ఎన్‌ఆర్‌ఐలు ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చందాదారులుగా చేరేందుకు ప్రవాస భారతీయులను (ఎన్‌ఆర్‌ఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. తద్వారా వారికీ వృద్ధాప్య ఆదాయ భద్రతా పథకంలో చేరేందుకు వీలుకలగనుంది. సాధారణ బ్యాంకింగ్ మార్గాల ద్వారా లేదా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్ట నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐలు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చందాదారులుగా ఉండవచ్చు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు?
పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్‌మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికికన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం.
731 మిలియన్ డాలర్లకు క్లౌడ్ సర్వీసెస్
దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది అఖరు నాటికి 731 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్‌లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని వివరించింది.
ఐదే ళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు!
దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని ఎన్‌ఏఎస్‌ఈ అంచనా వేస్తోంది. గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు.
చైనా సంపన్నుల్లో వాంగ్ టాప్
ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన చైనా సంపన్నుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్లిన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన సంపద 13.2 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 30 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఆయన ఈసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 21.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బంగారు భారత్
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 642 టన్నుల పసిడి వినియోగంతో చైనాను అధిగమించి మరోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిల్చింది. 579 టన్నుల బంగారం వినియోగంతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ?
ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది.
పేటీఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు
ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలసీదారులు ఆన్‌లైన్ ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యం కల్పించేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు రూ.1,000 కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.
క్యూ3లో మందగించిన అమెరికా వృద్ధి
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించింది. రెండో త్రైమాసికంలో 3.9 శాతంగా నమోదైన వృద్ధి.. క్యూ3లో 1.5 శాతానికి పరిమితమైంది. నిల్వలు పేరుకుపోవడం వల్ల వ్యాపార సంస్థలు కొత్తగా మరిన్ని కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు తెలిపారు.
వచ్చే నెల 6న ఐడీఎఫ్‌సీ బ్యాంక్ లిస్టింగ్!
కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వచ్చే నెల 6న స్టాక్‌మార్కెట్లో లిస్టవుతాయని అంచనా. ఈ నెల 5 వరకూ ఐడీఎఫ్‌సీ షేర్లున్న వాటాదారులకి ఒక్కో ఐడీఎఫ్‌సీ షేర్‌కు ఒక్కో ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ కేటాయిస్తామని కంపెనీ పేర్కొంది. ఐడీఎఫ్‌సీ పుస్తక విలువ రూ.60గా ఉంది. ఈ లెక్కన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ విలువ రూ.39.11గా ఉండొచ్చని అంచనా.
5 నుంచి గోల్డ్ బాండ్ల స్కీమ్
పసిడి బాండ్ల పథకాన్ని నవంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రారంభిస్తోంది. పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన బాండ్లపై 2.75 శాతం వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు ...బ్యాంకులు, నోటిఫై చేసిన నిర్దిష్ట పోస్టాఫీసుల ద్వారా నవంబర్ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకూ బాండ్ల కొనుగోలు అవకాశం ఉంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల నుంచీ ‘ఎగ్జిట్’ ఆఫర్ ఉంటుంది.
విమానయానం మరింత భారం!
ఒకవైపు విమాన చార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈ విధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది.
వ్యాపారంలో బెస్ట్.. భారత్‌కు 130వ స్థానం
కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి.
డీల్స్..
* సూపర్ వాస్మోల్ 33 తదితర కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ హైజీనిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ రూ. 216 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
* రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో జపాన్‌కి చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ మరో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్ లైఫ్‌లో నిప్పన్ లైఫ్ వాటాలు 49 శాతానికి పెరుగుతాయి.
* బయోమ్యాబ్ హోల్డింగ్‌లో తనకున్న 25 శాతం వాటాలను విక్రయిస్తున్నట్లు ఔషధ దిగ్గజం సిప్లా వెల్లడించింది. కంపెనీలో 75 శాతం పైగా వాటాలున్న బయోమ్యాబ్ బ్రిలియంట్ సంస్థ వీటిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ సుమారు 26 మిలియన్ డాలర్లుగా ఉండనుంది.
గతవారం బిజినెస్
Published Mon, Nov 2 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM
Advertisement
Advertisement