గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Jun 27 2016 2:04 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

Last week Business

బ్రెగ్జిట్ కల్లోలం
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తాజా రిఫరెండంలో బ్రిటన్ ప్రజలు నిర్ణయించడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. పౌండు, యూరోలతో సహా వర్ధమాన కరెన్సీలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారం రివ్వున ఎగిసింది.
   
ఎఫ్‌డీఐలకు మరోసారి రెడ్‌కార్పెట్

మోదీ సర్కారు మరోమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. రక్షణ, పౌర విమానయాన, ఫార్మా, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించింది. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో (డీటీహెచ్), కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రై వేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  
   
ఆదాయ పన్ను చెల్లించకుంటే జైలుకే
ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసిం ది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుం డా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాస్ సబ్సీడీని రద్దు చేయనున్నది.
    
సాఫ్ట్‌బ్యాంక్‌కు అరోరా గుడ్  బై
సాఫ్ట్‌బ్యాంక్ కీలక పదవుల నుంచి నికేశ్ అరోరా వైదొలిగారు. ఈయన సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవో, రిప్రజెంటెటివ్ ైడె రెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. ఇది జూన్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈయన సాఫ్ట్‌బ్యాంక్ అడ్వైజర్‌గా కొత్తగా ఏడాదిపాటు సేవలు అందించనున్నారు. ఇక నికేశ్ అరోరా స్థానాన్ని కెన్ మియాచి భర్తీ చేయనున్నారు.
   
రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు యాపిల్‌కు ఊరట
విశిష్టమైన ఉత్పత్తులను విక్రయించే యాపిల్ వంటి కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధన విషయంలో కొంత వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. 30 శాతం విడిభాగాలను దేశీయంగానే సమీకరించాలన్న తప్పనిసరి నిబంధనలో మూడేళ్ల వెసులుబాటును కల్పిస్తున్నట్లు డీఐపీపీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ చెప్పారు.
    
నిధుల సమీకరణ దిశగా జేఎస్‌పీఎల్
నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) కంపెనీ, ఎన్‌సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధులు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపిందని జేఎస్‌పీఎల్ వెల్లడించింది.
   
మెగా స్పెక్ట్రం వేలానికి గ్రీన్‌సిగ్నల్
దేశీ టెలికం రంగంలో మెగా స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్ అయింది. మొత్తం ఏడు రకాల బ్యాండ్‌విడ్త్‌లలో స్పెక్ట్రంను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.5.66 లక్షల కోట్లు జమవుతాయని అంచనా. ప్రధానంగా హైస్పీడ్ 4జీ డేటా, వాయిస్ సేవలను టెల్కోలు విస్తరించేందుకు ఈ స్పెక్ట్రంతో వీలవుతుంది.
   
సన్ ఫార్మా షేర్ల బై బ్యాక్
సన్‌ఫార్మా కంపెనీ రూ.675 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనున్నది. ఇటీవల జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో బై బ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మిగులు నిధులను ఈక్విటీ వాటాదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌కు రూ.900 చొప్పున 75 లక్షల ఈక్విటీ షేర్లను బై బ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బై బ్యాక్‌కు రికార్డ్ తేదీని వచ్చే నెల 15గా నిర్ణయించింది.
   
టాటా సన్స్‌కు భారీ జరిమానా
జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమో కు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చె ల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్ ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో  జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్  ఆర్బిట్రేషన్ కోర్ట్  ఆదేశాలు జారీ చేసిందని ఎన్‌టీటీ డొకొమో తెలిపింది.
 
టయోటా డీజిల్ ఇంజిన్ ప్లాంటు రెడీ
జపాన్ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టయోటా’ తాజాగా రూ.1,100 కోట్ల వ్యయంతో బెంగళూరులో నిర్మించిన డీజిల్ ఇంజిన్ తయారీ ప్లాంటును గురువారం లాంఛనంగా ప్రారంభించింది. కంపెనీ ఇందులో శక్తివంతమైన గ్లోబల్ డీజిల్ (జీడీ) ఇంజిన్లను తయారు చేయనున్నది. దేశంలో కంపెనీకి ఇది తొలి జీడీ ఇంజిన్ ప్లాంట్. ఇక్కడ 1జీడీ-ఎఫ్‌టీవీ 2.8 లీటర్, 2జీడీ-ఎఫ్‌టీవీ 2.4 లీటర్ ఇంజిన్లను రూపొందిస్తామని కంపెనీ పేర్కొంది.  
 
రాస్‌నెఫ్ట్ వాటాపై దేశీ చమురు సంస్థల కన్ను
రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్‌సీలో  19.5 శాతం వాటాను రష్యా విక్రయించనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
 
డీల్స్..
* చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో అత్యాధునిక హెల్త్‌కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా హైనాన్ ఎకొలాజికల్ స్మార్ట్ సిటీ గ్రూప్ (హెచ్‌ఈఎస్‌సీజీ)తో అపోలో హాస్పిటల్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
* భారత సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్, సెర్నోవ ఫైనాన్షియల్ కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. తర్వాతి తరం క్లౌడ్ ఆధారిత డెరివేటివ్ పోస్ట్ ట్రేడ్ ప్రాసెసింగ్ సర్వీస్‌ను అందించడం కోసం ఈ సంస్థలు  ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
* స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్‌ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం   కారణంగా ఈ జేవీలో దైచీ వాటా  26 శాతం నుంచి 44 శాతానికి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26 శాతం వాటా ఉంది.
* మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్, లండన్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోని’ను కొనుగోలు చేసింది. డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.
* టెక్ మహీంద్రా కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీ తాజాగా  ఇంగ్లండ్‌కు చెందిన బయో ఏజెన్సీ కంపెనీని 4.5 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది.
* ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఐ కేర్  చెయిన్, ‘దృష్టి’లో పెట్టుబడులు పెట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement