గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Dec 18 2017 1:57 AM | Last Updated on Mon, Dec 18 2017 1:57 AM

Last week's business - Sakshi

ధరలు పైకి.. పారిశ్రామికోత్పత్తి కిందకు!
కేంద్రం అక్టోబర్‌ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. పారిశ్రామికోత్పత్తిలో కేవలం 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామికోత్పత్తి నమోదు కాలేదు. 2016 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 4.2%. సెప్టెంబర్‌లో ఐఐపీ రేటు 4.14 శాతంగా నమోదయ్యింది. కాగా నవంబర్‌లో వినియోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా 4.88%గా నమోదయ్యింది.

ఫెడ్‌ రేటు పావుశాతం పెంపు
అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– తన ఫెడ్‌ ఫండ్‌ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఫెడ్‌ రేటు 1.25 శాతం నుంచి 1.50 శాతానికి పెరిగింది.

జోరుగానే వాహన విక్రయాలు
ఈ ఏడాది నవంబర్లో వాహన విక్రయాలు జోరుగా పెరిగినట్లు సియామ్‌ తెలిపింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు బాగుండటం, కంపెనీలు అధికంగా డిస్కౌంట్లు ఇవ్వడం కూడా కలసిరావడంతో ప్రయాణికుల వాహన విక్రయాలు 14% వృద్ది చెందినట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాధుర్‌ చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు బాగా తగ్గాయని, అందుకని అప్పటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయని వివరించారు.

వాట్సాప్‌ లీక్‌లపై ’సెబీ’ సీరియస్‌
వాట్సాప్‌ లీక్‌ల విషయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ విషయమై తీవ్రంగానే దర్యాప్తు జరుగుతోందని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి చెప్పారు. మరోవైపు ఐపీఓకు వచ్చిన కంపెనీల స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ సమయాన్ని ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల అవగాహన పెరుగుతోందని, ఫండ్స్‌లో మదుపు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.  

ఐపీఓ రూట్‌లో రిలయన్స్‌ జియో!
దేశీ టెలికం పరిశ్రమను ’జియో’తో షేక్‌ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ... స్టాక్‌ మార్కెట్లో కూడా ఇదే విధమైన ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆఖరికల్లా లేదా 2019 తొలినాళ్లలో జియోను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.  

బిట్‌కాయిన్‌ ఎక్సే్ఛంజీల్లో ఐటీ తనిఖీలు   
దేశీ బిట్‌కాయిన్‌ ఎక్సే్ఛంజీల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలకు దిగింది. అధికార బృందాలు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బిట్‌కాయిన్‌ ఎక్సే్ఛంజ్‌లలో విచారణ నిర్వహించగా, అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు  జరిపిన లక్షలాది లావాదేవీల సమాచారం వెలుగు చూసింది. బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్‌ ద్వారా వచ్చిన లాభాలపై పన్ను ఎగవేతకు సంబంధించి వివరాలు ఆరాతీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఎయిర్‌ డెక్కన్‌ మరో జర్నీ
దేశంలో తొలిసారి చౌక విమానయాన సేవల్లోకి ప్రవేశించి... అతితక్కువ చార్జీకే ఆకాశయానాన్ని పరిచయం చేసిన ’ఎయిర్‌ డెక్కన్‌’... రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. ఉడాన్‌ కింద తొలి విమానాన్ని నడపటానికి రెడీ అయ్యింది. డిసెంబర్‌ 22 నుంచి సర్వీసులు ప్రారంభించనుంది. తొలి ఫ్లైట్‌ నాసిక్‌  నుంచి ముంబైకు ప్రయాణించనుంది. కంపెనీ ’సింప్లిఫై’ ట్యాగ్‌లైన్‌తో ’సామాన్యులకు విమాన ప్రయాణం’ లోగోతో మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.

ఆధార్‌కు మూడు నెలల విరామం
ఆధార్‌ అనుసంధాన ఇబ్బందులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. డిసెంబర్‌ 31తో ముగుస్తుందని చెప్పిన గడువును మరో మూడు నెలల పాటు కేంద్రం పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆధార్‌ అనుసంధానం చేసుకోవచ్చునంటూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫోలియోలు, డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు, పాన్, పోస్టాఫీసు ఖాతాలు, బీమా పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు, మొబైల్‌ సిమ్‌ రీవెరిఫికేషన్‌కు మరింత సమయం లభించింది.
 
’కేంద్రం చేతికి యూనిటెక్‌’.. సుప్రీం స్టే

రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌ పగ్గాలను కేంద్రం తీసుకునేలా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది.  

ఎన్‌సీఎల్‌టీ ముందుకు 23 భారీ ఎన్‌పీఏలు
బ్యాంకులకు భారీగా రుణపడిన 23 నిరర్ధక ఆస్తుల ఖాతాలు (ఎన్‌పీఏలు) ఎన్‌సీఎల్‌టీ ముందుకు చేరాయి. మొత్తం 28 అతిపెద్ద ఎన్‌పీఏ ఖాతాల జాబితాను ఆర్‌బీఐ ఖరారు చేసి వీటి విషయంలో పరిష్కారానికి ఇచ్చిన గడువు ఈ నెల 13తో ముగిసింది. డిసెంబర్‌ 13వ తేదీ లోగా వీటి పరిష్కారానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో వాటిని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని ఆగస్టులోనే బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిపోవటంతో... వీటిలో 23 ఖాతాలకు సంబంధించి దివాలా చర్యలు ఆరంభించాలని కోరుతూ బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేయనున్నాయి. 

టోకు ధరలూ మంటే..!
టోకు ధరలు నవంబర్‌లో భగ్గుమన్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.93%గా నమోదయ్యింది. అంటే 2016 నవంబర్‌లో ఉన్న టోకు బాస్కెట్‌ ధరతో పోల్చితే 2017 నవంబర్‌లో టోకు బాస్కెట్‌ ధర 3.93% పెరిగిందన్నమాట. ఇంత స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం పెరగడం ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. ఇదే ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.59% కాగా, గత ఏడాది నవంబర్‌లో 1.82%గా ఉంది.

ఎగుమతులకు ’గ్లోబల్‌ డిమాండ్‌’ బలం!
మెరుగుపడిన అంతర్జాతీయ డిమాండ్‌..  ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. జీఎస్‌టీ రిఫండ్‌ ప్రక్రియ సరళీకరణ వెరసి నవంబర్‌లో భారత్‌ ఎగుమతుల్లో 30.55 శాతం భారీ వృద్ధి నమోదయ్యింది. విలువ రూపంలో ఎగుమతులు 26.19 బిలియన్‌ డాలర్లు. 2016 నవంబర్‌లో భారత్‌ ఎగుమతుల విలువ 20.06 బిలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులు కూడా 19.61 శాతం పెరిగాయి.   


ఆటోమొబైల్స్‌
♦ ఇటలీ సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ ‘డ్యుకాటి’ తన కొత్త సూపర్‌ బైక్‌ ‘స్క్రాంబ్లర్‌ మ్యాక్‌ 2.0’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.52 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).  
♦కొరియాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ ’ఎల్‌జీ’ తాజాగా తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ’వీ30ప్లస్‌’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.44,990.
♦ఇటలీ లగ్జరీ కార్ల కంపెనీ ‘మాసెరటి’.. కొత్త లగ్జరీ కారు ‘క్వాట్రోపోర్టే జీటీఎస్‌’ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.2.7 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ).
♦స్వీడన్‌ లగ్జరీ కార్ల కంపెనీ ‘వోల్వో కార్స్‌’ తన ప్రముఖ ఎస్‌యూవీ ‘ఎక్స్‌సీ 60’లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.55.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).


డీల్స్‌..
♦ ఆదిభట్లలోని ఏరోస్పేస్‌ సెజ్‌లో వైమానిక ఇంజిన్లు తయారు చేయడానికి టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ ఏరో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌), అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ దిగ్గజం జీఈ గ్రూప్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఇవి ఇక్కడ సీఎఫ్‌ఎం లీప్‌ వైమానిక ఇంజిన్‌కు అవసరమయ్యే వివిధ పరికరాలను తయారు చేస్తాయి. పెట్టుబడి విలువ రూ.3,200 కోట్లపైనేనని అంచనా.
♦ భారతీ ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ (డైరెక్ట్‌ టు హోమ్‌) విభాగంలో 20 శాతం వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ కొనుగోలు చేయనున్నది. తమ డీటీహెచ్‌ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్‌బర్గ్‌ పిన్‌కస్‌కు చెందిన అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నదని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.2,310 కోట్లు.
♦ దేశీయ దిగ్గజ ఉక్కు కంపెనీ సెయిల్‌.. అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌తో కలసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. వాహన తయారీకి ఉపయోగపడే ఉక్కును ఉత్పత్తి చేసే ఈ జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదనకు సెయిల్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement