గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Sep 28 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

Last week Business

గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ నానోడిగ్రీలు
గూగుల్ సంస్థ భారత్‌లో ఆండ్రాయిడ్ నానోడిగ్రీలను ఆఫర్ చేయటం ఆరంభించింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో ఈ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ, దేశీయ యాప్‌లను రూపొందించే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలర్లను తయారు చేయడం లక్ష్యంగా ఈ డిగ్రీలను అందిస్తున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
 
పీఏసీఎల్‌పై రూ. 7,269 కోట్ల జరిమానా
అక్రమంగా, మోసపూరితంగా ప్రజల నుంచి నిధులను సమీకరించినందుకు గాను పీఏసీఎల్, దాని నలుగురు డెరైక్టర్లపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 7,269.5 కోట్ల భారీ జరిమానా విధించింది. సామాన్యులను భారీగా మోసం చేసినందుకు కంపెనీపై సాధ్యమైనంత ఎక్కువ జరిమానా విధించడం  సమంజసమేనని సెబీ వ్యాఖ్యానించింది. నిర్దేశిత మొత్తాన్ని 45 రోజుల్లోగా కట్టాలంటూ పీఏసీఎల్, డెరైక్టర్లను సెబీ ఆదేశించింది.
 
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను
ఉద్యోగ కల్పన, పెద్ద ఎత్తున పన్నుల చెల్లింపు రూపంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు అందిస్తున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. 2011-15 మధ్య కాలంలో అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 4,11,000 ఉద్యోగాలు కల్పించాయని, 20 బిలియన్ డాలర్ల మేర పన్నులు చెల్లించాయని, 2 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.
 
మరిన్ని భద్రతా ప్రమాణాలతో కరెన్సీ నోట్లు
మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్తగా రూ.500, 1,000 కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. నకిలీ నోట్లను తేలిగ్గా గుర్తించేట్లు రెండు అదనపు ఫీచర్లు తాజా నోట్లలో చేరుస్తున్నట్లు తెలియజేసింది. కాగా ప్రస్తుత నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని సైతం ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
 
యూనినార్ ఇక టెలినార్
టెలికం సేవల రంగంలో ఉన్న యూనినార్ పేరు మారింది. ఇక నుంచి ‘టెలినార్’ బ్రాండ్ పేరుతో సేవలు అందించనుంది. నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ భారత్‌లో 2009లో యూనిటెక్‌తో కలిసి యూనినార్‌ను ప్రారంభించింది. టెలివింగ్స్ ఇండియాగా ఉన్న కంపెనీ పేరు సైతం టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్‌గా మార్చారు. బ్రాండింగ్‌కు కంపెనీ దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది.
 
మైక్రోసాఫ్ట్ నుంచి ‘ఆఫీస్ 2016’
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఆఫీస్ 365 సాఫ్ట్‌వేర్ ప్యాకేజీకి లేటెస్ట్ వెర్షన్ ఆఫీస్ 2016ని ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలకు ఇది స్టాండర్డ్, ప్రొఫెషనల్ ప్లస్ ఫార్మాట్లలో లభిస్తుంది. ధర రూ.24,844-రూ. 33,911గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మధ్య స్థాయి ప్యాకేజీ విద్యార్థుల కోసం పర్‌పెచ్యువల్ ప్యాకేజీ ధర రూ. 5,999, బిజినెస్ ఎడిషన్ రేటు రూ.18,499గా ఉంటుందని పేర్కొంది. ఆఫీస్ 365ని ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్లకు కొత్త ఆఫీస్ 2016 యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
 
భారత్‌లో అపస్ గ్రూప్ ఆర్ అండ్ డీ కేంద్రం!
చైనాకు చెందిన ఇంటర్నెట్ సర్వీసుల సంస్థ అపస్ గ్రూప్... భారత్‌లో అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), టెక్నికల్ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ సెంటర్ కోసం వచ్చే మూడేళ్లలో 350 నుంచి 500 వరకూ ఉద్యోగాలివ్వనున్నామని అపస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా అయిన లీ టావో చెప్పారు.
 
మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 18.9 బిలియన్ డాలర్ల సంపదతో నంబర్‌వన్‌గా నిల్చారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది భారత కుబేరుల జాబితాలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 2వ స్థానంలో, 15.9 బిలియన్ డాలర్లతో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిల్చారు.  
 
ఐపీఓ పత్రాలను దాఖలు చేసిన వీఎల్‌సీసీ
బ్యూటీ, వెల్‌నెస్ సంస్థ వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ త్వరలో ఐపీఓకు రానుంది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ కనీసం రూ.400 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రస్తుత వాటాదారుల (ఇండివిజన్ ఇండియా పార్ట్‌నర్స్, లియోన్ ఇంటర్నేషనల్ సంస్థల) నుంచి 37.67 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.
 
విదేశీ కంపెనీలకు మ్యాట్ ఊరట
భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ (కనీస ప్రత్యామ్నాయ పన్ను) నుంచి ఊరట కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టం సవరించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో (గత కాలం నుంచీ వర్తించే విధంగా) ఈ చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
 
ఆంధ్రా బ్యాంక్‌లో పెరిగిన కేంద్రం వాటా
ఆంధ్రా బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా మరో ఎనిమిది శాతం పెరిగింది. ప్రస్తుతం 61.02 శాతంగా ఉన్న కేంద్రం వాటా కొత్తగా సమకూర్చిన మూలధనంతో 69.21 శాతానికి చేరింది. గురువారం జరిగిన ఆంధ్రా బ్యాంక్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రూ. 76.42 ధరకు 4.94 కోట్ల షేర్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం రూ. 378 కోట్ల మూలధనం సమకూర్చడంతో ఆ మేరకు షేర్లను జారీ చేస్తూ ఈజీఎం నిర్ణయం తీసుకుంది.
   
రిలయన్స్ జియోకి ఇంటెక్స్ హ్యాండ్‌సెట్స్

దేశీ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ ఇంటెక్స్.. కొత్తగా టెలికం కార్యకలాపాలు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి 4జీ హ్యాండ్‌సెట్స్‌ను సరఫరా చేయనుంది. దాదాపు 1 లక్ష ఫోన్లకు రిలయన్స్ జియో నుంచి ఆర్డరు వచ్చినట్లు ఇంటెక్స్ వెల్లడించింది. వీటిలో 20,000 హ్యాండ్‌సెట్స్‌ను త్వరలో డెలివరీ చేయనున్నట్లు వివరించింది.
 
ముద్రా రుణ లక్ష్యం రూ.1.22 లక్షల కోట్లు
చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 2016) రూ.1.22 లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ యోజన కింద ఇప్పటికి 37 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు దాదాపు రూ.24,000 కోట్ల రుణ పంపిణీ జరిగిన ట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలియజేశారు.
 
ఫోక్స్‌వ్యాగన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మాథియస్ ముల్లర్ నియమితులయ్యారు.
 
డీల్స్..
* ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో 10.2 శాతం వాటాను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ రూ.1,310 కోట్లకు కొనుగోలు చేసింది.
* అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమైన జపాక్ మొబైల్ గేమ్స్‌లో 10% వాటాను చైనాకు చెందిన లీడ్ ఈస్టర్న్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కోటిన్నర డాలర్లకు కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియాకు చెందిన ఆల్కేమియా నుంచి పధాన శస్త్రచికిత్సల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వినియోగించే ఫోండా పారినక్స్‌పై మేధోసంపత్తి (ఐపీ) హక్కులను డాక్టర్ రెడ్డీస్ రూ. 115 కోట్లకు కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement