నియామకాలు..
* రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు.
* బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్‌లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
నవ భారత్ వెంచర్స్ బోనస్ ఇష్యూ
ప్రతిపాదిత బోనస్ షేర్ల ఇష్యూకి నవ భారత్ వెంచర్స్ షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ చేసే షేరు ఒక్కింటికి మరొక షేరు లభిస్తుంది. బోనస్ ఇష్యూకి సెప్టెంబర్ 1ని రికార్డు తేదిగా నిర్ణయించారు. బోనస్ ఇష్యూ తర్వాత పెయిడప్ క్యాపిటల్ 17,85,75,482 షేర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
11 వేల కోట్ల సమీకరణలో ఎస్‌బీఐ
ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.11 వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు టైర్ 1 అదనపు మూల ధనం సమీకరణకు అనుమతిస్తూ బ్యాంక్ డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బాసెల్-3 కాంప్లియెంట్ డెట్ ఇనుస్ట్రుమెంట్లను డాలర్ లేదా రూపాయిల్లో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.
టెక్నాలజీ స్టార్టప్‌లలో భారత్‌కు మూడో ర్యాంక్
ప్రపంచ వ్యాప్తంగా పురుడు పోసుకుంటున్న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు అసోచామ్ వెల్లడించింది. అమెరికా ప్రథమ స్థానంలో, యూకే రెండో స్థానంలో ఉన్నాయి. దేశీయంగా చూస్తే బెంగళూరు అత్యధిక స్టార్టప్‌లను ఆకర్షిస్తూ అగ్ర స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2015 వరకు అమెరికాలో 47వేల టెక్నాలజీ స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి. యూకేలో 4,500, భారత్‌లో 4,200 స్టార్టప్‌లు తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇక దేశంలో బెంగళూరు 26 శాతం టెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా నిలిచింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ 23 శాతం, ముంబై 17 శాతం, హైదరాబాద్ 8 శాతం, చెన్నై 6 శాతం స్టార్టప్‌లను ఆకర్షించాయి.
జీఎంఆర్ చేతికి గోవా ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్
మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్‌ఫ్రా తాజాగా గోవాలో విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. ఉత్తర గోవాలోని మోపాలో చేపట్టే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 3,300 కోట్లుగా ఉంటుందని అంచనా. బీవోవోటీ (బిల్డ్, వోన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన దీన్ని నిర్మించాల్సి ఉంటుంది.
టాప్-10 సంపన్న దేశాల్లో భారత్
ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల (మొత్తం వ్యక్తులది) సంపదతో ఈ స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
త్వరలో ఎయిర్‌సెల్-ఆర్‌కామ్ విలీనం!
ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల మధ్య వచ్చే వారంలో సంతకాలు జరిగే అవకాశముంది. ఈ కంపెనీల మధ్య టర్మ్ షీట్ ఖరారయ్యింది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కంపెనీల విలీనం విజయవంతమైతే మూడో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భవిస్తుంది.
కీలక బ్యాంకులుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ‘వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా’ ప్రకటించింది. ఇలాంటి హోదా ఆ బ్యాంకులకు లభించడం వరుసగా ఇది రెండవ సంవత్సరం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవసీకృతంగా చాలా ప్రాముఖ్యతగలవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం.
మోబిక్విక్‌లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు!
దక్షిణాఫ్రికాకు చెందిన పేమెంట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ‘నెట్ 1’ కంపెనీ.. భారత్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ‘మోబిక్విక్’లో రూ.268 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనున్నది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒక వ్యూహాత్మక సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం కుదిరింది. దీంతో నెట్ 1కి చెందిన వర్చువల్ కార్డ్ టెక్నాలజీ ఇకపై అన్ని మోబిక్విక్ వాలెట్లతో అనుసంధానం కానున్నది. మోబిక్విక్‌కు 3.2 కోట్ల మొబైల్ వాలెట్ యూజర్లు ఉన్నారు.
డీల్స్..
* శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన బయోటెక్ కంపెనీ మెడివేషన్‌ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనుంది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ విషయంలో ప్రత్యేకీకరణ సాధిస్తున్న మెడివేషన్‌ను 1,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నామని ఫైజర్ పేర్కొంది. ఈ డీల్ విలువ మెడివేషన్ కంపెనీ మార్కెట్ విలువ(1,110 కోట్ల డాలర్ల)కంటే ఎక్కువ కావడం విశేషం.
* యాక్సెంచర్, ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ కంపెనీ రెడ్‌కోర్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ కొనుగోలు వివరాలు తెలియలేదు.
* సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా స్మార్ట్ షెడ్యూలింగ్ యాప్ ‘జెనీ’ని కొనుగోలు చేసింది. గూగుల్, యాపిల్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాన్ని మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలనే లక్ష్యంలో భాగంగానే కంపెనీ ఈ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. లావాదేవీకి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు.
గతవారం బిజినెస్
Published Mon, Aug 29 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
Advertisement