బెస్ట్ బ్రాండ్స్ యాపిల్, గూగుల్
బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్ 16వ వార్షిక ఉత్తమ గ్లోబల్ బ్రాండ్స్ నివేదికలో టెక్నాలజీ కంపెనీలు మరోసారి హవా చాటాయి. టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్ వరుసగా మూడవ సంవత్సరం కూడా ప్రపంచ ఉత్తమ బ్రాండ్స్‌గా నిలిచాయి. ఇంటర్‌బ్రాండ్ ప్రపంచ ఉత్తమ బ్రాండ్స్ జాబితాలో యాపిల్ కంపెనీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తర్వాతి స్థానంలో గూగుల్ నిలిచింది.
ఐపీఓకు జీవీఆర్ ఇన్‌ఫ్రా, ఇన్ఫీబీమ్
జీవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించిన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి మంగళవారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని జీవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ యోచిస్తోంది. అలాగే ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొరేషన్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఇన్ఫీబీమ్ రూ.450 కోట్లు సమీకరించనున్నది.
జర్మనీ బ్యాంకుతో ఎస్‌బీఐ ఒప్పందం
గ్రామీణ, లఘు పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, జర్మనీకి చెందిన అభివృద్ధి బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ 300 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రుణ కాల పరిమితి 15 ఏళ్లు ఉంటుందని ఎస్‌బీఐ వివరించింది.
14న కాఫీ డే ఐపీఓ
కెఫె కాఫీ డే (సీసీడీ)ని నిర్వహించే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఈ నెల 14న ఐపీవోకి రానుంది. ఇందుకోసం షేర్ల ధరల శ్రేణిని రూ. 316-328గా నిర్ణయించింది. తద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించనుంది. దీంతో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వేల్యుయేషన్‌ని దక్కించుకునే అవకాశముంది. ఈ నెల 16న ఐపీవో ముగుస్తుంది. గడిచిన మూడేళ్లలో ఇదే భారీ ఐపీవో కానుండటం గమనార్హం.
జాబ్ సెర్చింగ్‌లో లింక్డ్‌ఇన్ కు అగ్రస్థానం
ప్రస్తుతం ఉపాధి కోసం నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం కంపెనీలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. జాబ్ సెర్చింగ్‌లో ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌తో పోలిస్తే లింక్డ్‌ఇన్ అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యోగుల అన్వేషణలో ఉన్న కంపెనీల్లో 61శాతం లింక్డ్‌ఇన్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే ఉపాధి వేటలో ఉన్న వారిలో 34 శాతం మంది లింక్డ్‌ఇన్‌ను ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో 360 సెక్యూరిటీ ఆర్ అండ్ డీ కేంద్రం
దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జోరుగా ఉండటంతో బీజింగ్‌కు చెందిన మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ 360 సెక్యూరిటీ భారత్‌లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మార్కెటని, భారత్‌లో 6 కోట్ల మంది యూజర్లున్నారని, అందుకే ఇక్కడ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ రీసెర్చ్ సెంటర్ కోసం 2 కోట్ల డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది.
11 ఎఫ్‌డీఐలకు కేంద్రం సిగ్నల్
ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా, అమర్ ఉజాలా పబ్లికేషన్స్ సహా 11 సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ దాదాపు రూ. 1,568 కోట్లని ఆర్థిక శాఖ తెలిపింది. దాదాపు రూ. 13,200 కోట్ల విలువ చేసే సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వీటిని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందని పేర్కొంది.
వోడాఫోన్‌కు ఊరట
ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసులో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఇండియాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి వొడాఫోన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.8,500 కోట్ల పన్ను డిమాండ్ సమంజసమేనంటూ ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన రూలింగ్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది.
ఆసియా సంపన్న కుటుంబాల్లో 14 మనవే!
ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 26.6 బిలియన్ డాలర్ల సంపదతో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ లీ కుటుంబం టాప్‌లో ఉంది. దీని తర్వాత హాంగ్‌కాంగ్‌కు చెందిన హెండర్‌సన్ లీ కుటుంబం 24.1 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచింది.
గృహ కొనుగోలుదారులకు మరింత రుణం
గృహ కొనుగోలుదారులకు మరింత రుణ వెసులుబాటు కలగనుంది. రూ.30 లక్షలు ఆ లోపు ఆస్తికి సంబంధించి 90 శాతం వరకూ గృహ రుణ మంజూరు అవకాశాన్ని ఇకపై బ్యాంకులు కలుగజేయనున్నాయి. ఇప్పటి వరకూ రూ.20 లక్షల ఆస్తి విలువపై వరకూ మాత్రమే 90 శాతం రుణం వెసులుబాటు ఉంది. గృహ రుణాలపై పలు బ్యాంకింగ్ దిగ్గజాలు వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆర్‌బీఐ సర్క్యులర్ విడుదల చేసింది.
ఇండస్‌ఇంద్ బ్యాంకు నికర లాభం 30 శాతం అప్
ప్రైవేట్ రంగంలోని ఇండస్‌ఇంద్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 30 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 430 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.560 కోట్లకు పెరిగిందని ఇండస్‌ఇంద్ బ్యాంక్ బీఎస్‌ఈకి నివేదించింది. మొత్తం ఆదాయం రూ.2,973 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.3,581 కోట్లకు చేరిందని పేర్కొంది.
విస్తరణ దిశగా బంధన్ బ్యాంకు
కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ 5 నెలల్లో 105 కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా 628 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
డీల్స్..
* ఎయిర్ కండీషనింగ్ ప్రాడక్ట్స్, టెక్నాలజీకి సంబంధించి జాన్సన్ కంట్రోల్స్, హిటాచి అప్లయెన్సెస్ కంపెనీలు కుదుర్చుకున్న గ్లోబల్ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ జాయింట్ వెంచర్‌లో జాన్సన్ కంట్రోల్స్ వాటా 60 శాతంగా, హిటాచి అప్లయెన్సెస్ వాటా 40 శాతంగా ఉంది.
* డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్‌లో ప్రమోటర్లయిన కేపీ సింగ్ కుటుంబం 40 శాతం వాటాలను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 12,000 నుంచి రూ. 14,000 కోట్లు ఉంటుందని అంచనా.
* ఆదిత్య బిర్లా గ్రూప్ దుబాయ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అబ్రాజ్ గ్రూప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. భారత్‌లో సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మించి నిర్వహించడానికి అబ్రాజ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ తెలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ వాటా 51 శాతమని, అబ్రాజ్ గ్రూప్ వాటా 49 శాతమని వివరించింది.
* ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్‌లో రూ.130 కోట్లు(2 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. డెలివరీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న తమ వ్యూహంలో భాగంగా గోజావాస్‌లో వాటా కొనుగోలు చేశామని స్నాప్‌డీల్ వెల్లడించింది. ఈ రూ.130 కోట్ల పెట్టుబడులతో వంద నగరాల్లో ఏడాది కాలంలో తన కార్యకలాపాలను గోజావాస్ విస్తరించనుంది.
గతవారం బిజినెస్
Published Mon, Oct 12 2015 12:32 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
Advertisement
Advertisement