![Reserve Bank of India Announces New Rs 50 Banknotes with Governor Sanjay Malhotra Signature](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/notes0102.jpg.webp?itok=8flfdQ8S)
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో 2024 డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించారు. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉన్న నోట్లు చట్టబద్ధంగా యథావిధిగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొత్త నోట్లు మహాత్మా గాంధీ ఇమేజ్‌తో కొత్త సిరీస్‌లోని రూ.50 నోట్లనే పోలి ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. కేవలం శక్తికాంత దాస్ సంతకం స్థానంలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.
శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేత
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేకంటే ముందు వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment