నియామకాలు
* ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు.
* ఆర్‌కే టాకూర్ యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
* కార్పొరేషన్ బ్యాంక్ ఎండీగా గార్గ్ నియమితులయ్యారు.
* ఇండియన్ బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు.
* ఎస్‌బీఐ ఎండీగా పి.కె.గుప్తా నియమితులయ్యారు.
* రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ సీఈవోగా జాసన్ కొఠారి పదవీ బాధ్యతలు చేపట్టారు.
కీలక పరిశ్రమల వృద్ధి రేటు 3.2 శాతం
ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణం.
చప్పగా కాఫీడే లిస్టింగ్
కాఫీ డే ఎంటర్‌ప్రెజైస్ స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.328తో పోల్చితే కాఫీ డే ఎంటర్‌ప్రై జెస్ షేర్ ధర బీఎస్‌ఈలో 4.5 శాతం నష్టంతో రూ.313 వద్ద లిస్టయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 18 శాతం నష్టంతో రూ.270 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఇదే తీరు. ఇంట్రా డేలో రూ.266(19 శాతం) కనిష్ట స్థాయికి పతనమైంది. మార్కెట్ క్యాప్ రూ.5,565 కోట్లుగా నమోదైంది.
ఇక మేడిన్ చైనా విమానాలు
విమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని సోమవారం ఆవిష్కరించింది.
బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు.
వచ్చే బడ్జెట్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు!
కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ సూచనాప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని ఆర్థికమంత్రి గత బడ్జెట్‌లో ప్రకటించారు.
రెండో షెడ్యూల్ జాబితాలో బంధన్ బ్యాంక్
ఇటీవల ప్రారంభమైన బంధన్ బ్యాంక్‌ను ఆర్‌బీఐ చట్టం రెండో షెడ్యూల్ జాబితాలో చేర్చినట్లు ఆర్ బీఐ వెల్లడించింది. దీంతో బంధన్ బ్యాంక్ ఆర్‌బీఐ నుంచి బ్యాంకు రేటుకు రుణాలను తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుకు క్లియరింగ్ హౌసింగ్ సంబంధిత సభ్యత్వాన్ని ఇచ్చింది.
భారత్‌లోకి యాపిల్ వాచ్‌లు
భారత్‌లో యాపిల్ స్మార్ట్‌వాచ్‌ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటి ధర రూ.30,900-రూ.14 లక్షల శ్రేణిలో ఉంది. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు ‘యాపిల్ వాచ్ ఎడిషన్’,‘యాపిల్ వాచ్’,‘యాపిల్ వాచ్ స్పోర్ట్’ అనే మూడు వేరియంట్లలో, 38 మిల్లీమీటర్లు, 42 మిల్లీమీటర్లు అనే రెండు డిస్‌ప్లే పరిమాణాల్లో లభ్యమవుతున్నాయి.
ఈ యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో కాల్ రిసీవింగ్, ఈ-మెయిల్స్ చెకింగ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌లు వినియోగదారులకు యాపిల్ ప్రీమియమ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. రూ.14 లక్షల విలువైన యాపిల్ టాప్ మోడల్‌ను కస్టమర్ల ఆర్డర్‌పైన మాత్రమే తెప్పిస్తామని యాపిల్ రిటైల్ ప్రతినిధి తెలిపారు.
రూ.70 వద్ద ఐడీఎఫ్‌సీ బ్యాంక్ లిస్టింగ్
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు శుక్రవారం బీఎస్‌ఈలో రూ. 70.50 వద్ద లిస్టయ్యింది. షేరు చివరికి బిఎస్‌ఈలో 70.70 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ. 70.40 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ బ్యాంకు స్క్రిప్ రూ. 73.45-67 మధ్య తిరుగాడింది. రెండు ఎక్స్చేంజీల్లోను కలిపి సుమారు రెండున్నర కోట్ల షేర్లు చేతులు మారాయి.
డీల్స్..
* దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా.
* ఫ్రాన్స్‌కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్‌స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్‌స్తోమ్ తెలిపింది.
* ఆసియా దేశాల మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి ప్రై వేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ అమెరికాకు చెందిన మీడియా హోల్డింగ్ కంపెనీ చెర్నిన్ గ్రూప్‌తో చేతులు కలిపింది. 300 మిలియన్ డాలర్ల నిధులతో.. ఎమరాల్డ్ మీడియా పేరిట ప్రత్యేక వెంచర్ ఏర్పాటు చేసింది.
గతవారం బిజినెస్
Published Mon, Nov 9 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM
Advertisement
Advertisement