గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Apr 18 2016 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

Last week Business

యూరప్ యూనిట్‌ను విక్రయిస్తున్న టాటా స్టీల్
యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూని ట్లలో ఒకదానిని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు నామమాత్ర మొత్తానికి విక్రయించనున్నది. ఎంత మొత్తానికి అమ్ముతున్నదీ వెల్లడికాలేదు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా  40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది.
 
కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓకు సెబీ ఓకే
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ కనీసం రూ.180 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో రూ.180 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత వాటాదారుల 50 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు.

బిర్లా లైఫ్‌లో అదనపు వాటా విక్రయం పూర్తి
బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి, కెనడాకు చెందిన సన్‌లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో బీఎస్‌ఈకి నివేదించింది.
 
ఫండ్స్ నుంచి రూ.73,000 కోట్ల ఉపసంహరణ

మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీమ్స్ నుంచి గత నెలలో రూ.73,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.  ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ అధికంగా జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా  పెద్ద పెద్ద కంపెనీలు లిక్విడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటాయని, ఇది ప్రతి ఏటా జరిగేదేనని నిపుణులు వివరించారు.
 
49 శాతం తగ్గిన క్విప్ నిధుల సమీకరణ
భారత కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) విధానంలో గత ఆర్థిక సంవత్సరానికి రూ.14,358 కోట్ల నిధులు సమీకరించాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన నిధులు(రూ.28,429 కోట్లు)తో పోల్చితే దాదాపు 50 శాతం తగ్గుదల నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 51 కంపెనీలు క్విప్ ద్వారా నిధులు సమీకరించగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 20 కంపెనీలు మాత్రమే క్విప్‌కు వచ్చాయి.
 
ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ పేమెంట్ బ్యాంక్!
దేశీ టెలికం దిగ్గజ సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ మొబైల్ కామర్స్ అనుబంధ కంపెనీ ‘ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ (ఏఎంఎస్‌ఎల్)కు ఆర్‌బీఐ నుంచి పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ లభించింది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ సంస్థ బీఎస్‌ఈకి నివేదించింది.
 
ద్రవ్యోల్బణం తగ్గింది.. పారిశ్రామికోత్పత్తి పెరిగింది..
 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధి సాధించడం... భారత ఆర్థిక వ్యవస్థకు మంగళకరమైనవని నిపుణులంటున్నారు. ఫిబ్రవరిలో 5.26 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గినట్లు  కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొంది.  
 
53 ఏళ్ల కనిష్టానికి డిపాజిట్ల వృద్ధి రేటు
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో (2015ఏప్రిల్-16 మార్చి) కేవలం 9.9 శాతంగా నమోదయినట్లు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. డిపాజిట్లు ఇంత తక్కువ శాతం వృద్ధి చెందడం 53 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని తెలిపింది. 2014 నుంచీ డిపాజిట్లు మందగమన ధోరణిలో ఉన్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాంకింగ్ వడ్డీరేట్లతో పోల్చితే... వాస్తవిక వడ్డీరేట్లు (బాండ్ల రేట్లకు సంబంధించి) అధికంగా ఉండడం డిపాజిట్లు తగ్గడానికి కారణమని వివరించింది.
 
18 నుంచి డా.రెడ్డీస్ షేర్ల బైబ్యాక్
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం.
 
డీమెర్జర్ దిశగా ఎమ్మార్ ఎంజీఎఫ్
ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ నుంచి దుబాయ్ సంస్థ వైదొలగనున్నట్లు సమాచారం.  భవిష్యత్ వృద్ధి, విస్తరణ నిమిత్తం డీమెర్జర్ స్కీమ్ ద్వారా వ్యాపారాన్ని పునర్వవ్యస్థీకరిస్తున్నామని ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ బీఎస్‌ఈకి నివేదించింది. మరోవైపు ఈ జేవీ డీమెర్జర్ కోసం చర్యలు తీసుకోనున్నామని ఎమ్మార్ ప్రోపర్టీస్ కూడా దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్‌కు నివేదించింది.
 
అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్‌పై మరో వివాదం
అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో న్యాయ వివాదం చోటు చేసుకుంది.  అదానీ సంస్థ క్వీన్స్‌లాండ్‌లోని గలిలీ బేసిన్‌లో 1,200 కోట్ల డాలర్ల మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లీజ్‌లను సవాల్ చేస్తూ, ఈ గలిలీ బేసిన్ పాత యాజమాన్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ  వాన్‌గన్ అండ్ జగలిన్‌గావూ(డబ్ల్యూ అండ్ జే) సంస్థ  ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో తాజాగా  కేసు దాఖలు చేసింది.
 
మాల్యా పాస్‌పోర్ట్ సస్పెన్షన్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సిఫారసులకు అనుగుణంగా భారత విదేశాంగశాఖ ‘ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు’ విజయ్‌మాల్యాపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆయన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను నాలుగువారాలు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న మాల్యా, భారత్‌కు తిరిగి వచ్చే అంశం, అలాగే పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదన్న అంశంపై వారంలోపు స్పందించకపోతే... పాస్‌పోర్ట్ రద్దు చేస్తామని కేంద్రం హెచ్చరించింది.
 
అదరగొట్టిన ఇన్ఫోసిస్
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ  మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో లాభం రూ. 3,097 కోట్లతో పోలిస్తే 16.2 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 13,411 కోట్ల నుంచి రూ.16,550 కోట్లకు పెరిగింది. 23.4 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు, 285 శాతం తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించి ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది.
 
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు

భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు పెరిగాయి.  విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి.
 
జనవరికల్లా తపాలా బ్యాంకు
తపాలా శాఖ త్వరలో బ్యాంకింగ్ రం గంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే జనవరికి గానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు.
 
డీల్స్..
* సాఫ్ట్‌వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్‌స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు.
* కెన్‌బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ చండీగఢ్‌కు చెందిన హిమ్ టెక్నోఫోర్జ్‌లో మైనార్టీ వాటాను రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది. ఎమర్జింగ్ ఇండియా గ్రోత్ ఫండ్ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేశామని కెన్‌బ్యాంక్  వీసీ ఫండ్ పేర్కొంది.
* ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేందుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement