క్యూ3లో చైనా వృద్ధి రేటు 6.9 శాతం
చైనా ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత చైనా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దేశం నుంచి ఎగుమతులు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశం 7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
త్వరలో పీఎన్‌బీ హౌసింగ్ ఐపీఓ
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఈ రెండు కంపెనీలు ఐపీఓకు రావాలని యోచిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలనేది ఈ కంపెనీల ఆలోచన. ఈ రెండు కంపెనీలు త్వరలో ఐపీఓ సంబంధిత పత్రాలను మా ర్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నాయని సమాచారం.
ఆన్‌లైన్ విభాగంలోకి ఎంఅండ్‌ఎం
ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ‘స్మార్ట్‌షిఫ్ట్’ అనే ఇంట్రా సిటీ లాజిస్టిక్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇది కార్గో యజమానులకు, ట్రాన్స్‌పోర్టర్స్‌కు ఒక వినిమయ వేదికగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ పోర్టల్ మహీంద్రా లాజిస్టిక్స్ విభాగం కింద కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని పేర్కొంది.
2020 నాటికి హోండా సెల్ఫ్ డ్రైవ్ కార్లు
వాహన తయారీ కంపెనీలు తనంతట తానుగా నడిచే కార్ల (సెల్ఫ్ డ్రై వింగ్ కార్లు) తయారీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నిస్సాన్, టయోటా కంపెనీలకు సవాలు విసురుతూ హోండా కంపెనీ కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్లను మార్కెట్లోకి తీసుకురానుంది. సెల్ఫ్ డ్రై వింగ్ కార్లను 2020 నాటికి రోడ్లపైన పరిగెత్తిస్తామని హోండా కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా హోండా కంపెనీ నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో తన ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూ ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయని పేర్కొంది.
వడ్డీ రేట్లను తగ్గించిన చైనా బ్యాంక్
ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి చైనా కేంద్ర బ్యాంక్ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను తగ్గించింది. రుణ, డిపాజిట్ వడ్డీరేట్లను చెరో పావు శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే నగదుకు సంబంధించి రిజర్వ్ రిక్వైర్‌మెంట్ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్)ను అర శాతం తగ్గించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను అరశాతం తగ్గించడం వల్ల బ్యాంకులకు పుష్కలంగా నిధులు అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చైనా కేంద్ర బ్యాంక్ భావిస్తోంది.
గోల్డ్ డిపాజిట్ల వడ్డీరేట్ల స్వేచ్ఛ బ్యాంకులకే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది.
నవంబర్ 6న భారత్‌లోకి యాపిల్ వాచ్‌లు!
ఇటీవలే కొత్త ఐఫోన్స్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ అతి త్వరలోనే తన స్మార్ట్‌వాచ్‌లను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ‘యాపిల్ వాచ్’ నవంబర్ 6న భారత మార్కెట్‌లోకి రానుంది. ఈ వాచ్‌లు అమెరికా, జపాన్, ఫ్రాన్స్, యూకే దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
రియల్టీ జాప్యాలు ఏపీలో అధికం
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. రియల్టీ ప్రాజెక్టుల పూర్తి దాదాపు 45 నెలలు ఆలస్యం అవుతోంది. ఇక దేశం మొత్తం మీద సగటున రియల్టీ ప్రాజెక్టుల నిర్మాణ జాప్యం 33 నెలలుగా ఉంది. ప్రాజెక్టుల జాప్యాల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (41 నెలలు), తెలంగాణ (40 నెలలు), పంజాబ్ (38 నెలలు) ఉన్నాయి. కాగా దేశంలో 2014-15 నాటికి 3,540 ప్రతిపాదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌లో 75 శాతం ఇంకా ప్రారంభం కాలేదు.
డీల్స్
* సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాకు చెందిన నోహ కన్సల్టింగ్ కంపెనీని రూ.454 కోట్లకు కొనుగోలు చేసింది.
* స్వీడన్‌కు చెందిన వాణిజ్య వాహనాల దిగ్గజం వొల్వొ గ్రూప్‌కు చెందిన ఐటీ వ్యాపారాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.895 కోట్లకు కొనుగోలు చేయనుంది.
* భారత్‌లో టెలికాం టవర్లను నిర్వహిస్తున్న వయామ్ నెట్‌వర్క్స్‌లో 51 శాతం వాటాను అమెరికాకు చెందిన అమెరికన్ టవర్ కార్పొ(ఏటీసీ) రూ.7,600 కోట్లకు కొనుగోలు చేయనున్నది.
* మెమరీ కార్డులు వంటి స్టోరేజ్ పరికరాలు తయారు చేసే శాన్‌డిస్క్ కంపెనీని హార్డ్-డిస్క్ డ్రైవ్‌లు తయారు చేసే వెస్టర్న్ డిజిటల్ కార్పొ 1,900 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నది.
* అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది.
* అమెరికా బిట్ కాయిన్ స్టార్టప్ ఆబ్రాలో టాటా సన్స్ చైర్మన్ ఎమిరటస్ రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది.
గతవారం బిజినెస్
Published Mon, Oct 26 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM
Advertisement