న వ్యాపారం కాబట్టి దీన్ని ఎఫ్-కామర్స్‌గా పిలుచుకోవచ్చని నిర్వాహకులే అంటున్నారు. ఆలోచన ఉండాలి కానీ.. ఆన్‌లైన్‌ను అనుసంధానం చేసుకొని అనేక మార్గాల ద్వారా వ్యాపారం చేయవచ్చనే సందేశాన్ని, ఫేస్‌బుక్ ను చూస్తూ చూస్తూనే చిన్న చిన్న గిఫ్ట్స్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఇస్తుంది ఈ పేజ్!