గతవారం బిజినెస్ | last week bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jan 11 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

last week bussiness

హాట్‌స్పాట్స్ విస్తరణ దిశగా బీఎస్‌ఎన్‌ఎల్
దేశవ్యాప్తంగా 40,000 పైచిలుకు వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. 4జీ సర్వీసులు అందించేందుకు కావల్సిన స్పెక్ట్రం తమ వద్ద లేదని, దీంతో ప్రత్యామ్నాయంగా వై-ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సర్వీసులు 4జీ కన్నా వేగంగా ఉంటాయన్నారు.
 
త్వరలో  కొత్త జరిమానా నిబంధనలు !
టెలికం సంస్థలకు సంబంధించి కొత్త జరిమానా నిబంధనలను త్వరలో ఖరారు చేస్తామని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. గత ఏడాది మార్చిలో టెలికం కమిషన్‌కు సంబంధించిన అంతర మంత్రిత్వ శాఖ కొత్త జరిమానా నిబంధనలను ఆమోదించింది. అయితే వీటిని ఇంకా నోటిఫై చేయలేదు.
 
ఎన్‌ఎస్‌ఈ నుంచి ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) గ్రూప్ కంపెనీ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్‌ఎల్) ప్రైవేట్ బ్యాంక్ సూచీని మంగళవారం ప్రారంభించింది. నిఫ్టీ ప్రై వేట్ పేరుతో  ప్రైవేట్ రంగంలోని బ్యాంక్‌ల మార్కెట్ పనితీరును కొలిచే ప్రై వేట్ బ్యాంక్ సూచీను అందుబాటులోకి తెచ్చామని ఐఐఎస్‌ఎల్ తెలిపింది. ఈ ప్రైవేట్ బ్యాంక్ సూచీలో ఎన్‌ఎస్‌ఈలో లిస్టైన పది పెద్ద ప్రైవేట్ బ్యాంకులుంటాయి.
 
11 ఏళ్ల కనిష్టానికి చమురు
డిమాండ్‌ను మించిన సరఫరాకు భారీగా పేరుకుపోయిన నిల్వలు తోడవటంతో ముడి చమురు రేట్లు మరింతగా పతనమవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ రేటు బుధవారం 11.5 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2004 తర్వాత తొలిసారి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 35 డాలర్ల దిగువకు పతనమై.. 34.83 డాలర్ల స్థాయిని తాకింది.
 
ఇక ముద్రా బ్యాంకు
బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ).. ముద్ర లిమిటెడ్‌ను ముద్రా బ్యాంకుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా(ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే.
 
ఫార్మా ‘టెక్నాలజీ’కి రూ.500 కోట్ల ఫండ్!
ఫార్మా టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం దాదాపు రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. తమ తయారీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే  సంస్థలకు దీని ద్వారా చౌకగా రుణాలు అందించాలని భావిస్తోంది. దీంతో పాటు కొత్త యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో అందించేందుకు దాదాపు ఇంతే నిధితో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను కూడా నెలకొల్పడంపై ఫార్మాస్యూటికల్స్ విభాగం కసరత్తు చేస్తోంది.
 
ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో మనోళ్లు
ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో 45 మంది భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు. 30 ఏళ్లలోపు వయసు ప్రాతిపదికగా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు, వృద్ధికి కృషిచేసిన వారి ఆధారంగా ఫోర్బ్స్ ఈ వార్షిక జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 600 మంది చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి స్థానం పొందిన వారిలో ఓవైఓ రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ టాప్‌లో ఉన్నారు.
 
టాటా ప్రాజెక్ట్స్‌కు రైల్వే కాంట్రాక్ట్
టాటా ప్రాజెక్ట్స్.. రూ. 4,328 కోట్ల విలువైన రైల్వే  కారిడార్ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. సరుకు రవాణాకు సంబంధించిన ఈ కారిడార్ కింద  ముంబై-ఢిల్లీ పట్టణాల మధ్య 320 కి.మీ రైల్వే కారిడార్‌ను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనుంది. 48 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
 
రూ.9.5 లక్షల కోట్ల పన్ను వసూళ్లు
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రూ.9.5 లక్షల కోట్ల పన్నులను వసూలు చేసింది. బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న మొత్తంలో ఇది 66 శాతం. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు మొత్తం కలిసి రూ.14.45 లక్షల కోట్లు వసూళ్లు కావాలన్నది బడ్జెట్ లక్ష్యం. ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.7.97 లక్షల కోట్లు కాగా... పరోక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.6.47 లక్షల కోట్లు. కాగా నల్లధనం వెల్లడి పథకం కింద చెల్లింపుల చివరితేదీ అయిన డిసెంబర్ 31 వరకూ రూ.2,428 కోట్లు వసూళ్లు చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా తెలిపారు.
 
భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సేవలు ప్రారంభం
సినిమాలు, సీరియల్స్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో తన సర్వీసులను ప్రారంభించింది. నెలవారీ రూ. 500 నుంచి రూ. 800 దాకా అన్‌లిమిటెడ్ కంటెంట్ ప్యాకేజీలు ఉంటాయని సంస్థ తెలిపింది. భారత్‌లో ప్రధానంగా మూడు రకాల నెలవారీ ప్యాకేజీలను నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. బేసిక్ (రూ.500), స్టాండర్డ్ (రూ. 650), ప్రీమియం (రూ.800) వీటిలో ఉన్నాయి.
 
16 నుంచి ఏఐఐబీ కార్యకలాపాలు
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఈ నెల 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నది. భారత్, చైనా సహా మొత్తం 56 ఇతర దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా గల ఈ సంస్థ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లకు పోటీగా నిలవనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజింగ్ ప్రధాన కార్యాలయంగా ఈ 10,000 కోట్ల డాలర్ల బ్యాంక్ పనిచేయనున్నది. ఈ బ్యాంక్‌లో చైనాకు 30.34 శాతం, భారత్‌కు 8.52 శాతం, రష్యాకు 6.66 శాతం చొప్పున వాటాలున్నాయి.
 
మూడో ఏడాదీ ప్రేమ్‌జీనే
విప్రో ప్రేమ్‌జీ మూడో ఏడాది కూడా అత్యంత దాతృత్వం ఉన్న భారతీయుడిగా నిలిచారు. హురుణ్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం..  విద్యా కార్యక్రమాల కోసం రూ.27,514 కోట్లు విరాళాలిచ్చిన అజిమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణ మూర్తిలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
 
నియామకాలు
* టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్‌వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు.
* రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
డీల్స్..
* కాంటెక్స్‌ట్-అవేర్ పర్సనల్ అసిస్టెంట్ యాప్, షిఫును డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం రూ.53.2 కోట్లు(80 లక్షల డాలర్లు) కు కొనుగోలు చేసింది.
* పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల పోర్టల్ డాగ్‌స్పాట్‌డాట్‌ఇన్‌లోనూ, రీసెర్చ్ సంస్థ ట్రాక్షన్‌లోనూ కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు.
* అలెఫ్ మోబిటెక్ సొల్యూషన్స్ సంస్థలో టాటా క్యాపిటల్ నిర్వహిస్తున్న ప్రై వేట్ ఈక్విటీ ఫండ్.... టాటా క్యాపిటల్ ఇన్నోవేషన్స్ ఫండ్ 50 లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.
* షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థను కొనుగోలు చేయాలన్న బీఎన్‌పీ పారిబా ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా.
* ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ తాజాగా కామన్‌ఫ్లోర్‌డాట్‌కామ్‌ను.. తమ రియల్టీ వ్యాపార విభాగం క్వికర్‌హోమ్స్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.
* 3డీ టెక్నాలజీ ఆధారిత స్మార్ట్‌ఫోన్స్ తయారీ కోసం ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌తో చైనా కంప్యూటింగ్ సంస్థ లెనొవొ చేతులు కలిపింది. ప్రాజెక్ట్ ట్యాంగో పేరిట గూగుల్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement