ఎయిర్‌టెల్ భారీ విస్తరణ ప్రణాళిక
దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మెగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. నెట్‌వర్క్ మెరుగుదల, సర్వీసుల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా వచ్చే మూడేళ్లలో రూ.60,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేసింది. టెలికం రంగంలో పోటీ తీవ్రతరమవుతుండటం, కాల్ డ్రాప్ సమస్యపై కేంద్రం కొరడా ఝళిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ తాజా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘మౌలిక’ గ్రూప్ అంతంతే
ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9 శాతం. సెప్టెంబర్‌లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.2 శాతం కావడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఎనిమిది పారిశ్రామిక విభాగాల వెయిటేజ్ 38 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు వీటిలో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, స్టీల్ ఉత్పత్తి పేలవ పనితీరు మొత్తం మౌలిక రంగం గ్రూప్ మందగమన స్థితికి కారణమైంది.
లక్ష్యంలో 74 శాతానికి ద్రవ్యలోటు
ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో మొదటి ఏడు నెలలు గడిచేసరికి 74 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ద్రవ్యలోటు 4.11 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గత సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం.
ఆర్థికాభివృద్ధికి ‘తయారీ’ ఊపు
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది.
బ్యాంక్ షేర్లపై ఫండ్స్ మోజు
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లకు బ్యాంక్ షేర్లపై బాగా గురి కుదురుతోంది. బ్యాంక్ షేర్లలో జోరుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల హోల్డింగ్స్ ఏకంగా రూ.85,376 కోట్లకు చేరాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి.
దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఫండ్!
దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.10,000 కోట్ల మూలధనంతో ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఈడీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫండ్‌ను కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలువడానికి ఉపయోగిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు.
బంగారం లావాదేవీలకు ఎక్స్ఛేంజ్!
దేశీయంగా బంగారం ధర నిర్ణయానికి విదేశాలపై ఆధారపడకుండా ఉండడం లక్ష్యంగా ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటు ఆలోచనను కేంద్ర ఆర్థికశాఖ ఆవిష్కరించింది. బంగారం ధరల విషయమై అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పనిలేకుండా ఆభరణాల కొనుగోళ్లు, అమ్మకాలకు వేదికగా ఈ ఎక్స్ఛేంజ్‌ని మలచాలన్నది కేంద్రం యోచనగా కనిపిస్తోంది.
ఏపీలో బ్లూస్టార్ ఏసీల ప్లాంటు!
ఏసీల తయారీలో ఉన్న బ్లూస్టార్ దక్షిణాది ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లా తడ వద్ద ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ ప్రయోజనాలు ఉండడమే ఇందుకు కారణం.
ప్రపంచ అతిపెద్ద పెన్షన్ ఫండ్‌కు నష్టాలు
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పెన్షన్ ఫండ్ అయిన జపాన్ పబ్లి క్ పెన్షన్ ఫండ్‌కు జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీగా నష్టాలొచ్చాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు ఈ ఫండ్‌కు 6,400 కోట్ల డాలర్ల నష్టాలొచ్చాయి. 1.1 లక్షల కోట్ల డాలర్ల విలువైన జపాన్ గవర్నమెంట్ పెన్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ విలువ ఈ క్వార్టర్‌లో దాదాపు 6% క్షీణించిందని ఒక నివేదిక వెల్లడించింది.
బేస్ రేటు కోతలో విదేశీ బ్యాంకులు టాప్
బేస్ రేటు తగ్గింపులో ప్రై వేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు వెనుకంజలో ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బేస్ రేటు తగ్గింపులో విదేశీ బ్యాంకులు టాప్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 27 ప్రభుత్వ బ్యాంకులు బేస్ రేటు తగ్గింపు 0.30-0.70% మధ్యలో, 16 ప్రైవేట్ బ్యాంకుల బేస్ రేటు తగ్గింపు 0.25-0.75% మధ్యలో, 26 విదే శీ బ్యాంకుల బేస్ రేటు తగ్గింపు 0.20-1.05% మధ్యలో ఉందని తెలిపారు.
డిపాజిట్ రేటు తగ్గించిన ఈసీబీ
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. ఈ చర్య వల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచకుండా... ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. ఈసీబీ బెంచ్‌మార్క్ రీఫైనాన్సింగ్ రేటు (తాను ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీరేటు) చరిత్రాత్మక కనిష్ట స్థాయి 0.05 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
చెన్నై వాహన కంపెనీల కష్టాలు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఆటోమొబైల్ కంపెనీలు నెల కాలవ్యవధిలో రెండవసారి ప్లాంట్లను బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నైలో ప్లాంట్లను కలిగి ఉన్న ఫోర్డ్, నిస్సాన్, టీవీఎస్, హ్యుందాయ్, రెనో-నిస్సాన్, అశోక్ లే లాండ్ వంటి కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వాటి ప్లాంట్లను మూసివేశాయి.
ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్‌లోకి ఎన్‌డీటీవీ
ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్ స్పేస్‌లోకి ఎన్‌డీటీవీ మీడియా గ్రూప్ ప్రవేశించింది. స్పెషల్ ఆకేషన్ పేరుతో ఆన్‌లైన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వెంచర్‌కు అమెరికాకు చెందిన సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించామని ఎన్‌డీటీవీ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో నిధులు సమీకరించిందీ కంపెనీ వెల్లడించలేదు.
స్టార్‌లో మా టీవీ విలీనం పూర్తి
మా టెలివిజన్ నెట్‌వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. మా టెలివిజన్‌కు నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విలీనం అధికారికంగా పూర్తయ్యిందని స్టార్ ఇండియా ప్రకటించింది.
డీల్స్..
* ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్... రియల్ ఎస్టేట్ పోర్టల్ కామన్‌ఫ్లోర్ డాట్‌కామ్‌ను 10 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్ల ధరకు కొనుగోలు చేయనున్నదని సమాచారం.
* బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌లో 26 శాతం వాటాను కలిగి ఉన్న సన్‌లైఫ్ ఎష్యూరెన్స్ దాన్ని 49 శాతానికి పెంచుకోనున్నది. డీల్ విలువ రూ. 1,664 కోట్లు.
* జర్మనీకి చెందిన ఐటీ కన్సల్టింగ్ సంస్థ సెలెంట్ ఏజీను భారత్‌కు చెందిన విప్రో కంపెనీ రూ.518 కోట్ల(7.35 కోట్ల యూరోల)కు కొనుగోలు చేసింది.
* నావిగేషన్, ట్రాకింగ్ సొల్యూషన్స్ అందించే మ్యాప్‌మైఇండియా సంస్థలో వ్యూహాత్మక మైనారిటీ వాటాను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
* అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తమ సెల్యులార్ టవర్ల వ్యాపారాన్ని ప్రై వేట్ ఈక్విటీ సంస్థలు టిల్‌మన్ గ్లోబల్ హోల్డింగ్స్, టీపీజీ ఏషియాకి విక్రయించనుంది. ఇందుకోసం వచ్చే ఏడాది జనవరి 15 దాకా అమల్లో ఉండేలా నాన్-బైండింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టిల్‌మన్, టీపీజీ సంస్థలు ఆర్‌కామ్‌కు చెందిన ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా కొనుగోలు చేయనున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 30,000 కోట్లు.
* యాప్ ఆధారిత ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ భారత్, చైనాల్లో విస్తరణ కోసం 210 కోట్ల డాలర్ల(సుమారుగా రూ.13,650 కోట్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. టైగర్ గ్లోబల్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి ఈ స్థాయిలో నిధులు సమీకరించనున్నదని సమాచారం.
గతవారం బిజినెస్
Published Mon, Dec 7 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement