గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, May 2 2016 1:37 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

Last week Business

ఐపీఓకు పరాగ్ మిల్క్ ఫుడ్స్
డైరీ సంస్థ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఐపీఓ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నది. మే 6న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లనే కాకుండా 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా కంపెనీ జారీ చేయనుంది.  
 
రికార్డ్ స్థాయిలో ఎఫ్‌డీఐలు
భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరుగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి  రికార్డ్ స్థాయిలో 5,100 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయిలో ఎఫ్‌డీఐలు ఇంతవరకూ ఎన్నడూ రాలేదని డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ వెల్లడించారు.
 
రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్
ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్.. బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను తగ్గించింది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్‌ఆర్‌ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72 శాతానికి దిగింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది.
 
టెలిఫోన్ వినియోగదారులు-105 కోట్లు
దేశంలోని టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరిలో 105.18 కోట్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. ఒకవైపు వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. వైర్‌లెస్ వినియోగదారుల పెరుగుదలే మొత్తం యూజర్ల పెరుగుదలకు కారణమని వివరించింది. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 101.79 కోట్ల నుంచి 102.66 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.53 కోట్ల నుంచి 2.52 కోట్లకు తగ్గినట్లు తెలిపింది.
 
మెటల్ ఎక్స్ ఆఫర్‌కు హిందాల్కో ఓకే!
ఆస్ట్రేలియాకు చెందిన గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిసై ్టన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్‌లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు.
 
యాపిల్ షాకింగ్ ఫలితాలు
యాపిల్ ప్రకటించిన 2016, జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు కంపెనీ ఇన్వెస్టర్లకు షాకిచ్చాయి. గడిచిన పదమూడేళ్లలో తొలిసారిగా ఆదాయం క్షీణించింది. 2015 ఇదే త్రైమాసికంలో ఆదాయం 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 13 శాతం మేర దిగజారి 50.6 డాలర్లకు పడిపోయింది. నికర లాభం కూడా 22 శాతం క్షీణతతో 13.6 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు దిగజారింది.
 
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం సక్సెస్
కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన తొలి డిజిన్వెస్ట్‌మెంట్, ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయం విజయవంతమైంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 156.79 కోట్ల షేర్లకు బిడ్‌లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన 25.15 కోట్ల షేర్లకు గాను 41.45 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. మొత్తం మీద ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు సమకూరాయి.
 
సహారా ఆస్తులు తెలపాలి: సుప్రీం

సహారా మొత్తం ఆస్తుల వివరాలను సీల్డ్ కవర్‌లో తెలియజేయాలని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మదుపరులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించగలరా? లేదా అన్న అంశం నిర్ధారించడానికి ఆస్తుల వివరాలు వెల్లడికావడం అవసరమని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి తమ ఆదేశాలు పాటించేంతవరకూ పెరోల్‌కు వీలు ఉండబోదని స్పష్టం చేసింది.
 
అధిక వేతన సీఈఓల్లో మనోళ్లు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పది మంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి (2.22 కోట్ల డాలర్లు) 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ (2.45 కోట్ల డాలర్లు) ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వంద మంది జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్‌ల తో పాటు సత్య నాదెళ్ల (26వ స్థానం-1.83 కోట్ల డాలర్లు) కూడా ఉన్నారు.
 
ఎక్సైజ్ సుంకం తొలగింపులేదు: జైట్లీ
వెండి యేతర ఆభరణాలపై ఒక శాతం ఎకై ్సజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు.
 
13 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం!
యాక్సిస్ బ్యాంక్‌లో ప్రస్తుతమున్న విదేశీ వాటా పరిమితిని 62 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సహా మొత్తం 13,030 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) మొత్తం 14 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించి ఐదింటికి ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు.  
 
భారత్‌కు వచ్చే ఉద్దేశం లేదు: మాల్యా

బ్యాంకుల చేత ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ముద్ర వేయించుకుని బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా భారత్‌కు వచ్చే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించారు. తనకు సంబంధించి పరిస్థితులు తీవ్రంగా ఉన్న భారత్‌కు తిరిగి వెళ్లే తక్షణ ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ‘బలవంతపు ప్రవాస’ స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
 
డీల్స్..
* రేల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్‌సైట్ రైల్‌యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement