జియోకు ఫేస్‌బుక్‌.. లైక్‌ | Facebook to invest 43574 crore in Jio platforms | Sakshi
Sakshi News home page

జియోకు ఫేస్‌బుక్‌.. లైక్‌

Published Thu, Apr 23 2020 3:23 AM | Last Updated on Thu, Apr 23 2020 7:39 AM

Facebook to invest 43574 crore in Jio platforms - Sakshi

న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు రిలయన్స్‌ గ్రూప్, ఫేస్‌బుక్‌ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ 5.7 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్‌బుక్‌లో భాగమైన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఊతంతో దేశీ ఈ–కామర్స్‌ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్‌ రిలయన్స్‌కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది.

‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. తద్వారా అందులో అతి పెద్ద మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటాం‘ అని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫేస్‌బుక్‌ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌ విలువను రూ. 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లవుతుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో ప్రకటనలో పేర్కొంది.     2014లో వాట్సాప్‌ కొనుగోలు డీల్‌ తర్వాత ఫేస్‌బుక్‌ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం. సాధారణంగా మీడియా, ఆన్‌లైన్‌ సంస్థల్లోనే ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫేస్‌బుక్‌ తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ పేమెంట్, ఈ–కామర్స్‌ విభాగాల్లోని భారీ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునే వ్యూహంలో ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

డీల్‌ ఇలా..
డీల్‌ ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్‌.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్‌ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్‌ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్‌ గ్రూప్‌ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్‌ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్‌–ఎక్స్‌క్లూజివ్‌ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్‌బుక్‌ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కాగా, ఈ ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది.
 
రిలయన్స్‌కు ప్రయోజనాలు..
గతేడాది డిసెంబర్‌ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్‌ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్‌ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్‌ విభాగంలో వాటాలను బ్రిటన్‌ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్‌బుక్‌ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్‌బుక్‌ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్‌ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.  

జియో డిజిటల్‌కు ఊతం: విశ్లేషకులు
డిజిటల్‌ వ్యాపార విభాగాల ద్వారా ఆదాయార్జన, 2021 నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్‌ లక్ష్యాల సాకారానికి ఫేస్‌బుక్‌ డీల్‌ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ విభాగం .. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌ పరిధిలో లేదు. వాట్సాప్‌తో జట్టు కట్టడం ద్వారా కిరాణా దుకాణదారు, కొనుగోలుదార్లను అనుసంధానం చేయొచ్చు‘ అని క్రెడిట్‌ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. ఇది రెండు పక్షాలకూ వ్యూహాత్మక ఒప్పందమని బెర్న్‌స్టెయిన్‌ తెలిపింది. ‘ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ డీల్‌తో వుయ్‌చాట్‌ లాంటి యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 38 కోట్ల పైచిలుకు యూజర్లు ఫేస్‌బుక్‌కు లభిస్తారు. జియోమార్ట్‌లోని 6 కోట్ల చిన్న వర్తకులతో పాటు జియో కస్టమర్లకూ కొత్త సొల్యూషన్స్‌ అందించవచ్చు’ అని వివరించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్‌ ..
ఈ డీల్‌ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్‌ రిటైల్, వాట్సాప్‌ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ విభాగం జియోమార్ట్‌ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్‌ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్‌ఐఎల్‌ వివరించింది. ఈ–కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది.   
 
రిలయన్స్‌కు ప్రయోజనాలు..
గతేడాది డిసెంబర్‌ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్‌ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్‌ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్‌ విభాగంలో వాటాలను బ్రిటన్‌ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్‌బుక్‌ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్‌బుక్‌ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్‌ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.  
 
ఫేస్‌బుక్‌కు ఏంటి...
కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2017లో దేశీయంగా 45 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2022 నాటికి 85 కోట్లకు పెరగనుంది.  ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, అందులో భాగమైన వాట్సాప్‌నకు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో విభాగం ఇన్‌స్ట్రాగామ్‌కు కూడా ఇబ్బడిముబ్బడిగా యూజర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇక టెలికం కార్యకలాపాలు సాగిస్తున్న జియోకు 38.8 కోట్ల పైగా ఫోన్‌ సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. జియోతో జట్టు కట్టడం ద్వారా కోట్ల కొద్దీ యూజర్లకు మరింతగా చేరువ కావడానికి ఫేస్‌బుక్‌కి ఈ డీల్‌ ఉపయోగపడనుంది. పేమెంట్‌ సర్వీసులను కూడా ప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ఫేస్‌బుక్‌కు స్థానికంగా ఒక భాగస్వామి ఉంటే నియంత్రణలపరమైన అడ్డంకులను అధిగమించేందుకు.. ప్రైవసీ, లోకల్‌ స్టోరేజీ నిబంధనల పాటించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.

విద్య.. వైద్యంలోకి విస్తరణ: అంబానీ
ఫేస్‌బుక్‌ భాగస్వామ్యంతో భారీ వ్యాపార ప్రణాళికలను ఆవిష్కరించారు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు చేర్చడం మొదలుకుని క్రమంగా విద్య, వైద్య రంగాల్లోకి కూడా విస్తరించబోతున్నామని వెల్లడించారు. ‘రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలపడం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే కొంగొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయి.
జియోమార్ట్, వాట్సాప్‌ భాగస్వామ్యం వల్ల.. సమీప భవిష్యత్‌లో ఇరుగుపొరుగుల్లో ఉండే ప్రతి కస్టమరుతో డిజిటల్‌ లావాదేవీలు జరిపేలా దాదాపు 3 కోట్ల పైచిలుకు చిన్న స్థాయి కిరాణా దుకాణదారులకు తోడ్పాటు లభిస్తుంది. అంతేకాదు.. ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో మన రైతులు, చిన్న.. మధ్య తరహా సంస్థలు, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సేవలందించేవారు .. అందరికన్నా ముఖ్యంగా నవభారతానికి వెన్నెముకలాంటి యువత, మహిళలకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్‌ దేశంగా భారత్‌ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది ‘ అని సోషల్‌ మీడియా సైట్లలో పోస్ట్‌ చేసిన వీడియో సందేశంలో ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.  

జియోతో జట్టు... మరిన్ని అవకాశాలు
లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లోకి రావడానికి జియో వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.  ఏ ఆర్థిక వ్యవస్థకైనా చిన్న వ్యాపారాలు చాలా కీలకం. భారత్‌లో 6 కోట్లకు పైగా చిన్న వ్యాపార సంస్థలున్నాయి. కోట్లాదిమంది ప్రజలు ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు.  ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో వ్యాపార వృద్ధి, వినియోగదారులతో సంబంధాల నిమిత్తం ఈ వ్యాపార సంస్థలకు డిజిటల్‌ టూల్స్‌ అవసరం. ఈ డిజిటల్‌ టూల్స్‌ అందించడం కోసమే జియోతో జట్టు కట్టాం.  రిలయన్స్‌తో మా భాగస్వామ్యం... భారత్‌లోని చిన్న వ్యాపార సంస్థలకు మరిన్ని కొత్త అవకాశాలను అందించనున్నది. రిలయన్స్‌ జియోతో కలిసి కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ల కారణంగా భారత్‌లో చాలా మందికి వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.  

–మార్క్‌ జుకర్‌బర్గ్‌


అంబానీకి మహీంద్రా అభినందనలు
ఫేస్‌బుక్‌తో డీల్‌ విషయంలో ముకేశ్‌ అంబానీకి అభినందనలు తెలియజేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర. ‘వైరస్‌పరమైన సంక్షోభ సమయంలో కుదిరిన ఈ ఒప్పందం .. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కి దక్కే ప్రాధాన్యం గురించి చాటిచెబుతోంది. వృద్ధికి నూతన కేంద్రంగా ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తుందన్న వార్తలకు బలం చేకూరుస్తోంది‘ అని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement